మార్పు అవసరమంటారా ?

ఎన్నికల వేళ - 2014 - భాగం 5
భారతదేశంలో జాతీయ పార్టీలకు సరైన, దిశ, దశ, మార్గనిర్దేశనం చేయలేని వంశపారంపర్య నాయకత్వాలు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువైంది. వాటి మద్దతు లేనిదే ఏ జాతీయపార్టీ మనుగడ సాగించే స్థితి లేకపోవడానికి ప్రధాన కారణం ఒక విధంగా ఓటర్లలో జాతీయ దృక్పథంపై సరైన అవగాహన లేకపోవడం. ఇటువంటి బలహీనతను ఆసరాగా చేసుకుని జాతీయ అవసరాలను, అవకాశాలను అనుసరించి వివిధ రాష్ట్రాలలో ఎన్నో కొత్త ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్ని మఖలో పుట్టి పుబ్బలో రూపుమాసి పోయాయి. 
మరికొన్ని పార్టీలు తమ ప్రాబల్యాన్ని క్రమేపీ పెంచుకుని జాతీయ పార్టీలను, దేశంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలను తొలుబొమ్మల్లా ఆడించడం ప్రారంభించాయి. అప్పటి నుంచి దేశంలో 'సుస్థిర' పాలనను అందించలేని దౌర్భాగ్య స్థితిలో జాతీయపార్టీలు 'అధికారం' నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ సంకీర్ణ భాగస్వామ్య పక్షాల అడుగులకు మడుగులొత్తుతూ ఎన్నో 'తాయిలాలు' ఇస్తూ పడుతూ లేస్తూ అధికారంలో కొనసాగుతున్నాయి.  
అధికారంలో ఉన్న పార్టీ 'అవినీతి' బురదలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గాంధేయవాది అయిన 'అన్నాహజారే' అవినీతికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం చేపట్టి ఎలక్ట్రానిక్ ప్రచారం ద్వారా యువతలో చైతన్యాన్ని జాగృతిని తీసుకువచ్చారు. ఈ ప్రచార ఉద్యమంలో కీలకభూమిక వహించిన కొంతమంది నేతలు తమ ప్రాధాన్యత పెంచుకోవడానికి 'ఆమ్-ఆద్మీ' పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. కాని అతి స్వల్ప కాలంలోనే రోడ్డున పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ఎన్నికల సమరంలో ఓటర్లు ఏం చేయాలి? 
దేశంలో సమాచార విప్లవం రావడం ఒక విధంగా పట్టణ, నగరాలతోపాటు గ్రామీణులకు వరంగా చెప్పుకోవచ్చు. పూర్వం పల్లె ప్రాంతాలలో ఏ సమాచారం తెలుసుకోవాలన్నా, సామాజిక రేడియోలు, ఎప్పుడో ఆలస్యంగా వచ్చే దినపత్రికలపై ఆధారపడాల్సి వచ్చేది. ఆధునిక భారతం దీన్నించి బయటపడింది. ఇంటింటా టివిలు, ఇంటర్నెట్ సౌకర్యాలు అభివృద్ధి చెందడంతో ఎప్పటి సమాచారం అప్పుడు తెలిసిపోతోంది. కనుక ఓటర్లు స్వయంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని బాగోతాలు జరిగాయో, ఏయే నాయకులు ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు, కుంభకోణాలకు పాల్పడుతున్నారో గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఏ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందో తెలుసుకుంటూనే ఉన్నారు. దీన్నంతటినీ దృష్టిలో ఉంచుకుని జాతి ప్రయోజనాలను తీర్చగల జాతీయపార్టీ అభ్యర్థులను, అవినీతి, అసమర్థులను కాకుండా ఆశలు నెరవేర్చే వారిని తమ ఓటుహక్కు ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం గల గ్రామీణ ప్రాంతాలలో వారి కబుర్లు, కల్లబొల్లి వాగ్దానాలు నమ్మి ప్రలోభాలకు లోను కాకూడదు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఈ పార్లమెంటు అభ్యర్థులు ఇటీవల పార్లమెంటులో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ఉందన్న విషయం మరువకూడదు.  
అందువల్ల జాతీయపార్టీ నిబద్ధత, నిజాయితీ, ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో చేస్తున్న అభివృద్ధిని విశ్లేషించి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఇక్కడ పార్టీలకతీతంగా కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. రాష్ట్రంలో లేదా కేంద్రంలో సరైన నిబద్ధత గల ప్రభుత్వం ఏర్పడకపోతే అయిదేళ్లపాటు వారి అవినీతి పాలనవల్ల ప్రజలు అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. 
దేశంలో గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో భూ కుంభకోణాలు, ప్రాజెక్టుల నిర్మాణంలో కాంట్రాక్టర్ల అవినీతి, నత్తనడక నిర్మాణాలు, బొగ్గు కుంభకోణాలు, చిట్టచివరికి రక్షణ రంగ కొనుగోళ్లలో అక్రమాలు - ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, మరెన్నో అవినీతి పర్వాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ప్రభావం తప్పనిసరిగా ప్రతి వ్యక్తిపై పడుతోంది. ప్రభుత్వాలు చేసే అప్పుల భారం ప్రజలూ మోయాల్సి ఉంటుంది. ఇక దేశ విదేశాలలో మన దేశ పరుపు ప్రతిష్ఠలను దిగజార్చే రీతిలో రాజకీయ నాయకులు వ్యవహరించిన సంఘటనలు కోకొల్లలు. దేశ ప్రగతి మాట అటుంచి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూములకు రక్షణ కరవై దౌర్జన్యాలు, దోపిడీలు, ఆక్రమణలు, ఎక్కువయ్యాయి. రైతులు కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతులలో మోసపోయే పరిస్థితులున్నాయి. విద్యార్థులకు సరైన విద్యా సౌకర్యాలు లేవు. నిరుద్యోగం పెరిగిపోతున్నది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో ఈ పరిస్థితులు మారాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం మారాలి. అందుకు ప్రతి ఓటరు చేతిలో ఉన్న పదునైన ఆయుధం ఓటు. ఓటు హక్కు వినియోగించుకోమని చెపుతూ ఎన్నికల సంఘం ఎంతో సమర్థతతో పని చేస్తోంది. ఇటీవల కాలంలో ఓటుహక్కు వినియోగించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. 
- మారేమండ
- వచ్చే సంచికలో మరిన్ని విశేషాలు