చర్చి అత్యాచార పర్వంపై వాటికన్ కు ఐ.రా.స. మొట్టికాయలు

 
'పాపులను ప్రపంచవ్యాప్తంగా రక్షించేందుకే ఏసు ప్రభువు ఉన్నాడు' అని చాటే క్రైస్తవుల తీర్థక్షేత్రం 'వాటికన్'. గత 20 ఏళ్ళుగా క్రైస్తవం పేర క్రైస్తవులు నడుపుతున్న క్యాథలిక్ పాఠశాలల, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, శరణార్థి శిబిరాలలో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎటువంటి సమాధానం చెప్పకుండా చర్చి ఐక్యరాజ్యసమితి నుంచి తప్పించుకొంటోంది.

వేలమంది క్రైస్తవ మత పెద్దలు వేలమంది పిల్లలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డ నిజం ఈ మధ్యనే రట్టయింది. సుమారు 12 కోట్ల చర్చిలలో ఈ అత్యాచార పర్వం యథేచ్చగా సాగిపోతోంది. చర్చిల పరువు పోకుండా వాటికన్ పెద్దలు పూజారులను (పాస్టర్ లను) పోలీసుల వద్దకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.

చివరకు ఐక్యరాజ్యసమితి రంగప్రవేశం చేసింది. వందల పేజీల సమాచారాన్ని, ఋజువులను బాధితుల నుండి సేకరించింది. ఏమాత్రం క్షమార్హం కాని వైఖరి నుండి చర్చి ఎందుకు వైదొలగిందని ఐరాస వాటికన్ ను ప్రశ్నించింది. కొత్తగా నియమితులైన పోప్ ఫ్రాన్సిస్ చివరకు చర్చి తప్పులకు అంగీకరించారు. 'భగవంతుడితో సంబంధం కోల్పోయినపుడే అత్యాచారాలు జరుగుతాయి' అని చెపుతూ తన అసహాయతను వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించమని వాటికన్ అధికారులను కోరారు.

బాధితుల వివరాలు సేకరించమని, వారికందుతున్న సహాయం గురించిన గణాంకాలు రూపొందించమని ఐరాస సభ్యులు సూచించారు. చివరకు డొమేనియా దేశంలో వాటికన్ రాయబారి కూడా టీనేజ్ మగపిల్లలపై లైంగిక అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో వాటికన్ కు వచ్చి కోర్టులో న్యాయవిచారణ ఎదుర్కొంటున్నాడు. మొదటిసారిగా జెనీవాలో పోప్ కు ఈ జనవరి 16న ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన 'రాజ్యాంగ హక్కుల కేంద్రం' పోప్ దృక్పథంలో మార్పును ప్రశంసిస్తూనే అది ఆచరణలో ఎలా ఉంటుందో? అన్న సందేహం వ్యక్తం చేసింది.

ఈ విషయమై అంతర్జాతీయ నేరాల న్యాయస్థానంలో విచారణ జరగాలని కోరుతూ 22000 పేజీల సాక్ష్యాధారాలను సమర్పించింది.

చర్చి పేరున, ప్రభువు పేరున జరుగుతున్నది భక్తి ఉద్యమమేనా? అయితే మరి ఐ.రా.స. చేత మొట్టికాయలు వేయించుకునే దుస్థితి ఎందుకు వచ్చింది?

- హనుమత్ ప్రసాద్