పోప్ రాజీనామాకు అసలు కారణం ?

పోప్ బెనడిక్ట్ 16

ప్రపంచ రోమన్ కేథలిక్ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ నగరం. కేథలిక్ క్రైస్తవులకు అధిపతి పోప్. పోప్ పరంపరలో 111వ పోప్ అయిన పోప్ బెనడిక్ట్ 16 అనారోగ్య కారాణాల వల్ల తన పోప్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లుగా అర్థంతరంగా ప్రకటించారు. ఈ వార్త క్రైస్తవ ప్రపంచానికి ఆశ్చర్యాన్ని, అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించింది. 600 సంవత్సరాల తరువాత మళ్లీ ఒక పోప్ బ్రతికి ఉండగా పోప్ బాధ్యతల నుండి తప్పుకోవడం అరుదైన అంశంగా భావిస్తున్నారు. 

2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాటికన్ కేథలిక్ వ్యవస్థలో స్త్రీలు, పిల్లలపై లైంగిక వేధింపులు, స్వలింగ సంపర్కం నియంత్రించలేని, సంస్కరించలేని వికృత దశకు చేరుకున్నాయని, ఆ పరిస్థితులలో జోక్యం చేసుకున్నందువల్ల వచ్చే వత్తిడులు, సవాళ్లను తట్టుకోలేక పతనమవుతున్న వ్యవస్థను నియంత్రించలేని అసహాయ స్థితిలో పోప్ బెనడిక్ట్-16 తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఇటలీలోని "లా రిపబ్లికా" అనే పత్రిక పేర్కొన్నది. పై పరిస్థితులకు కారణాలు విశ్లేషిస్తే 1950 నుండి ఇప్పటికి సుమారు లక్షమంది అమెరికన్ పిల్లలపై 6000 మంది మత గురువులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నక్రైస్తవ మత గురువులలో 5.6శాతం మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం గమనార్హం. అంతేకాక వాటికన్ లో స్వలింగ సంపర్కుల నెట్ వర్క్ పని చేస్తున్నదని, వారంతా విపరీతమైన బ్లాక్ మెయిలింగ్ ఎదుర్కొంటున్నారని, ఈ విషయాలపై ముగ్గురు సీనియర్ కార్డినళ్లు 300  పేజీల రహస్య నివేదికను పోప్ కు సమర్పించారు.  దాని పర్యవసానాలను ఎదుర్కొనలేక పోప్ బెనడిక్ట్-16 రాజీనామా నిర్ణయం తీసుకున్నారని పై ఇటలీ పత్రిక పేర్కొంది. 

క్రైస్తవ మతంపై మలాచీ భవిష్యవాణి :  

సెయింట్ మలాచీ క్రీ.శ.1094లో ఐర్లాండులో జన్మించారు. 1148లో మరణించారు. 1139లో వాటికన్ సిటీని సందర్శించారు. ఆ సమయంలో మలాచీ అలౌకికావస్థకు లోనై క్రైస్తవం గురించిన భవిష్యవాణిని వినిపించారు. దానిలో భాగంగా మలాచీ 112 మంది పోప్ ల జాబితాను ప్రకటించారు. 112వ పోప్ వాటికన్ కు చివరి పోప్ అని, అటు తరువాత క్రైస్తవం పతన దశకు చేరుకుంటుందని భవిష్యవాణిని వినిపించారు. ఆ 112 మందిలో ప్రస్తుతం పదవీ బాధ్యతల నుండి తప్పుకుంటున్న పోప్ బెనడిక్ట్-16 111వ పోప్. మలాచీ ప్రకటించిన భవిష్యవాణిని చర్చి అంగీకరించనప్పటికీ జాబితాలో వారు పేర్కొన్న పోప్ ల పేర్లు అసలు పేర్లతో కాకున్నా సంకేత నామాలతో సరిపోలుతున్నాయి. మలాచీ భవిష్యవాణి ఆధారంగా ఇప్పుడు 112వ పోప్ తర్వాత క్రైస్తవం పతనంపై ఆయా వర్గాల్లో సంశయాత్మక చర్చ జరుగుతున్నది.

- పతికి