న్యాయాన్ని అందించే వ్యవస్థలో మతతత్వం తెచ్చిపెట్టవద్దు

- ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక సంపాదకీయం


మహమ్మదీయ యువకులు నిందితులుగా బంధితులై ఉన్న తీవ్రవాద సంబంధమైన కేసులను త్వరగా విచారించి తేల్చివేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (శీఘ్ర విచారణ న్యాయస్థానాలు) ఏర్పరచబోతున్నామని కేంద్ర గృహపాలనా శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. రాజధాని కొత్తఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ఒక సలహా పత్రాన్ని పంపించామని, ఎన్ని సంవత్సరాలుగా, ఎంతెంత మంది ముస్లింలు జైళ్లలో మ్రగ్గుతున్నారో ఆ విషయాలు సేకరిస్తున్నామనీ చెప్పారు. 

తీవ్రవాద చర్యలు దేశభద్రతకు ప్రమాదకరంగా ఉన్న విషయంలో, అటువంటి కేసులను శీఘ్రంగా విచారించాలనే విషయంలో ఎటువంటి సందేహమూ ఉండనక్కరలేదు. ఏ వ్యక్తిని గాని, అతని బాహ్య రూపాన్ని బట్టి గాని, అతడు అనుసరించే మతాన్ని బట్టి గాని అనుమానితునిగా పరిగణించి, బందీని చేయగా వారు చిరకాలం జైళ్లలో పడి మ్రగ్గిపోవలసిన స్థితి తలెత్తరాదు. 

అయితే మంత్రిగారి పై ప్రకటనను ఒక దుశ్శకునంగా చూడవలసిన స్థితిని కల్పిస్తున్న అంశం - న్యాయ విచారణ ప్రక్రియలను మతాల పేరుమీద ప్రభావితం చేయజూడటం. భారతదేశంలో కేసుల విచారణ సుదీర్ఘకాలం సాగుతూండటం మన వ్యవస్థకు ఒక శాపంగా ఉంది. విచారణ ఎప్పటికి పూర్తవుతుందా? అని ఎదురు చూస్తూ ఏళ్లతరబడి జైళ్లలో గడుపుతున్న యువకులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో కొంతమంది స్థితి ఎటువంటిదంటే, వారు నేరస్థులుగా నిర్ధారింపబడి ఉన్నా, వారికి విధింపబడిన శిక్షాకాలం పూర్తయినందున ఈ పాటికి విడుదల పొందియుండే వారు. జామీనుపై విడుదల పొందగలిగిన అవకాశమున్న కేసులను ఎదుర్కొంటున్నవారు కూడా తగినంతగా న్యాయసహాయం లభించక, ఆర్థిక వనరులు లేక, ఆ సదుపాయాలను వినియోగించుకోలేక పోతున్నారు. అటువంటి బాధల ననుభవిస్తున్న వారికి తోడ్పడడానికి వారి కులమతాలతో సంబంధం లేకుండా ఒక ప్రణాళిక రూపొందించినట్లయితే మంత్రిగారు ఒక ప్రశంసనీయమైన పని చేసినట్లయి ఉండేది.

మన న్యాయస్థానాలలో ఏ కారణాలతో ఆలస్యం జరుగుతూ ఉంది అనే విషయాన్ని సమగ్రంగా అన్ని కోణాల నుండి పరిశీలించవలసి ఉంది. దూరదృష్టి లేకుండా మతతత్వాన్ని జొప్పించే తీరు సమర్థనీయం కాదు. మతాల వారీగా నిందితులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పరచటం 'అందరూ సమానులే'నన్న ప్రాథమిక హక్కును ఉల్లంఘించేదిగా ఉంది. మన రాజ్యాంగంలో పొందుపరచబడిన 'సర్వపంథ సమభావన (సెక్యులరిజం)' అనే భావాన్ని కుళ్లబొడిచేదిగా ఉంది. ఇప్పటి మన సమస్యకు కావలసిన పరిష్కారం - న్యాయస్థానాల సంఖ్యను పెంచి, సరళీకృతం చేయబడిన వేగవంతమైన ప్రక్రియల ద్వారా విచారణ ప్రక్రియను వేగవంతం చేయటం. ఆ విధంగా న్యాయవిచారణ విధానాన్ని పటిష్టం చేయటం.

అలాగాక ఒక మత సముదాయానికి చెందిన వారి కేసులను విచారించం కొరకు ప్రత్యేకంగా శీఘ్రవిచారణ న్యాయస్థానాలను ఏర్పరచటం న్యాయాన్ని వక్రమార్గం పట్టించటమే అవుతుంది. 'దానివల్ల జరుగుతున్నది న్యాయమేనా?' అనే అనుమానం ప్రజలలో బలపడితే ఆశ్చర్యం ఉండబోదు.