తెలంగాణ రాజముద్రలో చార్మినారా?! ఇది దేనికి సంకేతం?!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన రాజముద్ర

అనేకమంది శక్తివంతమైన రాజులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. శాతవాహనులు, చాళుక్యులు మొదలైనవారు ఎందరో కనిపిస్తారు. కాలక్రమంలో కాకతీయులు వరంగల్ కేంద్రంగా పరిపాలించారు. కాకతీయుల కాలంలో తెలంగాణ అటు నెల్లూరు, ఇటు గోదావరి డెల్టా ప్రాంతం వరకు విస్తరించింది. ఆ కాలంలోనే తెలంగాణ ఒక గొప్ప సంస్కృతి విలసిల్లింది.  

ఈ రోజున తెలంగాణలో జరుపుకొనే ప్రత్యేక పండుగలు 'బతుకమ్మ' పండుగ, సమ్మక్క-సారలమ్మ జాతర, కురివి వీరభద్ర జాతర, ఐనవోలు, కొమరవెల్లి జాతరలు ఇవన్నీ కాకతీయుల చరిత్రను గుర్తుచేస్తాయి. కాకతీయుల సంస్కృతే తెలంగాణ సంస్కృతి. 

కాలక్రమంలో తెలంగాణ కూడా ముస్లింల దాడులనెదుర్కొంది. నిజామ్ నవాబు పరిపాలనలో మ్రగ్గిపోయింది.  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాం పరిపాలన అంతమై తెలంగాణ విముక్తి చెంది భారత్ యూనియన్ లో కలిసింది. నైజామ్ కాలంలో తెలంగాణ ప్రజలు ఎలా అణచబడ్డారు, ఆర్థికంగా, విద్యాపరంగా ఎంత వెనుకబడ్డారో మన సమకాలీన చరిత్ర తెలుపుతుంది. గొప్ప సంస్కృతి కలిగిన తెలంగాణను ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ కలసి ఆంధ్రపదేశ్ గా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మనందరికి తెలుసు. సుదీర్ఘ ఉద్యమం తరువాత 2014 జూన్ 2వ తేదీన అధికార పూర్వకంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. 

ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ప్రత్యేక రాజముద్ర తయారు చేయబడింది. ఆ రాజముద్రలో వాస్తవంగా కాకతీయుల జ్ఞాపకం ఉండాలి. కాని కెసిఆర్ నైజామ్ వారసత్వానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఎమ్.ఐ.ఎమ్. పార్టీతో స్నేహసంబంధాల కోసం ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్లతో కలవడం జరిగింది. వాళ్లు కూడా కెసిఆర్ కు మద్దతు తెలిపి తెలంగాణ రాజముద్రలో చార్మినార్ ను చేర్చాలని, ఉర్దూ భాషను తెలంగాణ భాషతో పాటుగా సమానంగా గుర్తించాలని కోరారు. ఈ నేపథ్యంలో తయారు చేయబడిన తెలంగాణ రాజముద్రలో చార్మినార్ చేర్చడం, దానిలో ఉర్దూలో తెలంగాణ ప్రభుత్వం అని వ్రాయడం జరిగింది. ఇదే సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచిన కవిత టైమ్స్ నౌ ఛానల్ లో మాట్లాడుతూ 'మాకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్.డి.ఏ. కంటే ఎమ్.ఐ.ఎమ్.తోనే సంబంధాలు ముఖ్యం' అని ప్రకటించింది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. 

తెలంగాణలో ముస్లిం ప్రాబల్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికే కె.సి.ఆర్. ప్రయత్నం. ప్రస్తుతం జరుగుచున్న ఈ పరిణామాలు దేనికి సంకేతం? తాత్కాలిక ప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఇటువంటి సంబంధాలు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో? తెలంగాణ ఏర్పడబోతున్న మొదటి ప్రభుత్వం ఎటువంటి దిశను చూపబోతున్నది? నైజాం వారసత్వాన్ని గుర్తుచేసి తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు సజావుగా సాగలేదనేది సమకాలీన చరిత్ర చెబుతున్నది. రాబోవు రోజులు ఈ విషయాలు మనకు అర్థమయ్యేలా చేస్తాయా?   

- మల్లిక్