ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన వివేకానంద 150వ జయంతి వేడుకలు

వివేకానంద 150 జయంతి ఉత్సవాల సమీక్షా సమావేశాలలో వేదికపై ఆసీనులైన పూజ్య సరసంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ జీ భాగవత్, తదితరులు

2013 జనవరి 12 నుండి ప్రారంభమైన స్వామి వివేకానంద సార్థశతి జయంతి ఉత్సవాలు వచ్చే 2014 జనవరి 12తో ముగుస్తాయి. ఈ వ్యాసం మీరు చదివేనాటికి ఆ కార్యక్రమం కూడా పూర్తయి ఉంటుంది. జనవరి 12న మానవహారం వివేకానందునికి పుష్పాంజలి కార్యక్రమం ఉన్నది. సంవత్సరం పొడవునా జరిగిన కార్యక్రమాల సమీక్ష సమావేశాలు డిశంబర్, 25, 26, 27 తేదీలలో కన్యాకుమారిలోని వివేకానందపురంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వివేకానంద కేంద్ర అద్యక్షులు పరమేశ్వరన్ జీ, రాష్ట్టీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలక్ మా.మోహన్ జీ భాగవత్, సర్ కార్యవాహ భయ్యాజీ జోషి మొదలైన పెద్దలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించబడిన కార్యక్రమాల నివేదిక, అనువర్తి ఏమి చేయాలనే విషయాలు చర్చించబడ్డాయి. 

ప్రపంచంలోని ఇతర దేశాలలో జరిగిన కార్యక్రమాలు 

వివేకానంద సార్థశతి జయంతి ఉత్సవాలు మనదేశంతో పాటు, ప్రపంచంలోని అనేక దేశాలలో ఘనంగా జరిగాయి. వాటి వివరాలు కొన్ని గమనిద్దాం.

కెన్యా : 

కెన్యాలో 40 హిందూ సంస్థలు కలిసి కార్యక్రమాలు నిర్వహించాయి. జనవరి 12న జరిగిన కార్యక్రమంలో 800 మంది పాల్గొన్నారు. కెన్యాలో యూనివర్శిటీలో కూడా ఒక కార్యక్రమం జరిగింది. రన్, కార్యక్రమం, సూర్యనమస్కార్ లు కూడా జరిగాయి.

శ్రీలంక : 

201-12లోనే శ్రీలంకలో మాతృసమ్మేళనాలు, యువసమ్మేళనాలు జరిగాయి. వాటిలో సుమారు లక్ష మందికి పైగా పాల్గొన్నారు. 2013 జనవరి 10న చివరి కార్యక్రమంగా విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. దానిలో 12వేల మంది పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో శ్రీలంక ప్రభుత్వ కేంద్ర మంత్రులు, రామకృష్ణ మిషన్ స్వామీజీ పాల్గొన్నారు. వివేకానంద ప్రత్యేక స్టాంపు కూడా విడుదల చేయడం జరిగింది.

ఇంగ్లాండు : 

ఇంగ్లాండులో 2013 జనవరి 12న 12 స్థలాలలో కార్యక్రమాలు జరిగాయి. 100 కంటే ఎక్కువ స్థలాలలో వివేకానంద జీవన ప్రదర్శిని ఏర్పాటు చేయగా 20,000 మంది దానిని వీక్షించారు.

అమెరికా : 

అమెరికాలో అనేక విశేష కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విద్యార్థుల కోసం ధర్మవీర్ క్విజ్ పోటీ నిర్వహించబడింది. దానిలో 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. హిందూ కాంగ్రెస్ సభ్యురాలు గౌరవనీయ శ్రీమతి తులసి గబ్బార్ విశేష అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లలో 27 ధర్మయోగ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆ కార్యక్రమాలలో 40 వేలకు పైగా హిందువులు పాల్గొన్నారు. అమెరికాలో వివేకానందుడు తిరిగిన స్థలాలలో యువకులకు సమ్మేళనాలు, రక్తదాన శిబిరాలు, యోగ శిబిరాలు నిర్వహించబడ్డాయి.

నార్వే, హాలెండ్, సింగపూర్, థాయిలాండ్ లలో కార్యక్రమాలు జరిగాయి. గల్ఫ్ దేశాలలో కూడా యోగ కార్యక్రమాలు జరిగాయి. అనేక దేశాలలో సేవా కార్యక్రమాలు జరిగాయి.
 

వైస్ చాన్సలర్స్ సమావేశం

మనదేశంలో దేశవ్యాప్తంగా అనేక విశేష కార్యక్రమాలు జరిగాయి. అందులో విశ్వవిద్యాలయ ఉపకులపతుల (వైస్ చాన్సలర్స్) రెండురోజుల సమావేశం ఢిల్లీలో జరిగింది.  నవంబర్ 16, 17 తేదీలలో ఈ సమావేశాలు జరిగాయి. ఈ రెండు రోజులలో మొత్తం 12 సమావేశాలు జరిగాయి. అందులో 1) వ్యక్తి నిర్మాణం - దేశ నిర్మాణం, 2) విద్య విషయంలో వివేకానంద స్వామీజీ ఏమి చెప్పారు? 3) ఉన్నత విద్యలో వివేకానందుడు చెప్పిన అంశాలు చేర్చటం మొదలైన అంశాలు చర్చించబడ్డాయి. అందరూ ఈ విషయాలను అంగీకరించి, సిలబస్ లో చేర్చేందుకు ఒప్పుకున్నారు. బహుశ ప్రభుత్వం మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతుంది.  ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి గౌరవనీయ అబ్దుల్ కలామ్ పాల్గొనవలసి ఉండగా, అనివార్య పరిస్థితుల కారణంగా రాలేకపోయారు. వారి సందేశాన్ని లిఖిత పూర్వకంగా పంపగా సభలో చదివి వినిపించడం జరిగింది. 78 మంది ఉపకులపతులు, 6గురు వారి ప్రతినిధులు మొత్తం 84 మంది పాల్గొన్నారు. మొత్తం 122 స్థలాల నుండి 264 మంది పాల్గొన్నారు.  


ఈత పోటీలు

కన్యాకుమారిలో విశేషంగా స్విమింగ్ పోటీ ఏర్పాటయింది. వివేకానందుడు మూడు సంవత్సరాలు దేశవ్యాప్తంగా పర్యటన చేసి చివరకు కన్యాకుమారి చేరారు. మాత దర్శనం చేసుకొని "తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?" అని విచారణ చేసారు. సముద్రంలో ఉన్న శ్రీపాద పర్వతానికి తీరం నుండి ఈదుకుంటూ వెళ్లి మూడురోజులు అంతర్ముఖుడైనాడు. దీనిని పురస్కరించుకొని డిశంబర్ 17న ఈ ఈత పోటీలు నిర్వహించారు. సముద్రతీర ప్రాంతం వాళ్లను మాత్రమే ఆహ్వానించారు. ఈతే వృత్తిగా ఉన్న వాళ్లను పిలవలేదు. 72 మంది పోటీలో పాల్గొన్నారు. 550 మీటర్ల దూరం 61 మంది గమ్యం చేరుకున్నారు. మిగతా 11  మంది మధ్యలోనే బోట్లు ఎక్కి పోటీ నుండి విరమించుకున్నారు. ఆ తదుపరి జరిగిన ముగింపు సభలో స్వామీజీ మార్గదర్శనం చేశారు. శ్రీమతి భులాచౌదరి (సిపిఎమ్ మాజీ ఎమ్మెల్యే - అన్ని సముద్రాలలో ఈదిన అనుభవం ఉంది) జెండా ఊపి పోటీ ప్రారంభించారు.

వివిధ క్షేత్రాల కార్యక్రమాల నివేదిక : 

22 ప్రాంతాలలో సంస్కార భారతి ఆధ్వర్యంలో వివేకానంద స్వామి జననం మొదలు చివరి వరకు గల జీవిత విశేషాలతో 40 నిముషాల నాటక ప్రదర్శన జరిగింది. 50 వేలకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు. 

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో గుజరాత్ లో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15  వరకు స్వస్థ జీవన వివేకయాత్ర జరిగింది. మహిళా సమన్వయం అంశంపై భాగ్యనగర్ లో ఒకరోజు సెమినార్ జరిగింది.

విజ్ఞాన భారతి వారి సేవా కార్యానికి టెక్నాలజి అనే అంశంపై సెమినార్ జరిగింది. 18 కేంద్రాల నుండి 1200 మందికి పైగా పాల్గొన్నారు. మూడురోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. 

భారతీయ శిక్షణ మండలి ఆధ్వర్యంలో బెంగుళూరులో ఒక సెమినార్ జరగబోతున్నది. తేజోనిధి నాట్య కార్యక్రమం వివేకానందుని జీవితంపై నిర్వహించారు. 


పూజ్య సరసంఘచాలక్ జి మార్గదర్శనం : 

"వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు అపూర్వంగా నిర్వహించాము. దీని ఫలితాలు సమాజ అర్పణ కావాలి. దానికి అనుగుణంగా అనువర్తి కార్యక్రమాలు జరగాలి. ఈ విషయంలో భయ్యాజీ చెప్పిన విషయాలు మనం ఆలోచించాలి. స్వామీజీ హిందుత్వం గురించి ఒక మాట అన్నారు. ఆ మాటకు అటూ ఇటూ పోగూడదు. ఇప్పుడు ఏర్పాటు చేసిన సమితి వచ్చే ఏప్రిల్ తరువాత ఉండదు. కాని ఆ కార్యక్రమాలు కొనసాగాలి. వివేకానందుని ఆలోచనలు పరంపరాగతంగా ఉండేవి. ఆయన దేశకాలమాన పరిస్థితులలో రావలసిన మార్పుల గురించి ఆలోచించినవాడు. ఒక విప్లవకారుడు. సంవర్ధని ఆయామ్ మహిళా జాగృతి కోసం పురుషులను జాగృతం చేయాలనే విషయాన్ని స్వయంగా వివేకానందుడే చెప్పాడు. 'భారతీయ మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి' అని వివేకానందుడ్ని ఒక విలేకరి అడిగాడు. దానికి సమాధానంగా 'మహిళను కుటుంబంలో బంధించి ఉంచారు. కొద్ది స్వేచ్ఛనివ్వండి, తనను తాను ఉద్ధరించుకొంటుంది, కుటుంబాన్ని ఉద్ధరిస్తుంది" అని చెప్పారు. ఇట్లా అనేక విషయాలపై వివేకానందుడివి స్పష్టమైన ఆలోచనలు. మనం వాటిని సమాజానికి అందించాము. ఇంకా అందించాలి". 

- రాము