సామాజిక సమస్యల పరిష్కార దిశలో వేగంగా అడుగులేస్తున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌.


రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘంలో ప్రతి సంవత్సరం అఖిల భారతీయ స్థాయిలో మూడు సమావేశాలు నిర్వహించబడుతాయి. అందులో 1) ప్రతి సంవత్సరం మార్చి మాసంలో అఖిల భారత ప్రతినిధి సభ, (సర్వసభ్య సమావేశం) 2) జూలై మాసంలో కార్యనిర్వాహక సమావేశం (ఆ సమావేశంలో ప్రాంత ప్రచారక్‌ ఆపై బాధ్యత ఉన్న వాళ్ళు మరియు వివిధ క్షేత్ర కార్యకర్తలు) 3) అక్టోబర్‌ మాసంలో అఖిల భారత కార్యకారిణి సమావేశం (ఈ సమావేశంలో ప్రాంత సంఘ చాలక్‌, ప్రాంత కార్యవాహ, ప్రాంత ప్రచారక్‌ ఆపై కార్యకర్తలు వారితోపాటు దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ క్షేత్రాలలోని సంఘటనా కార్యదర్శులు మరియు ఎంపిక చేసిన కొద్దిమంది.) ఈ విధంగా వివిధ స్థాయి కార్యకర్తలు పై సమావేశాలలో పాల్గొంటారు.

ఈ సంవత్సరం అక్టోబర్‌ మాసంలో జరిగిన అఖిలభారత కార్యకారిణి సమావేశాలు భాగ్యనగరం లోని అన్నోజిగూడలో ఉన్న శ్రీవిద్యావిహార్‌ ఉన్నత పాఠశాలలో అక్టోబర్‌ 23,24,25తేదీలలో నిర్వహించబడ్డాయి. పూజనీయ సర్‌సంఘచాలక్‌ శ్రీ మోహన్‌ భాగవత్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీ భయ్యాజీ జోషి (సర్‌ కార్యవాహ) సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సంఘ పని విస్తరణ విషయంలో, సామాజిక సమస్యలు పరిష్కారం కోసం చేయవలసిన పనుల విషయంలో విసృత్తంగా చర్చించబడ్డాయి. ఈ సందర్భంలో వచ్చిన నివేదికలో సంఘం ఈ రోజున 44 వేల గ్రామాలలో 70 వేలకు పైగా శాఖలు, సాప్తాహికలు, సంఘ మండలులు నడుస్త్తున్నాయని ఆ నివేదిక ద్వారా తెలిసింది. 2017 మార్చిలో జరిగే ప్రతినిధి సభ వరకు 75 వేల శాఖలుగా విస్తరించాలని నిర్ణయించబడ్డాయి. సామాజిక సమరసత, ఐక్యత ఈ రెండు ఏ కాలంలోనైనా సమాజాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. ఈ దిశలో వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సర్‌ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి పిలుపునిచ్చారు. సమాజంలోని కుల వివక్షతను రూపుమాపాలని అట్లాగే సమాజంలో మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా వారు స్వేచ్ఛగా జీవించే వాతావరణం నిర్మాణం చేయవల్సిన బాధ్యత ఉందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అందులో ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో ఇస్లాం జీహాది శక్తులు హిందుత్వ సంస్థల కార్యకర్తలపై చేస్తున్న దాడులు హత్యాకాండలను నివారించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని తీవ్రంగా గర్హించారు. శాంతిభద్రతలను కాపాడడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న తీరు శోచనీయమైన విషయం. ప్రభుత్వాలు కఠినంగా ఈ దాడులను అరికట్టి శాంతిభద్రతలను కాపాడాలని పిలుపు నిచ్చారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోది పిలుపు మేరకు దేశంలో స్వచ్ఛ భారత్‌ ఉద్యమంలో క్రియశీలంగా ప్రజలు భాగస్వాములవుతున్నారు. అట్లాగే ఆరోగ్యవంతమైన భారత్‌ నిర్మించడానికి కూడా దేశప్రజలందరూ ముందుకు రావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అక్టోబర్‌ 23,24,25 తేదీలలో పత్రికా విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించ బడ్డాయి. 23వ తేదీన జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మా|| శ్రీ భాగయ్యగారు (సహ సర్‌ కార్యవాహ) పత్రికా విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. 23 నుంచి ప్రారంభమయ్యే కార్యకారిణి సమావేశాలలో 2 తీర్మానాలు చేయ బోతున్నట్లుగా తెలియజేశారు. అందులో 1) కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై సీపీఎం కార్యకర్తలు చేస్తున్న అమానుష దాడులను తీవ్రంగా ఖండిస్తూ 2) ఈ రోజు సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక రాజకీయ సమస్యలకు పరిష్కారం చూపించగలిగే దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మతా మానవ దర్శనం ఈ రెండు అంశాలపై తీర్మానం చేస్తారు. 24వ తేదీ నాడు పత్రికా విలేకరుల సమావేశంలో అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ శ్రీ మన్మోహన్‌ వైద్య మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1992 సంవత్సరంలో నిర్వహించిన పృథ్వీ సదస్సులో 172 దేశాల ప్రతినిధులు పాల్గొని పపంచ శాంతి సమీకృత అభివృద్ధి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా ప్రకటించారు. అట్లాగే 2015వ సంవత్సరంలో పారిస్‌లో జరిగిన పృథ్వీ సదస్సులో భూతాపాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అంగీకరించాయి. కానీ ఆచరణలో ఆ దేశాలు ఈ లక్ష్యాలకు దూరంగా ప్రయాణం చేస్తున్నాయి. దాని కారణంగా ప్రపంచంలో అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని అఖిల భారత కార్యకారిణి మండలి అభిప్రాయపడినట్లుగా వివరించారు. సమాజంలో ప్రకృతి, కుటుంబం, సమాజం వీటిమధ్య సమతుల్యతను కాపాడబడి నప్పుడే ఎలాంటి సంఘర్షణలు లేని శాంతియుత జీవనం ప్రపంచంలో కొనసాగేందుకు దారులు ఏర్పడతాయి. ఈ విషయాలనే దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఏకత్మతా మానవ దర్శనంలో వివరించారు. ఈనాటి పరిస్థితులకు ఆ ఆలోచనలే ప్రత్యామ్నాయం. శ్రీ నందకుమార్‌ (అఖిల భారత సహ ప్రచార ప్రముఖ్‌) మాట్లాడుతూ కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై సీపీఎం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని అఖిల భారతీయ కార్యకారిణి మండలి ఆగ్రహం వ్యక్తం చేసిందని; అక్కడ రోజురోజుకి ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆదరణ పెరుగుతుండగా, దాన్ని తుడిచివేయాలని ీపీఎం కంకణం కట్టుకుందని దుయ్యబట్టింది. 28 ఏప్రీల్‌1969న వడిక్కల రామకృష్ణన్‌ అనే 19 ఏళ్ల స్వయంసేవక్‌ను పట్టపగలు అతి దారుణంగా రోడ్డుపై హత్య చేశారని, అందులో ప్రథమ నిందితుడు నేటి కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ అని ఆరోపించింది. కేరళలోని ఒక్క కన్నూరు జిల్లాలోనే 82 మందిని హత్య చేశారంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని బైఠక్‌లో సభ్యులు భావించారు. ఐదు నెలల కాలంలో ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను సీపీఎం పొట్టన పెట్టుకుం దన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలను సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని సభ్యులు పిలుపునిచ్చారు. 25వ తేదీన జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో శ్రీ భయ్యాజీ జోషి (సర్‌ కార్యవాహ) పత్రికా విలేకరుల సమావేశంలో మూడు రోజులు చర్చించిన విషయాలను సంక్షిప్తంగా వివరించారు. దాంతోపాటు విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానం సంక్షిప్తంగా... కళాకారులకు వివక్ష, సరిహద్దులు ఉండవన్నారు. పాకిస్తాన్‌ కళాకారులు ఇక్కడికి రాబోమంటే నష్టమేమి లేదు వారి పైనే ఆధారపడే పద్ధతికి స్వస్తి చెప్పాలన్నారు. మన దేశంలో కళాకారులకు కొరత లేదన్నారు. ప్రతి ప్రాణిలో ఈశ్వరుడు ఉన్నాడని మనం చెప్తాము. మన సాటి మనిషిలో కూడా ఈశ్వరుడు ఉంటాడు అంటూ సాయిబాబాలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. సాయిబాబా మందిరం కట్టాలా? వద్దా? అనేది ఆయన భక్తుల ఇష్టమన్నారు.

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో హిందూ సమాజంపై జీహాదీ మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. స్వచ్ఛ భారత్‌ను సమాజం తమ బాధ్యతగా భావించాలి. యూపీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కల్పించుకోదు. పోరాడాల్సింది, గెలవాల్సింది భాజపానే.

రామమందిర నిర్మాణ ఉద్యమం 1984 నుంచి కొనసాగుతోంది. అక్కడ మందిర నిర్మాణం జరగాలని హిందూ సమాజం ఆకాంక్ష. న్యాయపరమైన సమస్యలతో ఆలస్యమవుతోంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది. లక్నో కోర్టు నిర్ణయంతో అక్కడ రామమందిరం మినహా ఏ నిర్మాణం జరిగే అవకాశం లేదు.

మోది సర్కారు పనితీరుపై సమయా సమయాలలో మా అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్య పాలనలో ప్రభుత్వాల పనితీరును వివిధ సంస్థలు విశ్లేషణ చేస్తూ ఉంటాయి. సలహాలు కూడా ఇస్తూ ఉంటాయి. కాని వాటితో పెద్దగా లాభం ఉండదు. ప్రభుత్వమే తనంతట తానుగా సమీక్ష చేసుకుని పాలనను సక్రమంగా నడిపించేందుకు ప్రయత్నించాలి.

పాకిస్తాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదంపై స్పందించటం మన పని కాదు. అక్కడి ప్రజలు, ప్రభుత్వం స్పందించాలి. తీవ్రవాద శిక్షణా కేంద్రాలు పాక్‌లో ఉన్నాయని ప్రపంచం భావిస్తే ఆ మేరకు పాక్‌ ప్రభుత్వం ఆ శిబిరాలపై చర్యలు తీసుకునే విధంగా పాకిస్తాన్‌ మీద ఒత్తిడి తీసుకుని రావాలి.

గోరక్షకులకు ప్రభుత్వం భద్రత కల్పించాలి. దేశవాళి గో సంతతిని పెంచాలి. జన్యుమార్పిడి విత్తనాలతో ఉత్పత్తి పెంచడం వల్ల భూసారం దెబ్బతినకుండా చూడాలి. చైనా, విదేశీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం మనదగ్గర ఉంటే మన వస్తువులనే వాడాలి. మొత్తం మీద అఖిల భారత కార్యకారిణి సమావేశాలు ప్రధానంగా సామాజిక విషయాలపైన దృష్టి సారించినట్లుగా కనబడుతోంది.