వివేకానంద కలల భారతాన్ని నిర్మించడంలో మీడియా పాత్ర చాలా కీలకమైనది

డా.చందన్ మిత్ర

సెమినార్ లో ప్రసంగిస్తున్న డా.చందన్ మిత్ర

స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా "వివేకానంద కలల భారతం-మీడియా పాత్ర" అనే అంశంపై సంగోష్టి (సెమినార్) కార్యక్రమం 24.8.2013 నాడు సమాచార భారతి - వివేకానంద150వ జయంతి ఉత్సవ సమితి సంయుక్తాధ్వర్యంలో మారియట్ హోటల్ లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నరసింహా రెడ్డిగారు పాల్గొన్నారు. ప్రధాన వక్తగా ప్రముఖ పాత్రికేయులు, పయినీర్ పత్రిక ప్రధాన సంపాదకులు (చీఫ్ ఎడిటర్) అయిన డా.చందన్ మిత్ర పాల్గొన్నారు. వివేకానంద కేంద్రం ఉపాధ్యక్షురాలు కుమారి నివేదితా భిడే, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి, ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎస్.ఆర్.రామానుజన్, వివేకానంద సార్థశతి సమారోహ్ కేంద్రకమిటీ సభ్యులు జస్టిస్ సి.వి.రాములు, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంపాదకులు శ్రీ జి.వల్లీశ్వర్, సమాచార భారతి అధ్యక్షులు శ్రీ టి.హరిహరశర్మ తదితరులు పాల్గొన్నారు. 

జ్యోతిప్రజ్వలన

ఈ కార్యక్రమంలో దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వివేకానందుడు సూచించిన పరిష్కారాలను వివరిస్తూ ఎనిమిది మంది జర్నలిస్టులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు.

కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న డా.చందన్ మిత్ర ప్రసంగిస్తూ -"సత్యమనేది భారతదేశం యొక్క ఆత్మ. భారతదేశం ప్రపంచం యొక్క ఆత్మ. ఇది శాశ్వతం. ఈ దేశంలో జన్మించిన అనేకమంది సాధుసంతులు మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించి దానిని సాక్షాత్కరింపచేసుకొని దానిని ఆవిష్కరించేందుకు కృషి చేసారని ఆ మార్గంలోనే వివేకానందుడు కూడా కృషి చేశాడ"ని వివరించారు. 

కార్యక్రమ ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మాట్లాడుతూ -"మంచి పనికి ప్రాధాన్యత నివ్వని టివి ఛానెళ్లు నేరస్థులకు మాత్రం తెగ ప్రాధాన్యతనిచ్చి ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి మాట్లాడుతూ - "స్వామి వివేకానందను పాత్రికేయులు ఆదర్శంగా తీసుకోవాలి" అని అన్నారు.

"నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, కాని మతమార్పిడులకు వ్యతిరేకం" అని స్వామి వివేకానంద చెప్పారని శ్రీ ఎస్.ఆర్.రామానుజన్ వివరించారు.

"భగవంతుడ్ని దర్శించాలనే కోరికతో బయలుదేరిన స్వామి వివేకానందుడు సమాజ పరమేశ్వరుణ్ని దర్శించుకొని ఆరాధించారు. సమాజంలోని బీదల ఔన్నత్యం కోసం పరితపించారు. వివేకానంద కేంద్రం సమాజ సేవకోసం పనిచేసే యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి దేశంలోని వివిధ ప్రదేశాలలో పనిచేసేందుకు పంపుతున్నది. తద్వారా ఈ దేశ పునర్నిర్మాణమునకు కృషి చేస్తున్నద"ని కుమారి నివేదితా భిడే పేర్కొన్నారు.

కార్యక్రమంలో కుమారి నివేదితా భిడే రచించిన "Swami Vivekananda Vision on Indian Womenhood - Road ahead" అనే పుస్తకాన్ని డా.చందన్ మిత్ర ఆవిష్కరించారు.

శ్రీ వల్లీశ్వర్ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. శ్రీ కృష్ణమూర్తి, శ్రీ నీలేష్ జోషి, శ్రీ విశ్వనాథ్, శ్రీమతి స్రవంతి, శ్రీ రాఘవేంద్ర, శ్రీ వేదుల నరసింహం, శ్రీ రామ్మోహన్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో విశేష కృషి చేశారు.

కార్యక్రమం జ్యోతిప్రజ్వలన, వందేమాతర గీతాలాపనతో ప్రారంభమయింది. ప్రారంభంలో సమాచార భారతి పూర్వ అధ్యక్షులు శ్రీ కె.వి. శేషగిరిరావుగారి మృతికి సభా పూర్వకంగా సంతాపం తెలియచేయబడింది. చివరలో శ్రీ రాఘవేంద్ర వందన సమర్పణ చేయగా, జనగణమనతో పూర్తి అయింది.  

కార్యక్రమాన్ని శ్రద్ధగా తిలకిస్తున్న శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, తదితరులు

కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, పబ్లిక్ రిలేషన్స్ అంశంపై విశేష అధ్యయనం చేసి అంతర్జాతీయ అవార్డు పొందిన శ్రీ నర్సింహారెడ్డి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ క్షేత్ర సంఘచాలకులు శ్రీ టి.వి.దేశ్ ముఖ్ తదితర ప్రముఖులతో పాటు  రెండువందల మందికి పైగా యువ పాత్రికేయులు పాల్గొనటం విశేషం.

ఈ సందర్భంగా ఉజ్వల భారత నిర్మాణంలో వివేకానందుని ఆలోచనలను ఈ రోజుకి కూడా ఎట్లా అన్వయించవచ్చో అందరూ జ్ఞాపకం చేసుకోవడం జరిగింది.

సభికులతో నిండిన సభాప్రాంగణం
వందేమాతర గీతాలాపన
శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
పుస్తకావిష్కరణ
జస్టిస్ సి.వి.రాములు
ప్రసంగిస్తున్న శ్రీమతి నివేదితా భిడే
ప్రసంగిస్తున్న శ్రీ ఎస్.ఆర్.రామానుజన్
ప్రసంగిస్తున్న డా.చందన్ మిత్ర
డా.చందన్ మిత్రాకు జ్ఞాపికను బహూకరిస్తున్న సమాచార భారతి అధ్యక్షులు శ్రీ టి.హరిహరశర్మ
జనగణమన