నిజమైన నాయకులు అలాగే ఉంటారు...!!

భారత ప్రధాని నరేంద్ర మోది
 
ఒక ప్రజాప్రభంజనం ఉత్తుంగ తరంగం లాగ భారతదేశాన్ని ముంచెత్తింది. గత అరువది ఆరు (66) సంవత్సరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న ఒక మహాజాడ్యం ఆ ప్రవాహంలో జాడలేకుండా కొట్టుకుపోయింది. దేశంలో ఒక నవోదయం వెల్లివిరిసింది.  భారతమాత ముఖారవిందంపై ఒక చిరుదరహాసం మెరిసింది. దేశాన్ని ముంచెత్తిన తరంగం 2014వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు కాగా మహా ప్రభంజనం నరేంద్రమోది నాయకత్వం. 
 
తమ బాధలన్నీ తీర్చే ఒక సమర్ధవంతమైన వ్యక్తి అధికారంలోకి వచ్చినందుకు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టినందుకు ఒక వైపు సంతోషిస్తూనే ఇంకొకవైపు నరేంద్రమోది తమ కష్టాలన్నీ రాత్రికి రాత్రే పరిష్కారం చేస్తాడని ఆశ పెట్టుకుని ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
 
ఆసేతు హిమాచలం ఎంతో ఆర్తితో ఎదురుచూస్తూ సమయం ఆసన్నం కాగానే నరేంద్రమోదీని సంపూర్ణ ఆధిక్యతతో గెలిపించి ప్రధానమంత్రి బాధ్యతను కట్టబెట్టారు. మోదీ కూడా ఆది నుంచే తన విశిష్టతను చాటుకుంటూ లభించిన ప్రజాసమర్ధనకు తాను అర్హుడిగానే నిరూపించుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కాని దేశ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. 
 
తమ బాధలన్నీ తీర్చే ఒక సమర్ధవంతమైన వ్యక్తి అధికారంలోకి వచ్చినందుకు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టినందుకు ఒక వైపు సంతోషిస్తూనే ఇంకొకవైపు నరేంద్రమోది తమ కష్టాలన్నీ రాత్రికి రాత్రే పరిష్కారం చేస్తాడని ఆశ పెట్టుకుని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ "తనను ఎంతో అభిమానంతో ఆదరించిన భారత ప్రజలు త్వరలో కొన్ని కఠిన నిర్ణయాలు ఎదుర్కోవలసి ఉంటుందని" అంటూ "ఈ నిర్ణయాల కారణంగా ప్రజలకు తనపై ఉన్న అభిమానం కొంతమేర తగ్గవచ్చును" అని కూడా పేర్కొన్నారు. తదనంతరం రైల్వే చార్జీలు 14 శాతం మేర పెరిగాయి. గ్యాసుబండ ధరకూడా పెరగవచ్చు అని వదంతులు ఉన్నాయి. ఇక్కడ మనమంతా ఒక విషయం గమనించాలి. 
 
ఆరు దశాబ్దాలు దేశం దోపిడికి గురైంది. మోదీ చేతికి శూన్య ధనాగారం వచ్చింది. దేశాన్ని ఒక సమగ్రమైన మార్గంలో పెట్టి అభివృద్ధి పథాన ఉరకలెత్తించడానికి ముందు ఇటువంటి ఇక్కట్లు ఎవరికైనా తప్పవు. పైగా 'కఠిన నిర్ణయాలు ఉంటాయి' అని ప్రజలకు ముందుగా చెప్పిన మొదటి ప్రధాని మోది అని గమనించాలి. వాస్తవాల నుండి పారిపోకుండా ధైర్యంగా ఇలా మాటలాడటానికి సామాన్య రాజకీయ నాయకులకు ధైర్యం చాలదు. ఒక ప్రజా నాయకుడు మాత్రమే దీనికి సమర్థుడు. నరేంద్రమోది జాతీయ నాయకుడు. బ్రిటన్ దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో కుదేలై, అతి దీనావస్థలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా నియమింపబడిన సైనికాధికారి సర్ విన్ స్టన్ చర్చిల్ బ్రిటిషు ప్రజలకు ఏమి చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 
 
1940 మే 13వ తేదీన హౌస్ ఆఫ్ కామన్స్ సభలో చర్చిల్ అన్న మాటలు -"ప్రజలారా ! నూతన ప్రధానమంత్రిగా నేను మీకు ఇవ్వగలిగే కానుకలు రక్తపాతం, ఎడతెగని శ్రమ, కన్నీళ్ళు, స్వేదం మాత్రమే. ఇంకేమీ లేవు" ("I have nothing to offer, but Blood, Toil, Tears and Sweat"). 
 
ఔను, మరి నిజమైన నాయకుల భాష అలాగే ఉంటుంది. కాబట్టి మనం కొంతకాలం ఓపిక వహిస్తే మనం కలలు గన్న అభివృద్ధి చెందిన భారతాన్ని త్వరలోనే చూడవచ్చును. కష్టపడకుండా సుఖాలు రావు కదా! నరేంద్రమోదికి కొంత సమయం ఇద్దాం !! పని చేయనిద్దాం !!! 
 
- ధర్మపాలుడు