రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామమేనట...!?

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయనామ సంవత్సరం,కార్తీక మాసం

కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం అప్పుడే మొదలుపెట్టారు. ఆర్థిక కుంభకోణంలో కూరుకుపోయిన కేంద్రప్రభుత్వం ప్రజల మధ్యలోకి వెళ్లి మాట్లాడేందుకు భయపడుతున్నది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో తాము చేసిన అభివృద్ధి అంతగా ఏమీ లేదు. అందుకే డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు.

మైనార్టీ ఓట్లపై పూర్తిగా కన్నువేసి మరీ మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికలు హిందుత్వ విలువలను కాపాడేందుకు పని చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి మాకు మధ్య ప్రధాన పోటీ అని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ ముజఫర్ పూర్ లో జరిగిన గొడవల కారణంగా మైనార్టీలు చాలా నష్టపోయారని, మైనార్టీ యువకులను ఐ.ఎస్.ఐ. ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నదని, ఇదంతా హిందూ మతతత్వం కారణంగా జరుగుతోందని చెప్పాలనుకొని ఇంకేదో మాట్లాడేసరికి వివాదాస్పదమయ్యారు. ఇంకా ఆ పార్టీ అఖిల భారత కార్యదర్శి అయితే మత కలహాలకు భారత్ లో బిజెపి, పాకిస్తాన్ లోని ఐ.ఎస్.ఐ. కారణమని మాట్లాడేస్తున్నాడు. కేంద్రమంత్రి జైరామ్ రమేశ్ రాబోయే పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, ఆర్.ఎస్.ఎస్.ల మధ్యేనని, బిజెపి అనేది దానికి ఒక ముసుగు మాత్రమేనని చెప్పుకొచ్చాడు. కేంద్ర ఆర్ధికమంత్రికైతే మహాభారత సంగ్రామమే గుర్తుకు వచ్చింది. 'రాబోయే ఎన్నికలు కాంగ్రెస్-హిందుత్వ వాదుల మధ్యనే' అని చెప్పేశారు. హిందువులంటే మతతత్వవాదులని ఆయన భావం. అసలు ఈ మాట్లాడిన వాళ్లంతా ఎవరో వారినే ముందుగా అడగవలసి ఉంది. హిందుత్వ శక్తులను అణిచివేయాలని 1948 స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండే కంకణం కట్టుకుని మరీ పనిచేస్తున్నది కాంగ్రెస్. దేశంలోని మైనార్టీ ఓట్లతో ఎప్పుడూ తమ అధికారాన్ని పదిలపరచుకొనేందుకు ఎత్తులు వేస్తూ ఉంటుంది. ఈసారికూడా అదే ఎత్తుగడలో నేరుగా ఆర్.ఎస్.ఎస్. పేరు ప్రస్తావన చేస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్. అంటే ముస్లింలకు వ్యతిరేకమని, ముస్లింలకు కాంగ్రెసే రక్ష అని చెప్పుకోవటానికి ఈ తిప్పలన్నీ. మతహింస నిరోధక బిల్లును రాబోయే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశ పెట్టాలని, ఆ బిల్లును బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు. ఆ బిల్లు తేవటం ద్వారా ముస్లింలకు మేమే రక్షకులమని చెప్పదలచుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ నాయకులంతా దేశం మొత్తంమీద ఆర్.ఎస్.ఎస్.పై బాణాలు సంధించే విషయంలో ఒకేరకంగా మాట్లాడుతున్నారు.