భవిష్య భారతావనికి దిశానిర్దేశం చేయబోతున్న 2014 సార్వత్రిక ఎన్నికలు

ఎన్నికల వేళ - 2014 - భాగం 7


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 16వ పార్లమెంటు ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. సంకుల సమరంగా సాగుతున్న ఈ ఎన్నికలు మే 12తో ముగుస్తాయి. 16న భారత్ ను ఎవరు పాలిస్తారో తేలిపోతుంది. భారతదేశ ప్రజలు అనేక సందర్భాలలో తమ విజ్ఞతను నిరూపించుకొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ తమకు ఎంతో ప్రియతమ నాయకురాలైనప్పటికీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలని ప్రయత్నిస్తే ఎన్నికలలో చిత్తుగా ఓడించారు. బోఫోర్స్ కుంభకోణం సమయంలో కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు.

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చారిత్రాత్మకమైనవి. ఈసారి కొత్త ఓటర్లు అత్యధిక సంఖ్యలో నమోదయ్యారు. మొదటిసారి ఓటు వేసే యువకులు, యువతులు సంఖ్య అత్యధికం. భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో అవినీతి, ఇంకా ఏదో సమస్య కేంద్రంగా ప్రజల ఆగ్రహం వ్యక్తమయ్యేది. ఈసారి సక్రమమైన పాలన ద్వారా సరియైన అభివృద్ధి సాధించిన మోదికి దేశమంతా బ్రహ్మరథం పట్టారు. దేశానికి మంచి పాలన అందించాలనే ఆకాంక్ష దేశ ప్రజలలో ఎక్కువగా ఉంది. మోది మంచి పాలన అందించగలడనే విశ్వాసం దేశమంతా వ్యక్తం కావటం విశేషం. ఇంత పెద్ద దేశంలో దేశమంతటా సమానంగా అంగీకరించిన వ్యక్తిగా కూడా మోది మనకు కనబడతాడు. ఒక జాతీయ నాయకుడిగా మోదికి గుర్తింపు వచ్చింది. కాంగ్రెసు అవినీతి కుంభకోణాల పరంపరగా బయటకు రావటం కూడా ఒక కారణం. 

ఈసారి జరిగిన ఎన్నికలలో ఆరు నెలల ముందుగానే ఓటర్లను జాగృతం చేసే కార్య్రక్రమాలు దేశమంతటా జరిగాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఓటర్లను చైతన్యపరచి ఓట్లు వేయించేట్లుగా ప్రయత్నం విశేషంగా జరిగింది. రాందేవ్ బాబా, రవిశంకర్ గురూజీ లాంటి పరివ్రాజకులు నిరంతరం ఈ సారి ప్రయత్నించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అధినేత శ్రీ మోహన్ జీ భాగవత్ తన విజయదశమి ఉపన్యాసంలో ప్రజలందరిని 'ఈసారి అర్హులైన వాళ్ళు అందరూ ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని, వందశాతం ఓట్లు పోలవ్వాలని' పిలుపునిచ్చారు. ఇట్లా దేశంలో అనేకమంది ప్రముఖులు ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించటం విశేషం. రాజకీయ ప్రయోజనాలను ఆశించని సామాజిక పెద్దలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దేశ ప్రయోజనాల దృష్ట్యా మారాలని పిలుపునిచ్చారు. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. రాజకీయాలతో సంబంధం లేకుండా ఓటర్లను చైతన్యపరచడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందరి కర్తవ్యమని గుర్తు చేయడం విశేషం. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, పక్షాలు పరస్పర దూషణలు చేసుకోవటం అతి సహజం. పార్టీల సిద్ధాంతాల మధ్య చర్చ జరగటం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈసారి వ్యక్తిగత దూషణలు కూడా బాగా ఎక్కువగా సాగాయి. ఈసారి రాజకీయేతర సామాజిక సంస్థలపై కూడా మాటల యుద్ధం సాగించారు. అన్నిటికంటే ఎక్కువగా చర్చ జరిగింది రాష్ట్రీయ స్వయంసేవక సంఘంపై. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈసారి ప్రజల్లోకి వెళ్ళి వందశాతం ఓటింగ్ విషయాన్ని ప్రజలకు వివరించింది. క్రొత్త ఓటర్లను చేర్పించడంలో కూడా కీలకపాత్ర పోషించింది. కేంద్రంలో ఉన్న అవినీతి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది. దానికోసం సంఘం తన కార్యకర్తల నందరిని రంగంలోకి దింపి పని చేయించింది. రాందేవ్ బాబా, శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ కూడా ఇదే ప్రచారం చేశారు. ఓటర్లను చైతన్యపరచటం కోసం ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం జరగటం బహుశ: ఇది మొదటిసారి కావచ్చు. దాని కారణంగా ఓటింగ్ శాతం కూడా కొంత పెరిగింది. 

ఈ జయనామ సంవత్సర ప్రారంభంలో రాజకీయ వలసలు ఎక్కవగా సాగాయి. ఇది వలసల నామ సంవత్సరంగా ప్రారంభమైంది. రాజకీయ సమీకరణలు కూడా వేగవంతంగా మారుతున్నాయి. మొత్తం మీద ఈ దేశ రాజకీయ చిత్రం రాబోవు రోజులలో పెనుమార్పులకు లోనవుతుందనే సంకేతాలు ఈ సారి ఎన్నికలలో కనబడుతున్నాయి. దేశ ప్రజలు ఒక మంచి మార్పును కోరుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతున్నది. మారుతున్న ప్రపంచ పరిస్థితులలో భారతదేశంలో ఎటువంటి ప్రభుత్వం వస్తుందనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నది. భారతదేశం ఎడల అమెరికా అనుసరిస్తున్న విధానాలలో మార్పు రావాలని అమెరికా మేధావులు ఎన్నికల ఫలితాలు రాకముందే అమెరికా ప్రభుత్వానికి సూచించటం గమనించదగిన విషయం. 

మొత్తం మీద ఈ ఎన్నికలు రాబోయే కొన్ని దశాబ్దాలలో భారతదేశంలో చోటుచేసుకోబోయే పరిణామాలకు కేంద్ర బిందువు అవుతాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పరిస్థితులు మరింత స్పష్టంగా కనబడతాయి. 
 

ప్రతిసారి జరిగే ఎన్నికలలో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడా ఉన్నది. అయితే గతంలో ఉన్నదానిలో కొంత మార్పు వచ్చింది. తాత్కాలికంగా ఎంతో కొంత డబ్బు తీసుకొని ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు దానిని అనుభవించవలసి వస్తుంది. అభ్యర్థి ఇంత డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవటం, తిరిగి ఐదు సంవత్సరాలలో వచ్చే ఎన్నికలలో కూడా గెలవటానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవటం చేస్తారనే ఆలోచన గ్రామీణ ప్రజలలో రాకపోవటం కారణంగా సరియైన అభ్యర్థి ఎవరో నిర్ణయించే స్థితిని కోల్పోతున్నారు. ఇది మనకు ఇబ్బందికరం అని గ్రామీణ ప్రజలు గుర్తించిననాడు ధనబలం, కండబలంతో రాజకీయాలలో చెలామణి అవుతున్నవారికి అడ్డుకట్ట పడుతుంది. ఈ మార్పును సాధించటానికి రాజకీయాలలో సంబంధం లేని సామాజిక నాయకత్వం నిరంతరం ప్రయత్నం చేయాలి. అదే ఈ దేశ ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.

- మల్లిక్