ప్రతి భారతీయుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి

ఎన్నికల వేళ - 2014 - భాగం 1


ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన ఆయుధం ఓటు. కానీ భారతదేశంలోని రాజకీయ పార్టీలు దేశంలో వందశాతం (100%) ఓటరు నమోదుపై కాని, వందశాతం ఓటుహక్కు వినియోగంపై కాని దృష్టి సారించి ప్రజలను చైతన్యపరచటం లేదు. అభివృద్ధి చెందిన దేశాల వలె ప్రజలు వందశాతం విద్యావంతులై ఓటుహక్కు వినియోగంలో చైతన్యవంతులైతే ఈ ప్రభుత్వాల ఆటలు సాగవు. అందువలన భారతదేశంలో రాజకీయ పక్షాలు ఓటరును చైతన్యపరచటం కంటే ఓటుబ్యాంకులను చైతన్యపరచటానికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నాయి. ఉదాహరణకు మతాలవారిగా ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకులు, కులాలవారిగా యాదవులు, దళితులు వంటి ఓటుబ్యాంకుల సమూహాన్ని చైతన్యపరచడం, వారితో వారి నాయకులతో సంప్రదింపులు జరపడం, ఎన్నికల ముందు తాత్కాలిక ప్రయోజనాలను చూపిస్తూ వారిని తమవైపు తిప్పుకోవడం అనేది అన్ని రాజకీయ పక్షాలకు సర్వసాధారణమైపోయింది. ఎన్నికల ముందు మతాలవారిగా, కులాల వారిగా ఓటుబ్యాంకులను తాత్కాలిక అంశాలపై ఉద్రేకపరచి ఓట్లను పొందటం జరుగుతున్నది.


రాజ్యాంగ నిబంధనల మేరకు రాజకీయ పక్షాలు కానీ, రాజకీయ నాయకులు కాని కుల, మత, వర్గ, లింగ భేదములను చూపి ఓటును వేయమని అడగరాదు. అంతేకాకుండా ఆయా వర్గాలను ఆ కారణాలతో ప్రభావితం చేయరాదు. కాని ప్రస్తుత ఎన్నికలలో పైన తెలిపిన నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక మతం వారిని (మతం పేరిట గాక మైనారిటీ రక్షణ పేరుతో) బుజ్జగించడం వంటి సంతుష్టీకరణ విధానాలకు పాల్పడుతూ, ప్రత్యేకంగా వారి కోసమే ప్రభుత్వ పథకాలను రూపొందిస్తూ వారి ఓటు బ్యాంకును సంపాదించుటకు అధికారంలోని ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి.

5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధారణ ఎన్నికల సంవత్సరంలో ఎన్నికల ముందు కనీసం 6 నెలల నుండైనా వందశాతం ఓటు నమోదు కొరకు, వందశాతం ఓటుహక్కు వినియోగం కొరకు ప్రజలను చైతన్యపరచవలసిన రాజకీయ పార్టీలు వారి బాధ్యతలను విస్మరించి మతాల, కులాల సమీకరణలకు, ఎన్నికల ముందు - ఎన్నికల తరువాత జత కట్టవలసిన రాజకీయ పక్షాల సమీకరణలకే ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఈ విషయంలో ప్రతికారంగం, ఎలక్ట్రానిక్ దృశ్యమాధ్యమాల వారు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన వారందూ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకొనేందుకు, ఓటుహక్కును వినియోగించుకొనేందుకు ప్రజలను చైతన్యపరచడం తమ బాధ్యతగా భావించాలి. ఈ బాధ్యతను మనందరం సక్రమంగా నిర్వహించాలి. 

(గమనిక : ఓటు నమోదు కొరకు ఆఖరు తేది : నవంబర్ 30)

- పతికి