మనం అనే భావనే రక్షాబంధన్ సందేశం

రక్షాబంధన్

ఈ సృష్టిలో వ్యక్తుల అస్తిత్వానికి తల్లి ఆధారం. సమాజం మనుగడ సాధించటానికి మాతృభూమి ప్రాతిపదిక. అందుకే మాతృభూమి కడు మధురమైనది. మాతృప్రేమ అద్వితీయమైనది. ఈ భావాత్మక సందేశం మనకు శ్రీరామ చంద్రుని జీవితంలో కనబడుతుంది.  అందుకే ఈ జాతి శ్రీరామ చంద్రుని అడుగడుగునా గుర్తు చేసుకొంటుంది. ఒక జాతిలోని మాతృభక్తి భావనే ఆ జాతి ఉత్థాన పతనాలకు హేతువు. ఈ భావం జాగృతమై ఉన్న జాతి వైభవ శిఖరాలకు చేరుకొంటుంది. ఈ భావం అడుగంటిన జాతి అథ:పతనం చెందుతుంది. మనదేశ చరిత్రే దీనికి నిదర్శనం. ఉత్థాన పతనాలను రెండింటిని అనేకసార్లు చూసిన జాతి మనది.    

సమాజంలో వ్యక్తి, కుటుంబము, గ్రామము, దేశం, విశ్వం, సృష్టి ఈ అంశాలు పరస్పర సంబంధం కలిగి ఉన్నవి. వ్యక్తి కుటుంబంలో భాగం, కుటుంబం గ్రామంలో భాగం, గ్రామం ప్రాంతంలో భాగం, ప్రాంతం దేశంలో భాగం, దేశం విశ్వంలో భాగం. ఈ విషయాన్ని గుర్తించినప్పుడు మన సంబంధాలను నిర్వచించుకొంటాము. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన మన పూర్వులు కుటుంబము అనే కల్పనను ఈ సృష్టికి అన్వయించారు. అందుకే 'వసుధైవ కుటుంబకమ్'. ఈ ప్రపపంచమంతా ఒక కుటుంబంగా వ్యవహరించాలి అని చెప్పారు.   

ఈ కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచ ప్రజలందరికి ఈ ప్రపంచం ఒక గ్రామం అనే భావన వచ్చింది. దీనినుండి ఒ­­క్కడుగు ముందుకు వేసి ప్రపంచమంతా నేడు ఒకే కుటుంబం అనే భావన వికసించినప్పుడు ఈ విశ్వంలో శాంతి స్థాపించబడుతుంది. కుటుంబములో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, మానసిక భేదాలు ఉండవు, ఉండకూడదు. ప్రపంచంలో భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. మానసిక భేదాలు ఉండవు. ఉండకూడదు. ప్రపంచంలో భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. అయినా పరస్పర గౌరవ భావంతో వ్యవహరించినప్పుడు సమస్యల తీవ్రత ఉండదు. అందుకే ఈ ఆలోచనలను మన పెద్దలు మనకు ఇచ్చారు. సదా ఈ భావాలు మన అంత:కరణాలలో ఉండాలి.   

నిత్యజీవితంలో ఎవరికి వారం మన వ్యవహారాలలో చిక్కుకొని నడుస్తున్నప్పుడు ఆశయ విస్మరణ జరగకుండా ఏ విద్యా, విజ్ఞానాల మీద మన ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు చేసేది శ్రావణ పూర్ణిమ. ఆ ధర్మం, సంస్కృతి సాంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు మనందరం పరస్పరం కలయికతో రక్షకులమై నిలబడాలని గుణపాఠం నేర్పించేదే రక్షాబంధన్. ధర్మో రక్షతి రక్షిత:,  ధర్మం యొక్క స్వభావం అది. ధర్మరక్షణలోనే మన రక్షణ ఉంది.   

వ్యామోహంతో ధర్మాన్ని అతిక్రమిస్తే ఆ వ్యామోహమే మన పతనానికి దారి తీస్తుంది. దానికి మంచి ఉదాహరణ ధృతరాష్ట్రుని జీవితం. ధృతరాష్ట్రుని పుత్రవ్యామోహం కారణంగా తన పుత్రులే కాదు, ఆ పుత్రులను సమర్ధించిన వారిని ఎవరిని ధర్మం వదిలిపెట్టలేదు. అందరికీ శిక్ష పడింది.  ఈ కాలంలో సృష్టి ధర్మాలను అతిక్రమించిన కారణంగా వస్తున్న అనర్థాలను తట్టుకోవటానికి పృథ్వీ సదస్సులు ఏర్పాటు చేసుకోవలసి వస్తున్నది. ఇట్లా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.  

మనదేశంలో రాజ్యాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న కారణంగా వందల సంవత్సరాలు మనం అస్తిత్వం కోసం పోరాటం చేయవలసి వచ్చింది. వందల సంవత్సరాలుగా మనదేశంలో సామాజిక సంబంధాలు దెబ్బతిన్న కారణంగా అనేక సమస్యలు నేడు కూడా మనం ఎదుర్కొంటున్నాము.   

సామాజిక సంబంధాలను పటిష్టపరచాలంటే సమాజంలో సామరస్య భావన నిర్మాణం కావాలి. ఆ భావన నిర్మాణం చేయటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కులాల మధ్య సంఘర్షణలు, మతాల మధ్య సంఘర్షణలు అంతరించి మనం అనే భావం దేశంలో నిర్మాణమైనప్పుడు ఈ దేశంలో జాతీయ సమైక్యత నిర్మాణమవుతుంది. ఈ దిశలో ప్రయత్నాలకు ప్రేరణగా శ్రావణ పౌర్ణమి పర్వదినాన మనం నిర్వహించుకొనే పండుగ రక్షాబంధన్.  

భారతదేశంలో ఇస్లాంలోకో, క్రైస్తవంలోకో మారినవారు ఎట్లా ఉన్నారు? ఈ మారినవారందరు ఈ దేశం వాళ్ళే. ఇక్కడి ధర్మం, సంస్కృతిలో జీవించినవారే కాని వాళ్ళు ఈ విషయాలకు ప్రాధాన్యతనివ్వటం లేదు. దీని కారణంగా పరస్పర విద్వేషం నిర్మాణం చేసారు. చేస్తున్నారు. వాళ్ళకు గుర్తు చేయవలసినది మీరు భారతీయులు, మీరు హిందువులు. ఈ దేశంలో మనం అందరం సమాన గౌరవ భావనతో జీవించాలి. మనం అందరం ఒకే కుటుంబ సభ్యులుగా జీవించాలి అని గుర్తు చేయవలసి ఉన్నది. పరస్పరం మనస్సు విప్పి మాట్లాడుకోవడం, పరస్పర అవగాహన పెంచుకోవటం, మనం అందరం ఈ భారతమాత యొక్క సంతానం అనే సత్యాన్ని గుర్తింపచేయాలి. ఈ దిశలో ఆలోచిస్తూ పని చేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘము. సంఘం కులం, మతం, ప్రాంతం, భాష వీటికి అతీతంగా మనం హిందువులం అని, మనం పరస్పరం కలయికతో మన మాతృదేశాన్ని అన్ని రంగాలలో శక్తివంతం చేద్దామని చెబుతున్నది. భారతదేశంలో ఇస్లాం, క్రైస్తవాలకు ముందే ఈ దేశంలో భిన్నమైన మతాలు, సాంప్రదాయాలు, పంథాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికి వాటిమధ్య అవగాహన, ఒకే తత్వం ఉన్నది. అప్పుడప్పుడు చిల్లర మల్లర తగాదాలు ఉన్నా అందరూ సమన్వయంతో జీవించారు, జీవిస్తున్నారు. అభిప్రాయ భేదాలు పెచ్చరిల్లుతున్నప్పుడు మనలో ఉన్న ఏకాత్మతా భావాన్ని గుర్తు చేసి సామరస్యం సాధించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ దేశంలో జన్మించిన వేదవ్యాసుడు గాని, జగద్గురు శంకరాచార్య గాని సాధించింది ఏకాత్మతా భావమే. ఈ కాలంలో ఈ దేశంలో తమ సంబంధాలను పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఉన్నది. ఈ దేశంలో హిందూ సమాజం శక్తివంతమైనప్పుడు ఈ జాతీయ జీవన స్రవంతి నుండి మేము వేరుబడ్డాము అనుకొనే వారికి మీరు మేము వేరు కాదు, 'మనం' అనే భావం నిర్మాణం చేసి ఈ జాతిని శక్తివంతం చేయాలి. ఇది ఒక జాతీయ ఆవశ్యకత. ఈ ఆవశ్యకతను గుర్తించి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పనిచేస్తున్నది. సంఘం ప్రతి సంవత్సరం రక్షాబంధన్ సమయంలో విస్తృతంగా సమాజంలోనికి వెళ్లి అందరిని కలిసి నీకు నేను రక్ష, నీవు నాకు రక్ష, మనం ఇద్దరం ఈ దేశానికి రక్షగా నిలవాలనే సందేశం అందిస్తున్నది. ఈ ఆలోచనలను వేగవంతంగా సమాజమంతా విస్తరించాలి. అప్పడే ఈ దేశం శక్తివంతమవుతుంది. తద్వారా ప్రపంచంలో శాంతి స్థాపించబడుతుంది.   

సమాజంలోని సామాజిక సంబంధాలను ఏ శాస్త్రసాంకేతిక రంగం నిర్వచించలేదు. అవి మనస్సులలో నుండి పెల్లుబికి రావలసిన భావాలు. అవి పరస్పర సంబంధాల కారణంగా వస్తాయి. అందుకే ఎప్పుడూ మన పెద్దలు కుటుంబ భావనను గుర్తు చేస్తూంటారు. పరస్పర సోదర సోదరీ భావన అందులో ఉంది. ఈ రక్షాబంధన్ సమయంలో మన సోదరి మనకు రక్ష కడుతుంది. నేను ఈ కుటుంబానికి చెందిన దానినే, నా రక్షణ బాధ్యత మీపై ఉన్నదనే సందేశం అందులో ఉన్నది.  

ఇటువంటి సోదర సోదరీ భావం పటిష్టంగా ఉన్నప్పుడు ఈ దేశంలో స్త్రీలు గౌరవించబడ్డారు, రక్షించబడ్డారు. ఈ రోజున సమాజంలో మహిళలపై పెచ్చరిల్లుతున్న దాడులను అరికట్టాలంటే ఒక భావాత్మకమైన మార్పు సమాజంలో రావాలి. నేడు యువత అన్ని రంగాలలో దూసుకొనిపోతున్నది. ఆ యువతకు మన సామాజిక సంబంధాలు, మన సాంస్కృతిక సంబంధాలు గుర్తుచేసి చైతన్యవంతం చేయాలి. అదే రక్షాబంధన్ మనకు ఇచ్చే సందేశం.  
- రాము