భాజపాలోకి ముస్లింల వరద...

 
భారతదేశంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భా.జ.పా. ఘనవిజయాన్ని సాధించింది. భాజపా విజయాన్ని, అనంతరం ఏర్పడిన మోది ప్రభుత్వాన్ని ప్రపంచమంతా నిశితంగా పరిశీలిస్తున్నది. సహజంగానే భాజపా వారు సంతోషంలో మునిగి ఉన్నారు. 
 
ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్ లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అక్కడ ముస్లిములు ఒక ప్రవాహంలా వచ్చి భాజపాలో చేరిపోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఇది చూసి బెంగాల్ భాజపా వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వామపక్షాలలో ఉన్న ముస్లింలు చాలామంది భాజపాలోకి వస్తున్నారు. 2013 డిసెంబర్ నాటికి పెరిగిన సభ్యత్వంలో 6.06 శాతం వీరిదే ఉన్నది. అదే 2014 జూన్ నాటికి 12.38 శాతానికి పెరిగింది. ఒక్కసారిగా 60,172 మంది ముస్లిములు వచ్చి భాజపాలో చేరిపోయారు. ఈ పరిస్థితులు చూసినవారు భారతీయ జనతాపార్టీ కూడా మరొక కాంగ్రెస్ పార్టీ అవనున్నదా? అని ప్రశ్నిస్తున్నారు. 
 
ఎప్పుడూ భాజపాను శాపనార్థాలు పెట్టే వీరు ఎందుకు ఈ విధంగా భాజపాలోకి వస్తున్నారు? అని కొందరు భాజపా నాయకులు ఆలోచిస్తున్నారు. భాజపా బెంగాల్ పూర్వ అధ్యక్షులు తథాగత్ రాయ్ 'ముస్లిములు వస్తే మాకే అభ్యంతరం లేదని' చెబుతుంటే, భాజపా అధికార ప్రతినిధి రితిష్ తివారి మాత్రం 'కొంచెం జాగ్రత్త అవసరం' అని అంటున్నారు. 
 
ఏ పార్టీకైనా సభ్యత్వం సాధారణంగా పెరిగితే ఇబ్బందేమీ లేదు. కానీ, ఈ విధంగా ఒకేసారి వేలాదిమంది మూకుమ్మడిగా పార్టీలో చేరడం అంత ఆరోగ్యకరమైన పరిణామం కాజాలరు. ఇది పార్టీని బలహీనపరిచే ప్రమాదం ఉంది. 

- ధర్మపాలుడు