సంఘ జ్యేష్ఠ ప్రచారక్ దీవి ద్వారకాచార్యులు ఆకస్మిక కన్నుమూత

దీవి ద్వారకాచార్యులు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ జ్యేష్ఠ ప్రచారకులు శ్రీ దీవి ద్వారకాచార్యులు (72) అనారోగ్యంతో బాధపడుతూ మే 30, 2013న ఉదయం 7.10 గంటలకు భాగ్యనగర్ బర్కత్ పురాలోని ఉడ్ లాండ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో జన్మించిన శ్రీ ద్వారకాచార్యులు తిరుపతిలో పాలిటెక్నిక్ చదువు పూర్తి చేసుకొని 1963లో సంఘ ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త) గా వచ్చారు. వారి ప్రచారక్ జీవనం కర్నూలు నగరం నుండి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రాంతంలోని నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేశారు. ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించారు. 1981 నుండి వనవాసీ కల్యాణ క్షేత్రంలో బాధ్యత తీసుకుని బస్తర్ కేంద్రంగా పనిచేశారు. తదుపరి అరుణాచలప్రదేశ్ లో వనవాసీ కల్యాణ క్షేత్ర కార్యానికి పునాది వేసి పనిని ప్రారంభించారు.   

గడచిన కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 30న స్వర్గస్తులయ్యారు. 31 ఉదయం 10.45 గంటలకు బర్కత్ పురాలోని కేశవ నిలయంలో సంతాపసభ జరిగింది. ఈ సభలో వనవాసీ కల్యాణ క్షేత్రం దక్షిణ భారత సంఘటనా మంత్రి శ్రీ రామచంద్రయ్య, చత్తీస్ గఢ్, అరుణాచలప్రదేశ్ ల నుండి కొంతమంది ప్రముఖులు, మరియు ద్వారకాచార్యగారి అన్నగారైన శ్రీ రామాచార్యులు పాల్గొని ప్రసంగించారు. ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలకులు శ్రీ మోహన్ జీ భాగవత్, వనవాసీ కల్యాణక్షేత్రం అఖిల భారత సంఘటనా మంత్రి శ్రీ సోమయాజులుగారు పంపిన సంతాప సందేశాలను చదివి వినిపించారు. వి.హెచ్.పి. అంతర్జాతీయ నాయకులు శ్రీ అశోక్ జీ సింఘాల్, అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి, బి.జె.పి., ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర, ప్రాంత ప్రముఖులు అనేకమంది ద్వరకాచార్యులుగారి భౌతిక కాయాన్ని అంతిమ దర్శనం చేసుకుని నివాళులర్పించారు. 

మధ్యాహ్నం 1 గంటకు అంబర్ పేటలోని స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.