అఖిల భారత ప్రతినిధి సభ 2013 - విశేషాలు

వార్షిక నివేదికను సభకు సమర్పిస్తున్న సర్ కార్యవాహ మా.శ్రీ భయ్యాజీ జోషి
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 15, 16, 17 తేదీలలో జైపూర్ లోని 'కేశవ విద్యాపీఠం' ప్రాంగణంలో జరిగాయి. సంఘ ప్రతినిధి సభలు ఒక విశేష పద్ధతిలో జరుగుతాయి. ఈ సభలలో గడిచిన సంవత్సరం జరిగిన కార్యక్రమాల విశేషాలు, సమీక్ష, ఈ సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాల యోజన జరుగుతుంది. అఖిల భారత అధికారుల రాబోవు సంవత్సరానికి సంబంధించిన పర్యటనలు కూడా ఈ సమావేశాలలోనే నిర్ణయింపబడతాయి. సంఘము - సంఘ ప్రేరణతో స్వయంసేవకులచే ప్రారంభించబడిన అన్ని వివిధ క్షేత్రాల అఖిల భారత ప్రముఖ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటరు. ఈ సమావేశం నాటికి ఆ క్షేత్రాల అఖిల భారత బైఠకులు పూర్తి అయి గత సంవత్సరం కార్యక్రమాల నివేదిక, ఈ సంవత్సరం కార్య్రప్రణాళిక సిద్ధం చేయబడుతుంది. ప్రతినిధి సభలో ఈ అంశాలు వివరించబడతాయి. అన్ని క్షేత్రాల మధ్య సమన్వయంతో పనులు జరగటానికి ప్రతినిధి సభ కీలకమైనది. ఈ సమావేశాలలో సంఘం - వివిధ క్షేత్రాల ప్రముఖులందరిని ఒకేచోట చూడటం ఇంకొక విశేషం. ఈ సమావేశాలలో పాల్గొన్న అందరికి సమాజంలోని అన్ని జీవన రంగాలలో ప్రవేశించి మనం పని చేస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ఇంతటి విశేష ప్రాముఖ్యం ఉన్న ఈ సమావేశాలలో ఇంకొక విశేషం కూడా ఉన్నది. పరమపూజ్య సర్ సంఘచాలక్ జీ మూడు రోజుల పాటు సమావేశాలలో చెప్పబడే నివేదికలు, జరిగే చర్చలు అన్నిటిని విని చివరి రోజున ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మన వ్యవహారశైలి, సైద్ధాంతిక విషయాల గురించి మార్గదర్శనం చేస్తారు. మొత్తం సభల నిర్వహణ సర్ కార్యవాహ చేస్తారు. ఈ సంవత్సరం జరిగిన ఈ ప్రతినిధి సభలలో 1200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతినిధి సభ ప్రారంభంలో గడిచిన సంవత్సరం ప్రతినిధి సభలలో చర్చించిన విషయాలు, నిర్ణయాలను సభ ఆమోదించింది. ఆ తదుపరి మాననీయ సర్ కార్యవాహ జీ తన వార్షిక నివేదిక సమర్పణ చేసారు.
నివేదిక ప్రారంభంలో గడచిన సంవత్సరం మే మాసంలో జరిగిన శిక్షావర్గల యొక్క వివరాలు చెప్పారు. గడిచిన సంవత్సరం 50 స్థలాలలో 52 శిక్షావర్గలు జరిగాయి. ప్రథమవర్షలో 7,408 స్థలాల నుండి 12,544 మంది శిక్షణ పొందారు. 2,320 స్థలాల నుండి 3,063 మంది ద్వితీయవర్షలో శిక్షణ పొందారు. 923 స్థలాల నుండి 1003 మంది తృతీయవర్ష శిక్షావర్గలో శిక్షణ పొందారు. ఇది కాక విశేష ప్రథమ, విశేష ద్వితీయ వర్షలు కూడా నిర్వహించబడ్డాయి. ఆ తదుపరి వివిధ కార్యవిభాగాల సమగ్ర వివరాలు, ఆ తదుపరి దేశవ్యాప్తంగా జరిగిన వివిధ విశేష కార్యక్రమాల వివరాలను వివరించారు.

రాష్ట్రీయ సేవాభారతి (రిజిష్టర్డ్) 
రాష్ట్రీయ సేవాభారతి అనేది సేవా విభాగంలో ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఒక సంస్థ. ఈ సంస్థ 2003 వ సంవత్సరం డిశంబర్ 8న రిజిష్టర్ చేయబడింది. రాష్ట్రీయ సేవాభారతి దేశవ్యాప్తంగా రిజిష్టర్ చేయబడిన సేవాభారతి సంస్థల సమన్వయం కోసం ఏర్పాటు చేయబడిన గొడుగు వంటి సంస్థ.  రాష్ట్రీయ సేవాభారతి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం దేశంలోని కొన్ని ప్రాంతాలలో సేవాసంగమ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. 
కేరళ - కొడంగలూరు, కర్నాటక - షిమోగా, ఝార్ఖండ్ - రాంచి, విదర్భ - నాగపూర్, అస్సాం - గౌహతి.

దేశవ్యాప్తంగా 427 రిజిష్టర్డ్ సంస్థలు, 1,32,000  సేవా కార్యక్రమాలు రాష్ట్రీయ సేవాభారతికి అనుబంధంగా ఉన్నాయి.

సమస్త జీవకోటికి ఆధారమై ప్రకృతి వరదానమైనవి వాయువు, జలం. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలలో జల సంరక్షణకు జైపూర్ లో సేవా భారతి ఆధ్వర్యంలో విశేష ప్రయత్నాలు, విశేష యోజన చేస్తున్నారు.

ఆరోగ్య భారతి
ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో గడచిన సంవత్సరం విశేషంగా జరిగిన కార్యక్రమాలు

దేశవ్యాప్తంగా నిర్వహించబడిన విశేష కార్యక్రమాలు

1) పశ్చిమ బెంగాల్
స్వామి వివేకానంద 150 జయంతి కార్యక్రమాలలో భాగంగా యువకులకు కొల్ కతా నగర సమీపంలో శిబిరం నిర్వహించారు. 15 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారు 2,052 స్థలాల నుండి 9,115 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బెంగాల్ కు ఒక విశేష ప్రేరణ నిచ్చింది.

2) పూర్వ ఆంధ్ర్రప్రదేశ్
జనవరిలో హిందూ చైతన్య శిబిరము నిర్వహించబడింది. ఆ శిబిరంలో 2,404 స్థలాల నుండి 17,233 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1) భారతీయ ప్రజ్ఞ అనే ఒక కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, కవులు, వీరుల చిత్రపటాలు, వారి వివరాలను అందులో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను సుమారు 1.25 లక్షల మంది ప్రజలు వచ్చి చూసారు. 2) శిబిరంలో మూడవ రోజున మాతృ సమ్మేళనం జరిగింది.  అందులో 10,000 మంది మాతృమూర్తులు పాల్గొన్నారు. 3) మాతృసమ్మేళనం అనంతరం సాధుసంతుల సమ్మేళనం జరిగింది. దానిలో 72 మంది సాధుసంతులు పాల్గొన్నారు. చివరి రోజున జరిగిన బహిరంగ సభలో 60 వేల మంది హిందూ బంధువులు పాల్గొన్నారు.

3) పశ్చిమ ఆంధ్రప్రదేశ్
ఫిబ్రవరిలో ఘోష్ తరంగ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 865 మంది ఘోష్ వాదకులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో సంగీతానికి సంబంధించిన వివిధ రంగాల ప్రసిద్ధులు పాల్గొన్నారు.

4) మాల్వా ప్రాంతం
మాల్వా ప్రాంతంలో జరిగిన ఏకత్రికరణ కార్యక్రమంలో 3,991 స్థలాల నుండి 83,345 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. పూజనీయ సర్ సంఘచాలక్ జీ ఆ కార్యక్రమంలో మార్గదర్శనం చేసారు.

5) కర్నాటక దక్షిణ్
మంగళూరులో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ జీ పర్యటనలో భాగంగా స్వయంసేవకులకు సాంఘిక్ కార్యక్రమం ఏర్పాటు చేసారు. అందులో 1500 గ్రామాల నుండి 85,397 మంది పూర్ణగణవేష్ ధరించిన స్వయంసేవకులు పాల్గొన్నారు.

2012-13 సంవత్సరం దేశంలో పేర్కొనదగిన సంఘటనలను ఈ సందర్భంగా జ్ఙాపకం చేసుకుందాం

1) పాకిస్తాన్ దుర్మార్గం మరోసారి వెలుగు చూసింది. సరిహద్దులలోని మన ఇద్దరు సైనికులను పాక్ సైనికులు అపహరించి అతి దారుణంగా హతమార్చి వారి తలలు నరికి భారత్ కు పంపించారు. ఉగ్రవాదులకు బాసటగా ఉండే పాకిస్తాన్ సైన్యం యొక్క దుష్కృత్యం ఇది. దీనిని మన ప్రభుత్వం అచేతన స్థితిలో చూసి ఊరుకున్నది. ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ఎటువంటి కఠిన చర్య తీసుకోకపోవటం శోచనీయం.

2) రక్షణ దళాలలో కూడా ఆయుధాల బేహారులు కనబడుతున్నారు. ఆయుధాల వ్యాపారంలో కుంభకోణాలు కనబడుతున్నాయి.

3) మహిళలపై అత్యాచారాలు, దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి.

4) చైనా భారత్ పై దాడి చేసి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన యువకులకు భారతదేశ సరిహద్దులు ఎట్లా ఉన్నాయో చూపించే విశేష కార్యక్రమం రచించబడింది. ఫిన్స్ అనే సంస్థ నిర్వహించింది. 'సరిహద్దుకు ప్రణామము' అనే ఈ కార్యక్రమంలో 5,769 మంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దులలో నివసించే ప్రజలలో 7,08,105 మంది అక్కడ జరిగిన మానవహారంలో పాల్గొన్నారు.

5) స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా జరిగిన వివిధ కార్య్రక్రమాలలో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. డిసెంబర్ 25న జరిగిన సంకల్ప దివస్ కార్యక్రమంలో 9,385 స్థలాలలో 4,96,969 మంది పురుషులు, 97,915 మంది స్త్రీలు పాల్గొని సంకల్పం తీసుకున్నారు.
జనవరి 12న జరిగిన శోభాయాత్రలలో 13,353 స్థలాలలో 49,70,445 మంది ప్రజలు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 18న సామూహిక సూర్యనమస్కారాలు  
350 సంవత్సరాలకు పూర్వం సమర్థ రామదాస స్వామి సామూహిక సూర్యనమస్కారాలకు శ్రీకారం చుట్టారు. సూర్యుడు చైతన్యానికి, శక్తికి ప్రతీక. సూర్యనమస్కారాలు చేయటం వలన మనలో చైతన్యం, శక్తి, ఆరోగ్యం కలుగుతుంది. స్వామి వివేకానంద ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం లాంటి దేహం కలిగిన వందమంది యువకులు లభిస్తే ఈ దేశ భవిష్యత్ ను మార్చేస్తానని చెప్పారు. అటువంటి శక్తివంతులైన యువకుల నిర్మాణానికి ప్రేరణగా వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఈ సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహించటం ఎంతో సముచితమైనది. ఈ సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 11,848 స్థలాలలో జరిగిన 48,375 కార్యక్రమాలలో సుమారు 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. ఇందులో 49,70,445 మంది విద్యార్థులు.

స్వామి వివేకానంద 150 జయంతి సందర్భంగా జరిగిన ఇతర కార్యక్రమాలు

చత్తీస్ ఘడ్ ప్రాంతంలో మౌని అమావాస్య (ఫిబ్రవరి 10, 2013) రోజున విశాల హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో 1500 గిరిజన గ్రామాల నుండి 1,25,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్య వాసుదేవానంద సరస్వతి స్వామి, పరమ పూజనీయ సర్ సంఘచాలక్ జీ, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ పాల్గొన్నారు.

గుజరాత్ లోని వడోదరలో జనవరి 12 న జరిగిన కార్యక్రమం చాలా విశేషమైనది. అక్కడ 339 ఫ్లాట్స్ నుండి 12,926 మంది పురుషులు, 4,828 మంది మహిళలు కూడా పాల్గొన్నారు. 7 కి.మీ. సాగిన శోభాయాత్రకు వడోదరలోని మూడు లక్షల మంది ప్రజలు సాక్ష్యం. వివిధ ధార్మిక సంస్థల పెద్దలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. స్వామి నారాయణ సాంప్రదాయం, గాయత్రీ పరివార్, బ్రహ్మకుమారీస్, ఇస్కాన్ మొదలైన అన్ని సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం.

జనవరి 12న జమ్మూ కాశ్మీర్ లో 28 ర్యాలీలు నిర్వహించబడ్డాయి.

శ్రీలంకలో జరిగిన ఒక కార్యక్రమంలో 10,000 మంది అక్కడి ప్రజలు పాల్గొన్నారు.

ధర్మ జాగరణ

ధర్మజాగరణ విభాగం నేడు దేశవ్యాప్తంగా పని చేస్తున్నది. ఈ సృష్టిలో ఉండే సమస్త జీవజాలం ఆనందంగా, సుఖంగా, భద్రతతో ఉండాలని కోరుకునే మన హిందూ ధర్మాన్ని సామాన్య ప్రజలకు వివరించేందుకు పని చేయాలి. హిందువులను మోసపూరితంగా, భ్రమలు నిర్మాణం చేసి ఇతర మతాలలోకి మారుస్తున్న విషయం మనందరికి తెలుసు. అటువంటి మోసాలకు లోను కావద్దని, 'మనం అందరం హిందువులం' అని గుర్తు చేయటానికి ప్రయత్నం చేసే వేదికే ధర్మజాగరణ. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ పని జరుగుతున్నది. ఈ దిశలో విశేషంగా మూడు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 1) ధర్మ రక్షాబంధన్, 2) ధర్మ రక్షా దివస్, 3) భారత మాత పూజ.

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పై మూడు రకాల కార్యక్రమాలు జరిగాయి.  
 1. ధర్మరక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 11,164 గ్రామాలలో 26,70,906 మందికి ధర్మ రక్షను కట్టడం జరిగింది. 
 2. ధర్మ రక్షా దివస్ కార్యక్రమాలు 1,888 జరిగాయి. ఈ కార్యక్రమాలలో 2,38,023 మంది పాల్గొన్నారు.  భారతమాత పూజా కార్యక్రమాలు మొత్తం 6,350 గ్రామాలలో జరిగాయి. మొత్తం 6,673 కార్యక్రమాలలో 6,19,001 మంది ప్రజలు పాల్గొన్నారు. 178 హిందూ సమ్మేళనాలు కూడా జరిగాయి. ఈ సమ్మేళనాలలో 8,857 గ్రామాల నుండి 2,49,549 మంది ప్రజలు పాల్గొన్నారు.

విశేష ధర్మ రక్షా యాత్రలు కూడా జరిగాయి. వాల్మీకి యాత్ర, శివ బాబా యాత్ర లాంటివి విశేషంగా యోజన చేసారు. ఇవి కాక పరంపరాగతంగా జరుగుతూ వస్తున్న కావడి యాత్ర, కలశ యాత్రలు, చునారి యాత్రలు 1780 జరిగాయి. ఇందులో 2,52,700 మంది పాల్గొన్నారు.

ప్రయాగ కుంభమేళాలలో జరిగిన మార్గదర్శక మండలి సమావేశంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా రామనామ జప యజ్ఞం కార్యక్రమం ఉగాది పండుగైన ఏప్రిల్ 11 నుండి మే 13 అక్షయ తృతీయ వరకు నిర్వహించాలని నిర్ణయించారు.

శాఖల నివేదిక

 • సంఘ వ్యవస్థ దృష్ట్యా మొత్తం దేశం 41 ప్రాంతాలు, 813 జిల్లాలు, 6,139 ఖండలు, 54,989 మండలాలుగా విభజించబడినది.
 • ఈ సంవత్సరం నివేదిక ప్రకారం మొత్తం 41 ప్రాంతాలలోను శాఖలు ఏర్పడ్డాయి.
 • మొత్తం జిల్లాలు 813 - శాఖాయుక్త జిల్లాలు 799
 • మొత్తం ఖండలు 6,138 - శాఖాయుక్త  ఖండలు 4,916
 • మొత్తం మండలాలు 54,989 - శాఖాయుక్త మండలాలు 17,850, సంపర్కయుక్త మండలాలు 8,281
 • మొత్తం శాఖాయుక్త స్థలాలు 28,788
 • మొత్తం శాఖలు 42,981
 • మొత్తం సాప్తాహిక్ మిలన్ లు 9,557
 • మొత్తం సంఘ మండలులు 7,178
 • ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,23,397 సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో అత్యధిక సేవా కార్యక్రమాలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.