ఇంటర్ నెట్ లో విజయవిపంచి పాటల పుస్తకం

డిశంబర్ 17 వ తేదీన భాగ్యనగర్ లో వెబ్ సైట్ ఆవిష్కరణ

సభలో  ప్రసంగిస్తున్న మాన్యశ్రీ భాగయ్య గారు

స్వయంసేవకులకు సంఘ పాటలను అచ్చు రూపంలో అందించే పుస్తకం విజయవిపంచి. ఈ పుస్తకంలోని పాటలు ఇకనుండి ఇంటర్ నెట్ లో www.vijayavipanchi.org అనే వెబ్ సైట్ లో లభ్యమవుతాయి.  

ఈ వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం భాగ్యనగర్ కేశవ నిలయంలో డిశంబర్ 17 వ తేదీన ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ అఖిల భారత బౌద్ధిక్ ప్రముఖ్ మాన్యశ్రీ భాగయ్యగారి చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ ప్రాంత సహ సంఘచాలక్ మాన్యశ్రీ ప్యాటా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సైట్ లో పాటలను వినవచ్చు, నేర్చుకొనవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, అలాగే పాటను ఆడియో రూపంలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా పద్యాలు, కథలను కూడా వినవచ్చని విజయ విపంచి వెబ్ సైట్ రూపకర్తలలో ఒకరైన శ్రీ మధుకర్ వివరించారు. 

ఆవిష్కరణ అనంతరం మాన్యశ్రీ భాగయ్యగారు ప్రసంగిస్తూ.. "విజయవిపంచి పాటలు పుస్తక రూపంలో ఉన్నవాటిని వెబ్ సైట్ లో పెడితే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వినడానికి సులువుగా ఉంటుందని, అన్ని ప్రాంతాలలో ఉన్న తెలుగు వారు ఈ వెబ్ సైట్ చూడడానికి బాగుంటుందని చెబుతూ, దీనిని తయారు చేసిన వారిని అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలను ఈ వెబ్ సైట్ తెలియచేసిందని అన్నారు.

సంఘ పాటలు ఎంతో ప్రేరనదాయకమని తెలియచేస్తూ, సామాన్య జనాన్ని రంజింపచేసేవి పాట, సంగీతమేనని, ఈ పాటలను వాయిద్యాలతో పాటు పాడి రికార్డు చేస్తే అవి మరింత హత్తుకుంటాయని అన్నారు. అలాగే శాఖలో బాలలు నిర్వహించే రూపకాలు, నాటకాలను ఈ సాంకేతికత ఉపయోగించి తయారుచేసి వెబ్ సైట్ లో పెడితే అవి ప్రపంచానికి మన సంస్కృతి గురించి తెలియచేస్తాయని అన్నారు. ఇటువంటి వెబ్ సైట్ లు మరిన్ని రావాలని, మరింత ముందుకు నడవాలని ఆశిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో సంఘ క్షేత్ర కార్యకారిణీ సదస్యులు శ్రీ హల్దేకర్ జీ, ప్రాంత ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జయదేవ్ వందన సమర్పణ గావించారు.