మహా యోగి - శ్రీ గురూజీ

ఫిబ్రవరి 25 మాఘ బహుళ ఏకాదశి - శ్రీ గురూజీ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం


స్వాతంత్ర్య పోరాట కాలంలో సాంస్కృతిక జాతీయ వాదానికి బలమైన పునాదులు వేసిన వారిలో బంకించంద్ర, అరవింద, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూరు, వీరసావర్కర్ లను ప్రముఖంగా పేర్కొనవచ్చు. హిందుత్వమే భారత జాతీయత అని స్పష్టంగా చెప్పినవారు డా.హెడ్గేవార్. హిందూ సమాజాన్ని సంఘటిత పరచడానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించినవారు డాక్టర్ హెడ్గేవార్. ఆ కార్యాన్ని దేశమంతా విస్తరింపచేసినవారు శ్రీ గురూజీ. సంఘకార్యం సర్వవ్యాపి, సర్వస్పర్శిగా తీర్చిదిద్ది దేవదుర్లభమైన కార్యకర్తలను నిర్మాణం చేసినవారు శ్రీ గురూజీ. శ్రీ గురూజీ 1940 నుండి 1973 వరకు సరసంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహించారు. అనేక సంక్లిస్ట పరిస్థితులలో సంఘాన్ని ముందుకు తీసుకొనివెళ్లినవారు శ్రీ గురూజీ గోళ్వల్కర్.

భర్తృహరి సుభాషితంలో ఇలా ఉంది 

“పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం |
నాభ్యర్థితో జలధరోపి జలం
సదాసంత: స్వయంపరహిత్ విహితాభియోగ: ||


సూర్యుడు తన కిరణాలను ప్రసరించి పద్మాలను వికసింపచేస్తాడు, చంద్రుడు తన వెన్నెల జల్లులను కురిపించి కలువపూలను వికసింపచేస్తాడు, అడగనక్కరలేకుండానే మేఘాలు జలాలనిస్తాయి, మహాపురుషులు స్వయంగానే ప్రజాసేవకు తమను తాము అంకితం చేసుకొంటారు. అటువంటి మహాపురుషుల పరంపరలో జన్మించినవారు శ్రీ గురూజీ.

అరిభయంకరుడు, లోకరంజకుడు కూడా కావటం ఒకే వ్యక్తికి సర్వసాధారణంగా సాధ్యపడదు. అది శ్రీరాముడికే సాధ్యపడింది. శ్రీరాముడు ఎంతటి రణకోవిదుడో, అంతటి ప్రజా పాలనా దక్షుడు.  ఈ దేశంలో జన్మించిన అటువంటి అరుదైన మహాపురుషుల పరంపరలో పూజ్యశ్రీ గురూజీ ఒకరు. ధర్మరాజును అజాత శత్రువు అంటారు. అటువంటి వ్యక్తిత్వం శ్రీ గురూజీది కూడా.


  • జగద్గురు శంకరాచార్యుల వారు దేశమంతట రెండుసార్లు తిరిగి దేశంలోని అధ్యాత్మిక రంగం మధ్య సమన్వయం సాధించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దేశాన్ని సుస్థిరపరచారు. శ్రీ గురూజీ ‘హిందుత్వమే భారత జాతీయత’ అని స్పష్టీకరించి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున దేశమంతా 33 సార్లు పర్యటన చేశారు. దేశం యొక్క సర్వాంగీణ వికాసం కోసం దేశంలోని అన్ని సామాజిక రంగాలలో పనిని ప్రారంభింపచేశారు. ఈ రోజున కార్మిక, కర్షక, వనవాసీ, విద్యా, విద్యార్థి - ఇట్లా అన్ని రంగాలలో జాతీయ స్థాయిలో అనేక సంస్థలు ప్రభావవంతంగా పని చేస్తున్నాయి.

భారతదేశం 1940-48 మధ్యకాలంలో అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. దేశ విభజన అనంతరం మహాత్మాగాంధీజీ హత్య జరిగిన నేపథ్యంలో దేశమంతటా మతకలహాలు చెలరేగాయి. ఈ పరిస్థితులలో ఎంతో సంయమనంతో వ్యవహరించి దేశంలో శాంతి భద్రతలను కాపాడటంలో సంఘం శ్రీ గురూజీ నేతృత్వంలో తనవంతు బాధ్యతను నిర్వహించింది. గాంధీజీ హత్యకు, సంఘానికి ఏ సంబంధం లేకపోయినా సంఘాన్ని నిషేధించి వేలమంది స్వయంసేవకులను జైలుపాలు చేసింది కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం.  సంఘంపై నిషేధాన్ని తొలగింపచేసేందుకు స్వయంసేవకులు సత్యాగ్రహం చేసారు. సంఘంపై నిషేధం తొలగిపోయింది. దీనికి శ్రీ గురూజీ కృషి ఎంతో ఉంది. శ్రీ గురూజీ నేతృత్వం అటువంటిది.  సంఘాన్ని, శ్రీ గురూజీని ఎవరైతే వ్యతిరేకించారో అటువంటి వాళ్ల కళ్లు తెరిపించినవారు శ్రీ గురూజీ.

స్వతంత్ర భారతదేశంలో మన పాలకులే మనలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేసుకొంటూ వస్తున్నారు. ఈ దేశ ప్రజలను, మెజార్టీ, మైనార్టీ, దళితులు, ఆదివాసులు.. ఇలా అనేక చీలికలు చేసి మాట్లాడటం ప్రారంభించారు. మనం అందరం ఒకేజాతి అని శ్రీ గురూజీ స్పష్టం చేశారు. సంఘం పైన అనేక దుష్ప్రచారాలు జరిగాయి. వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా పని చేసుకొంటూ పోయారు. సంఘాన్ని శక్తివంతం చేసారు. వందల సంవత్సరాల సామాజిక దురాచారాలను రూపుమాపటానికి కృషి చేసారు. అంటరానితనం మన శాస్త్రాలలో లేదని మఠాధిపతులు, పీఠాధిపతులతో తీర్మానం చేయించారు. ఏ హిందువు పతితుడు కాడు అని చెప్పించారు. అట్లాగే దేశంలోని ధార్మిక వ్యవస్థల పరిరక్షణకు విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేయించారు. ఇట్లా అనేక సామాజిక సంస్థలు ప్రారంభింపచేశారు.

ఢిల్లీకి పర్యటనకు వెళ్లినప్పుడు తప్పకుండా దేశ గృహమంత్రిని (హోమ్ మినిస్టర్) కలిసేవారు. దేశ పర్యటనలో తన దృష్టికి వచ్చిన విషయాలను వారికి వివరించి చెప్పేవారు. వాళ్లు శ్రీ గురూజీ కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. గురూజీ ఒక మహాయోగి. తన తపశ్శక్తి ద్వారా సమాజమంతటిని జాగృతం చేసేందుకు పనులు ప్రారంభింపచేసారు. ఈ రోజు దేశంలో సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యం సంఘం నిర్వహించిన, నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రభావమే.

ఈ నెల 25 వ తేదీ పూజ్య శ్రీ గురూజీ జన్మదినం. ఆ సందర్భంగా ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకొంటున్నాము.
- రాము