దేశంలో మార్పు తెద్దాం


2014 ఆగష్టు 15నాడు భారతీయులు ఎర్రకోటపై జరుపుకొన్న స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అంతకుముందు 66 సంవత్సరాల పాటు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాలకు ఈ స్వాతంత్ర్యదినోత్సవానికి వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనబడింది. 

ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనదేశ ప్రధానమంత్రి నరేంద్రమోది చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని ఆకట్టుకొన్నది. స్వాతంత్ర్యదినోత్సవం ముందు రోజు అర్థరాత్రి రెండుగంటలకు ఎర్రకోట బురుజులపైన నిర్మించిన ప్రసంగవేదికపై అమర్చిన బుల్లెట్ ప్రూఫ్ ఫైబర్ గ్లాస్ కవచాన్ని తొలగించవలసిందిగా ప్రధాని ఆరోపించారు. ఈ ఆదేశంతో ప్రజలలో తనకు ఉన్న సంబంధాలు, ప్రజలతో తను మమేకం కావాలన్న సంకేతాన్ని ప్రధాని ఇచ్చారు. ముందుగా కాగితంపై వ్రాసుకున్న ప్రసంగం కాకుండా, భావోద్వేగాలు, వాగాడంబరం లేకుండా ప్రధాని ప్రసంగం ప్రజల సమస్యలను సూటిగా స్పృశిస్తూ హృదయపూర్వకంగా, అనర్గళంగా ఒక గంటసేపు సాగింది. 

ప్రధాని మోది ప్రసంగాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పదిమందిని కలుపుకొనిపోయే స్వభావంతో సయోధ్యకు పెద్దపీట వేస్తూ ముందుచూపుతో, ఆధునిక భావాలతో కూడి ఉండటం విశేషం. కుటుంబ విలువలు, నైతికత, పరిశుభ్రత, క్రమశిక్షణ, దేశభక్తి లాంటి విషయాలను నొక్కిచెబుతూ ఆ ప్రసంగం సాగింది.

ఆత్మవంచనే ప్రధానసూత్రంగా వర్ధిల్లే నేటి భారత రాజకీయాలలో కపటం లేకుండా, వామపక్ష వాగాడంబరము ప్రదర్శించకుండా ప్రసంగించటం ఒక విశేషం. ఇది ఒక నిజమైన దేశభక్తునికి మాత్రమే చెల్లుతుంది. మహిళల పట్ల అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపట్ల గౌరవం ప్రదర్శించాలని చెప్పారు. తమ కుమార్తెలను అదుపు ఆజ్ఞలలో ఉంచుతూ పెంచుతున్నట్లుగానే కుమారులను కూడా అదుపు ఆజ్ఞలలో ఉంచి పెంచాలని తల్లితండ్రులకు సున్నితంగా సూచించారు. అప్పుడే దేశంలోని చాలా సామాజిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

ప్రధాని మోది ప్రసంగంలోని ముఖ్యాంశాలు  

'ఈ దేశం పరంపరాగత, సాంస్కృతిక పునాదులపై నిలబడి ఉంది. వేదకాలం నుండి ఈ దేశంలో "సంఘచ్చధ్వం.. సంవోమనాంసి జానతాం" అనగా 'కలిసి నడుద్దాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి ముందుకు వెళదాం' అనేది ఈ దేశ మూలసూత్రం. ఇక్కడి ప్రభుత్వంలో అనేక ఇతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రతిఒక్కరు తమ సొంతరాజ్యం నడిపిస్తున్నారు. పరస్పరం కలిసి పనిచేయవలసిన ఒక విభాగంలోని వివిధ విభాగాలు కొట్టుకొంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాయి. ఇటువంటి పోకడలు దేశాన్ని ముందుకు తీసుకొనివెళ్తాయా? వీటిని సరిచేసేందుకు నేను ప్రయత్నాలు ప్రారంభించాను.

మనదేశంలో ఉన్న మావోయిస్టులు, ఉగ్రవాదులు అందరూ ఎవరో ఒక తల్లి పిల్లలే కదా! వాళ్ళను సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఆ తల్లిదండ్రులు ప్రయత్నించి ఉంటే, తప్పుత్రోవ పట్టవద్దని హెచ్చరించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవా? హింసాత్మక మార్గంలో వెళుతున్న వారికి నేను ఒకమాట చెప్పదలచుకొన్నాను, తుపాకుల్ని భుజాన పెట్టుకొని మీరు భూమాతను ఎంతో రక్తసిక్తం చేస్తున్నారు. అదే భుజాల మీద నాగలి పెట్టుకొంటే భూమాత పచ్చగా మారుతుంది కదా! ఎందుకీ రక్తపాతం?

మనం ప్రతివస్తువును విదేశాల నుండి ఎందుకు దిగుమతి చేసుకోవాలి? ఆ వస్తువులను 'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో మనదేశంలో మనమే తయారుచేసి ఎగుమతి చేయవచ్చు కదా? రండి, అందరం కలిసి ఆ మార్గంలో వెళ్దాం. మరో విషయం - మనం చేసే ఏ పనికూడా పర్యావరణంపై దుష్ప్రభావం చూపకూడదు. అటువంటి నైపుణ్యాన్ని పెంచుకొందాము. డిజిటల్ ఇండియాను రూపొందించుకొందాము. దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్దాము, మార్పు తెద్దాం.