జీవితంతో పాటు దేహాన్ని కూడా సమాజ సేవకే అర్పించిన మహావ్యక్తి స్వర్గీయ పట్లోళ్ళ రామిరెడ్డి

శ్రద్ధాంజలి సభలో వక్తల అభిభాషణ - కంటనీరు పెట్టిన కుటుంబ సభ్యులు

సభలో కన్నీటి పర్యంతమైన శ్రీ రఘుపతిరెడ్డిగారు (రామిరెడ్డి గారి అన్నగారు)

జీవితంతో పాటు దేహాన్ని కూడా సమాజ సేవకే అర్పించిన మహావ్యక్తి స్వర్గీయ పట్లోళ్ళ రామిరెడ్డి అని అనేకమంది కొనియాడారు. ఏప్రిల్ 2వ తేదీన భాగ్యనగర్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూల్ పటేల్ ఆడిటోరియంలో జరిగిన శ్రద్ధాంజలి సభలో అనేకమంది ప్రముఖులు ప్రసంగించారు. రామిరెడ్డిగారితో వారికి గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామిరెడ్డి గారి అన్నయ్య శ్రీ రఘుపతిరెడ్డిగారు, వారి కుమార్తె శ్రీమతి మాధవిగారు వేదికపై ప్రసంగిస్తూ "మా కుటుంబంలో అటువంటి గొప్పవ్యక్తి జన్మించటం మా అదృష్టమంటూ" కంటనీరు పెట్టుకున్నారు.

ఈ సభలో ప్రసంగించిన వక్తలందరూ రామిరెడ్డిగారి వ్యక్తిత్వం గురించి, ప్రచారక్ జీవితంలో వారు పాటించిన కఠిన నియమాల గురించి, సంఘశాఖ ద్వారా గ్రామాభివృద్ధి జరగాలనే వారి ఆలోచనల గురించి తమ అనుభవాలను సభికులతో పంచుకున్నారు. గ్రామ వికాస ఆలోచన వారిదేనని, సంఘశాఖ ద్వారా గ్రామాభివృద్ధి జరగాలనేది వారి లక్ష్యమని, గోవు ప్రాధాన్యతను నొక్కిచెప్పారని, విశ్వమంగళ గోగ్రామ యాత్ర ఉద్యమం జరిగిన నాటి నుంచి వారు గోవుపాలు, గోవు మూత్రం తీసుకోవటం ప్రారంభించి, చివరి క్షణం వరకు విడిచిపెట్టలేదని అన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘలో గత 48 సంవత్సరాలుగా ప్రచారక్ గా ఉంటూ జ్యేష్ఠ కార్యకర్తలలో ఒకరైన పట్లోళ్ళ రామిరెడ్డిగారు (71) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 మార్చి 23 ఆదివారం తెల్లవారుఝామున పరమపదించిన విషయం అందరికి తెలిసిందే. ఏప్రిల్ 2వ తేదీన శ్రద్ధాంజలి సభ జరిగింది.

వేదికపై మాననీయ శ్రీ సుహాస్ రావు హీరేమఠ్ ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత సేవా ప్రముఖ్, శ్రీ సోమయాజులు వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత సంఘటనా మంత్రి, శ్రీ దూసి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్-కర్నాటక రాష్ట్రాల క్షేత్ర కార్యవాహ, శ్రీ ప్యాట వెంకటేశ్వరరావు పశ్చిమాంధ్రప్రదేశ్ ప్రాంత సంఘచాలక్, రామిరెడ్డిగారి అన్నగారైన శ్రీ రఘుపతిరెడ్డిగారు అసీనులైనారు. 

స్వర్గీయ రామిరెడ్డి గారు

ప్రముఖులు రామిరెడ్డిగారి చిత్రపటానికి పూలు అర్పించిన అనంతరం సభ ప్రారంభమైంది.

మొదట ప్రాంత కార్యవాహ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ రామిరెడ్డిగారి జీవిత పరిచయం చేశారు. "రామిరెడ్డిగారు 1966లో ప్రచారక్ గా వచ్చారు. మొదట సూర్యాపేట నగర ప్రచారక్ గా పని చేశారు. ఎమర్జన్సీ సమయంలో వరంగల్ విభాగ్ ప్రచారక్, ఆ తరువాత పాలమూర్ విభాగ్ ప్రచారక్ గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే ప్రాంతంగా ఉన్న రోజులలో రామిరెడ్డిగారు ప్రాంత శారీరిక్ ప్రముఖ్ గా పనిచేశారు. శారీరిక్ ప్రముఖ్ గా వారు ప్రాంతంలో స్వయంసేవకుల శారీరిక స్థాయి పెంచడానికి ఎక్కువ కృషి చేశారు. వారు దండ లేకుండా శాఖకు వచ్చేవారు కాదు. తీవ్ర అనారోగ్యంగా ఉన్న రోజులలో కూడా ఈ అలవాటు తప్పనివ్వలేదని" ఎక్కాజీ భావోద్వేగంతో చెప్పారు. "ఉపన్యాసం కాదు - వ్యక్తితో సత్సంబంధం ముఖ్యం" అని వారు చెప్పేవారని ఎక్కాజీ చెప్పారు. "అత్యంత సాధారణ జీవితం గడిపిన రామిరెడ్డిగారి వద్ద చివరి రోజున ఉన్నది కేవలం 20 రూపాయలేనని, అది వారి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని" ఎక్కాజీ అన్నారు.

స్తంభాద్రి రెడ్డిగారు మాట్లాడుతూ మర్రిగూడ గ్రామ నిర్మాణానికి మూలకారకుడు రామిరెడ్డిగారని అన్నారు. వారు ఆవుకు ప్రాధాన్యతనిచ్చారని, మర్రిగూడను గో ఆధారిత వ్యవసాయ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని అన్నారు.

జస్టిస్ నరసింహారెడ్డిగారు ప్రసంగిస్తూ "భారతీయ సంస్కృతీ, విలువలు నిలబడటానికి కారణం సంఘము, సంఘంలోని ఉత్కృష్ట వ్యక్తులు. ప్రచారకులు ఎంతో ఉన్నత వ్యక్తులు, సమాజ సేవ కోసం కుటుంబాన్ని కూడా త్యజించి, జీవితాన్ని సమాజానికి అంకితం చేసినవారు. అటువంటి వారిలో ఒకరు రామిరెడ్డిగారు" అని కొనియాడారు.

"క్షణం-క్షణం కణం-కణం సమాజానికి సమర్పించాలనే డాక్టర్జీ మాటలను నిజం చేసిన వ్యక్తి రామిరెడ్డిగారు, దేహాన్ని కూడా సమాజ ఉపయోగానికి సమర్పించిన గొప్ప వ్యక్తి" అని రాష్ట్ర సేవికా సమితి ప్రాంత సంచాలిక డా.అరుణ గారు చెపుతూ రామిరెడ్డిగారితో తన చిన్నప్పటి నుండి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

రామిరెడ్డిగారి అన్నగారైన శ్రీ రఘుపతిరెడ్డిగారు మాట్లాడుతూ "రామిరెడ్డిగారు తనకన్నా రెండేళ్లు చిన్నవాడు. అతనికి నేను శ్రద్ధాంజలి ఘటించవలసి రావడం నాకు చాలా బాధగా ఉందని" చెపుతూ వేదికపై కంటనీరు పెట్టుకున్నారు. వారు ఇంకా మాట్లాడుతూ "మేమిద్దరం స్వయంసేవకులమే అయినప్పటికి ప్రచారక్ గా వచ్చి జీవితాన్ని సమాజానికి అర్పించే అదృష్టం రామిరెడ్డిగారికే దక్కిందని" ఉద్వేగంతో ప్రసంగించారు.

రఘుపతిరెడ్డిగారి కుమార్తె అయిన శ్రీమతి మాధవిగారు కూడా ప్రసంగిస్తూ కంటనీరు పెట్టుకున్నారు. సుపుత్రుడు తల్లిదండ్రులను, సమాజాన్ని ధన్యులను చేస్తాడని, రామిరెడ్డిగారు సుపుత్రుడని అన్నారు. వారి అనారోగ్య సమయంలో వారికి సేవ చేసిన వారందరికి తమ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియచేశారు.

ప్రసంగిస్తున్న క్షేత్ర కార్యవాహ శ్రీ దూసి రామకృష్ణగారు

క్షేత్ర కార్యవాహ దూసి రామకృష్ణగారు మాట్లాడుతూ దేశభక్తి అంటే ఏమిటి? అనే విషయాన్ని చిన్న పనుల ద్వారా రామిరెడ్డిగారు నేర్పించేవారని, సంఘశిక్షావర్గ నిర్వహణలో నైపుణ్యం పెంచాలనే దిశగా రామిరెడ్డిగారు పని చేశారని చెప్పారు.

ఇంకా వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత సంఘటనా మంత్రి శ్రీ సోమయాజులుగారు, అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ సుహాస్ రావు జీ ప్రసంగించారు.

సభలో పశ్చిమాంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ శ్యామ్ జీ తోపాటు అనేకమంది పెద్దలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సభ అనంతరం భోజన ఏర్పాటు జరిగింది.

- సమాచార భారతి