జాతీయవాదానికి ప్రాణప్రతిష్ఠ చేసిన డా.హెడ్గేవార్

మార్చి 31, 2014 ఉగాది పండుగ. ఆ రోజే పరమ పూజనీయ డాక్టర్జీ జన్మదినం. ఆ సందర్భంగా ప్రత్యేక వ్యాసం 
మనం పరమాత్మను పూజించేముందు కేశవాయస్వాహా అంటూ నీరు సేవిస్తాం. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ (డాక్టర్జీ) దేశ కార్యంలో 'రాష్ట్రాయ స్వాహా' అంటూ తనకు తాను సమర్పించుకున్న మహోన్నత వ్యక్తి. నేడు దేశవ్యాప్తంగా దేశభక్తిని కలిగించే కార్యక్రమాలతో నడుస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ను డా.హెడ్గేవార్ 1925 వ సంవత్సరం విజయదశమి నాడు ప్రారంభించారు.
డా.కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ 1889వ సంవత్సరం ఉగాది నాడు జన్మించారు. అందరిచేత కేశవరావు అని పిలవబడేవాడు. ప్రకృతిలో వసంతంతో బాటు జాతి ప్రవృత్తిలో వసంతం పూయించాలన్న తలపుతో ఉగాదినాడు కేశవరావు జన్మించారు. 
కేశవరావు జన్మత:  దేశభక్తుడు. శివాజీ కథ అంటే ఆయనకిష్టం. విక్టోరియా రాణి జన్మదిన వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో పంచిన మిఠాయిని చెత్తకుండీలోకి విసిరికొడతాడు. వందేమాతరం పాడి పాఠశాల నుంచి బహిష్కృతుడవుతాడు. పాఠశాలలో చదువుతున్న రోజులలోనే నాగపూర్ లోని సీతాబర్డీ కోటపై ఎగురుతున్న యూనియన్ జాక్ జెండా తీసివేసేందుకు తోటిపిల్లలతో కలసి వాళ్ల మాస్టారుగారి ఇంటిలో సొరంగం త్రవ్వేందుకు సాహసం చేస్తాడు. 18 సంవత్సరాల వయసులో విజయదశమి సీమోల్లంఘన కార్యక్రమాన్ని బ్రిటిషు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కార్యక్రమంగా మార్చుకుంటాడు.  
కేవశరావు 13వ ఏటనే నాగపూర్ లో వ్యాపించిన ప్లేగువ్యాధికి తల్లిదండ్రులిద్దరూ మరణించారు. బెంగాల్ లో నేషనల్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన డా.కేశవరావు హెడ్గేవార్, ఆ సమయంలో బెంగాలీ భాష నేర్చుకున్నారు. విప్లవకారులతో కలసి పనిచేశారు. కలకత్తాలో కలరా వచ్చినప్పుడు, దామోదర్ నదికి వరదలు వచ్చినప్పుడు, సేవాభావంతో సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు కేశవరావు. ఆయన తిలక్ ను అభిమానించేవారు. తిలక్ నడిపిన కేసరి పత్రిక చదివేవారు. తిలక్ స్ఫూర్తితో గణేశ్, శివాజీ జయంత్యుత్సవాలు చేసేవారు. మెడిసిన్ చదివి నాగపూర్ వచ్చిన తరువాత ఆయన అనేక స్వచ్ఛంద సంస్థలలో పనిచేశారు. ఆ సమయంలో కేశవరావు అందరిచే ఆత్మీయతతో 'డాక్టర్జీ' అని పిలవబడుతుండేవారు. డాక్టర్జీ కాంగ్రెసు పార్టీలో నిజాయితీగా పనిచేశారు. జైలుకెళ్లారు. 1985లో జరిగిన కాంగ్రెస్ శతజయంతి ఉత్సవ స్మరణికలో డాక్టర్జీ గురించి వ్రాయబడింది.  
సుమారు 15 సంవత్సరాల క్రియాశీల ఉద్యమ జీవితం నుంచి తిలక్, సావర్కర్, నేతాజీ ఇంకా అనేకమంది నాయకులతో వారికున్న సాన్నిహిత్య అనుభవం నుంచి 1925లో డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు. సంఘం ప్రారంభమైన తరువాత అదే ఆయన జీవన కార్యమైంది. బర్మాలో వచ్చిన మంచి ఉద్యోగాన్ని కాదని, భారతమాత సేవకే తమ జీవితాన్ని అర్పించారు. 'నేను డాక్టర్ హెడ్గేవార్ ను చెబుతున్నాను - ఇది హిందూ రాష్ట్రం' అని చెపుతూ సంఘానికి పటిష్టమైన సైద్ధాంతిక పునాదిని వేసి శాఖా కార్యపద్ధతిని ఏర్పరచారు. సంఘం దేశవ్యాప్తంగా విస్తరించేదాకా ఆయన రక్తాన్ని చెమటగా మార్చి పని చేశారు.  
పేదరికం ఆయన్ను వెక్కిరించింది. కాని విశ్వాసంతో ఆయన ముందుకెళ్లారు. 'దేశవాసులం, మాతృప్రేమ దాసులం, మహితలోన మహేశ్వరుని కార్యకర్తలం' అంటూ నినదించే కార్యకర్తల గణాన్ని దేశమంతా నిర్మాణం చేశారు. ఓ అఖిల భారతీయ సంస్థగా సంఘాన్ని తీర్చిదిద్దారు. 1940 వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సంఘశాఖలు ప్రారంభమయ్యాయి.  
డాక్టర్జీ ప్రారంభించిన శాఖా కార్యపద్ధతి ప్రపంచంలోనే ఓ వినూత్నమైన పద్ధతి. దేశభక్తులను తయారుచేసే బడి అది. అలా తయారయిన కార్యకర్తలు దేశంలోని అన్ని రంగాలలో ప్రవేశించి దేశభక్తి ప్రేరిపితులై పనిచేస్తున్నారు.  

నేడు 4 లక్షల గ్రామాలకు సంఘ సందేశం చేరింది. 50,000 కు పైగా గ్రామాల్లో సంఘశాఖలు జరుగుతున్నాయి. సుమారు 300 పరివార సంస్థలు పని చేస్తున్నాయి. లక్షా ఏభైవేల సేవా కార్యక్రమాలను స్వయంసేవకులు నిర్వహిస్తున్నారు. రాజకీయ రంగంలోనూ వాజపాయ్, అద్వానీ లాంటివారు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడపగలిగారు. నేడు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి కూడా సంఘశాఖలో శిక్షణ పొందినవాడే.  
నాటి ప్రధానమంత్రి శ్రీ వాజ్ పాయ్ తో నేటి ప్రధానమంత్రి అభ్యర్ధి శ్రీ నరేంద్ర మోడి
అందరం హిందువులం, బంధువులం అంటూ సమైక్య భారతావని నిర్మాణానికి, ఇది హిందూజాతి అని, హిందుత్వమే మన జాతి జీవన విధానమని చాటుతూ స్వయంసేవకులు నడుస్తున్నారు. వారిననుసరించడమే జాతి క్షేమం కోరే వారందరి కర్తవ్యం. ఇదే మహనీయుడైన మన డాక్టర్జీకి మనం ఇచ్చే ఘన నివాళి. 
- హనుమత్ ప్రసాద్