రాజ్యాధికారమే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు

డా.మోహన్ రావ్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘము 1925వ సంవత్సరం విజయదశమి పండుగ రోజున ప్రారంభమైంది. ఈ విజయదశమికి 89 సంవత్సరాలు పూర్తి చేసుకొని 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు శ్రీ మోహన్ జీ భాగవత్ నాగపూరులో జరిగిన సంఘ కార్యక్రమంలో ప్రసంగించారు. తన ప్రసంగంలో దేశంలోని పరిస్థితులను, ప్రపంచంలో భారత్ యొక్క స్థితిని వివరించారు. వారి ప్రసంగంలో ప్రముఖ అంశాలు లోకహితం పాఠకులకు అందిస్తున్నాము.

ప్రసంగ పాఠం :

"ఈ సంవత్సరంలో ఈమధ్యకాలంలో మన శాస్త్రవేత్తలు విశేషకృషి చేసి అంతరిక్షంలో అంగారకగ్రహ కక్ష్యలో మంగళయాన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. దేశ గౌరవ ప్రతిష్ఠలను పెంచిన శాస్త్రవేత్తలందరికి హృదయపూర్వక అభినందనలు. ఆసియాడ్ క్రీడలలో పథకాలు సాధించిన క్రీడాకారులందరికి అభినందనలు.

రాజరాజనరేంద్రచోళ చక్రవర్తి అద్భుత విజయం సాధించి వెయ్యి సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభసమయం ఇది. ప్రపంచంలో ఉన్న సామ్యవాద, పెట్టుబడిదారి ఆర్థిక సిద్ధాంతాలకు కాలం చెల్లుతున్నవేళ ప్రత్యామ్నాయ ఆర్థిక సిద్ధాంతం కోసం ప్రపంచం ఈ రోజున ఎదురుచూస్తున్నది. మనదేశంలో కూడా ప్రత్యామ్నాయ ఆలోచనలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవదర్శన్ పై అందరిదృష్టి మళ్ళుతున్నది. ఆ ఏకాత్మ మానవదర్శన్ ప్రవచించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న వేళ ఇది. ఏకాత్మ మానవదర్శన్ పై ఈ రోజు అనేక చర్చలు జరుగుతున్నాయి.

ఈ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఈ దేశంలోని సామాన్యపౌరులు తమ ప్రజాస్వామ్యబద్ధమైన బాధ్యతలను గుర్తించి పరిణతితో వ్యవహరించి పూర్తి ఆధిక్యత ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకొన్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. అభివృద్ధి చెందిన దేశాలలోని విద్యావంతులు వ్యవహరించే తీరులో ఈ దేశ సామాన్యపౌరులు వ్యవహరించి అభివృద్ధికి పట్టంగట్టడం ప్రపంచంలో భారతీయుల గౌరవాన్ని ఇనుమడింపచేసింది. విదేశాలలో ఉన్న భారతీయులలోను తమ మాతృభూమి యెడల శ్రద్ధా విశ్వాసాలు నిర్మాణం చేసింది. దేశప్రజలలో నిర్మాణమైన ఉత్సాహం, ధైర్యం, ఆత్మవిశ్వాసం చూస్తుంటే భారతదేశం వైభవసంపన్న దేశం కావటానికి ఈ పరిణామము ఒక శుభసంకేతంగా భావించాలి.

నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ పరిస్థితులు నిర్మాణమై ఉన్నాయి. ప్రపంచం ఈ రోజున దిశాదర్శనం కోసం ఎదురుచూస్తున్నది. ఈ రోజున ప్రపంచం అనేక సిద్ధాంత రాద్ధాంతాలతో సతమతమవుతున్నది. ఈ సమయంలో మధ్యేమార్గంలో ఆలోచించి అందరిని కలుపుకొని పోగల ఆలోచనల కోసం ప్రపంచం ఎదురుచూస్తున్నది. వివిధతలోనే ఏకత ఉన్నది అనే సత్యాన్ని గుర్తించిన భారతదేశం ఈ రోజున ప్రపంచానికి ఒక సమన్వయ మార్గం సూచించాలి. ఈ సృష్టిలో వైవిధ్యం ఉంది, ఉంటుంది. దానికి అంగీకరించి దాని యెడల ప్రేమ పూర్వకమైన గౌరవభావం కలిగి ఉండాలి. సమన్వయభావంతో ప్రకృతికి అనుకూలంగా మన వ్యవహారం ఉండాలి. అందరితో మన అభిప్రాయాలు పంచుకోవాలి.


ఈ దేశంలో కూడా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక మత విశ్వాసాలు కూడా ఉన్నాయి. వాటన్నింటి మధ్య మనం మౌఢ్యంగా వ్యవహరించకుండా అహింసాయుత మార్గంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ మధ్యేమార్గంలో మనం ప్రయాణం చేయాలి. తద్వారా ప్రపంచంలోని ప్రజలందరూ మానవతా విలువలతో, సుఖశాంతులతో సుఖమైన సుందరమైన జీవనం గడపటానికి కావలసిన మార్గం మనకు బోధపడుతుంది. ఈ సత్యాన్ని గుర్తించిన మన జాతి పరంపరరాగతంగా ఏ వాణిని ప్రపంచానికి వినిపిస్తూ వస్తున్నదో ఇప్పడు కూడా అదే వాణిని అవసరం మేరకు ప్రపంచానికి మనం వినిపించాలి. ఈ విషయం చెప్పటం చాలా సులభం. కాని వ్యవహారంలోకి రావటం అంత సులభం కాదు. వ్యవహారంలో, మాట్లాడటంలో, పరస్పరం చర్చించుకోవటంలో, హితకరంగా చెప్పటంలో ఉన్న తత్వజ్ఞానం వెనుక సుసంఘటితమైన శక్తి ఉండాలి. ఆదర్శవంతమైన ఆచరణ ఉండాలి. ఆ శక్తిని ఈ రోజున నిర్మాణం చేయడం అవసరం.

మానవజాతి సుఖసంతోషాల కోసం గడిచిన రెండువేల సంవత్సరాలలో ప్రపంచంలోను, భారతదేశంలోను అనేక శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. ఆధునిక సౌకర్యాలు ఎన్ని ఏర్పడ్డా కూడా మానవజాతి సుఖంగా, సంతోషంగా లేదు. మానవజాతిలో అనేక సమస్యలు నిర్మాణమవుతూనే ఉన్నవి. దానికి మూల కారణాలు ఆలోచించాలి. ప్రపంచంలో నిర్మాణమవుతున్న సమస్యలలో పర్యావరణ పరిరక్షణ ఒక పెద్ద సమస్య. గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి చర్చిస్తూనే ఉన్నారు. అయినప్పటికి పర్యావరణ పరిరక్షణ అనేది ఆచరణలో అంతగా కనబడకపోగా పర్యావరణాన్ని ధ్వంసం చేసే పనులు మాత్రం వేగంగా జరిగిపోతున్నాయి. దానిపై పునర్విచారణ చేస్తూనే ఉన్నారు, క్రొత్తక్రొత్త నినాదాలు ఇస్తూనే ఉన్నారు. మాటల్లో శబ్దప్రయోగాలలో పర్యావరణ పరిరక్షణ అనే నినాదం వినిపిస్తున్నారు. కాని వ్యవహారంలో రావలసిన మార్పు అంతగా రావటం లేదు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హింసాప్రవృత్తి, తీవ్రవాదం 
 

పాశ్చాత్య దేశాల స్వార్థం కారణంగా పశ్చిమ ఆసియా దేశాలలో మతమౌఢ్యం బాగా పెరిగిపోతున్నది. దాని క్రొత్త అవతారం ఐ.ఎస్.ఐ.ఎస్. రూపంలో ఈ రోజున మనకు కనబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు పెరగటానికది ప్రేరణగా ఉంది. ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనేక దేశాలు వివిధ మత సంస్థలు కలిసి చర్చించి పోరాటం చేయటానికి సిద్ధపడుతున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పటికీ ఉగ్రవాదమూలాలు మాత్రం ఛేదించలేకపోతున్నారు. ఏదో తమ ప్రయోజనాల కోసం స్వార్థంతో భోగలాలసతతో పనులు చేస్తూ ఉంటే దానికి ప్రతిక్రియ తప్పకుండా ఉంటుంది. ఇట్లా క్రియ ప్రతిక్రియల వలయంలో చిక్కుకొంటున్నారు. మౌలిక ఆలోచనలలో రావలసిన మార్పులు రావటం లేదు. మౌలిక ఆలోచనలలో మార్పు రాకుండా ప్రపంచంలో ఉగ్రవాదం, తీవ్రవాదం మూలాలాను ఛేధించలేము. మౌలిక ఆలోచనలలో మార్పు తీసుకొని రావాలని అనుకొనేవారు వారి మనస్సుల లోతులలో ఉన్న స్వార్థం, భయం, భోగలాలసత, మతమౌఢ్య విధానాల నుండి సంపూర్ణంగా బయటపడాలి. అప్పుడే ఒక సమగ్రమైన దృష్టికోణంలో, ఏకాత్మతాభావంతో అందరి సుఖం గురించి ఆలోచించగలుగుతారు.

వైశ్వీకరణ పేరుతో పరస్పర శాంతి గురించి మాట్లాడుతూనే తమ ఆర్థిక స్వార్థాలు పూరింపచేసుకొంటూ తమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకొంటున్నారు. నిశస్త్రీకరణ పేరుతో కొన్ని దేశాలు మిగతా దేశాలను బలహీనంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాయి. దాని కారణంగా ప్రపంచంలో శాంతి సాదించబడటం లేదు.

మనం ప్రపంచానికి ఒక సకారాత్మకమైన సందేశం అందించాలి 
 
వేల సంవత్సరాల నుండి భారతదేశంలో ఒక గొప్ప సంస్కృతి విలసిల్లింది. ఒక జాతీయభావన పటిష్ఠంగా నిర్మాణమయ్యింది. దాన్నే 'హిందుత్వం' అని అంటున్నాం. ఒక పటిష్టమైన జాతిగా మనం ప్రపంచానికి ఒక సకారాత్మకమైన సందేశం అందించాలి. ఈ దేశంలో అనేక భాషలు, సాంప్రదాయాలు, కులాలు-ఉపకులాలు, ఆహార విహారాదులలో తేడాలు, భౌగోళికంగా వివిధతలు, రీతి, నీతి అన్నిటిలో వివిధత ఉన్నది. ఆ వివిధతను అంగీకరించి సన్మానపూర్వకంగా స్వీకరించి అందరిని కలుపుకొనిపోతే భారతదేశ కల్యాణం మాత్రమే కాదు, విశ్వకల్యాణం సాధించవచ్చు. సత్యాన్వేషణే మనదేశ జీవనధ్యేయంగా ఉంది. వివిధ మతవిశ్వాసాలు, శ్రద్ధల మధ్య వివాదాలు నిర్మాణం చేయకుండా, ఆరాధన పద్ధతులను ఖండించకుండా, ఒక మత గ్రంథం గురించి మాట్లాడకుండా అన్నింటిమధ్య మధ్యేమార్గంలో ఈ దేశం ప్రయాణం చేస్తున్నది. మతచర్చలు, శాస్త్రచర్చలు అనేకం జరుగుతున్నప్పటికి వ్యవహారంలో వ్యక్తుల యొక్క శ్రద్ధను, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను గౌరవిస్తూ సామరస్య భావంతో ఒక సమాజ రూపంలో వికసించటమే హిందూసంస్కృతి యొక్క విలక్షణత. ఆ విలక్షణతే హిందూ సంస్కృతి పరిచయము.

మనదేశంలో జన్మించిన అనేకమంది ఋషులు, మునులు, భిక్షువులు, శ్రవణులు, సంతులు, విద్వాంసులు మొదలైనవారు పురాతనకాలం నుండి 'వసుధైవ కుటుంబకం' భావన తీసుకొని మెక్సికో నుండి సైబీరియా వరకు తిరిగారు. అక్కడ వారు ఎటువంటి సామ్రాజ్యాలు నిర్మాణం చేయలేదు. ఆయా దేశాల సంస్కృతులను, జీవన విధానాలను, ఆయా జాతులను నాశనం చేయకుండా, వారి అస్తిత్వాలకు భంగం కలిగించకుండా మానవత్వ విలువలు అందరికీ పంచి విశ్వమానవ కల్యాణం సాధించారు. ఆయా దేశాలలోని ప్రజలను ఉన్నతులుగా, జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దారు. ఆ కాంలోనే కాదు, ఈ కాలంలో కూడా మనవాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలంలో సాధుసంతులు అదే భావాన్ని తీసుకొని ప్రపంచమంతా తిరుగుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచశాంతికి భారతదేశమే ఒక ఆశాకిరణమని పాశ్చాత్య మేధావులు, విశ్లేషకులు ఈ రోజున భావిస్తున్నారు. ఈ దేశంలో జన్మించిన ఋషులు మునులు ఒక జాతిగా మన అస్తిత్వం యొక్క ప్రయోజనాన్ని సనాతనకాలం నుండి
 

'' ఏతద్దేశ ప్రసూతస్య
సకాస అగ్రజన్మన:
స్వం స్వం చరిత్రం శిక్షేరన్
పృథివ్యా: సర్వమానవా: '' 
ఈ ప్రపంచంలోని మానవులందరికి మానవతా విలువలలో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యాన్నే సూచించారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో అందులో ముఖ్యంగా కాశ్మీర్ లో ఈమధ్య వచ్చిన భీభత్సకరమైన వరదలు కారణంగా ప్రాణనష్టం, ఆస్తుల నష్టం బాగా జరిగింది. ఈ వరదలలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మలకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఊహించని విపత్కర పరిస్థితులలో చిక్కుకొన్న కాశ్మీరీ ప్రజలను ఆదుకొనేందుకు, వారికి మనోధైర్యం కలిగించేందుకు కేంద్రప్రభుత్వం సత్వరం చేపట్టిన పునరావాస కార్యక్రమాలు ఎంతో ప్రశంసించదగిన చర్యలు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము, సేవాభారతి లాంటి సంస్థలకు చెందిన కార్యకర్తలు కూడా సహాయక చర్యలు చేపట్టి పనిచేస్తున్నారు. తాత్కాలిక సహాయక చర్యలే కాదు, పునరావాసమునకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు. సమాజంలో వ్యాపించి ఉన్న భేదభావాలను ప్రక్కనబెట్టి ఈ సంకట స్థితులలో అందరికి అన్నివిధాల సహాయం చేసారు. ఇది భారతీయ సమాజం యొక్క సంవేదనాశీలత, సమగ్రదృష్టికోణం. ఇది ఈ దేశం యొక్క సమగ్రతకు సంకేతం.
 

రాజ్యాధికారమే అన్ని పనులు చేయలేదు, ఒక జాతిగా శక్తివంతంగా ఉండి సమాజం గురించి ఆలోచించాలి. ఒకదేశం శక్తివంతం కావాలంటే ఆ దేశానికి ఆవశ్యకమైనవి 1) ప్రామాణికత, 2) సామాజిక సమరసత, 3) ఉద్యమశీలత, 4) ధ్యేయవాదం, 5) సంస్కారవంతమైన ప్రవర్తన, 6) సామూహికత. ఒకప్పుడు మన సమాజంలో ఈ గుణాలు ఉండేవి. అవి ఈ రోజున అంతగా కనబడటం లేదు. ఈ పరిస్థితులను ఉపయోగించుకొని కొన్ని దేశీయ, విదేశీయ శక్తులు తమ సంకుచిత స్వార్థప్రయోజనాలు సాధించుకోవటానికి సమాజంలో విభేధాలు సృష్టిస్తున్నాయి. ఘర్షణలు నిర్మాణం చేస్తున్నాయి. ఇటువంటి శక్తుల విషయంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దేశాభివృద్ధికి అందరం కలసి కృషిచేయాలి. అభివృద్ధి పనులలో ప్రజలందరిని భాగస్వాములను చేయాలి. దేశంలో ఇప్పుడు జరుగుతున్న వికాస పథకాలలో మంచి పథకాలను కొనసాగిస్తూ దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా క్రొత్తమార్గాలు వెతకాలి, క్రొత్త వ్యవస్థలు నిర్మాణం కావాలి. లోటుపాట్లను సరిచేసుకొంటూ సమగ్రదృష్టితో పనిచేయాలి. అవసరమైతే ఇప్పుడున్న పథకాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. వాటి విధివిధానాలు వికసింపచేయాలి. ఆ దిశలో ముందడుగు వేయాలి.

భారతదేశంలో జన్మించిన అనేకమంది మహాపురుషులు స్వామి వివేకానంద, యోగి అరవింద, స్వామి రామతీర్థ, రవీంద్రనాథ్ ఠాకూర్, లోకమాన్య తిలక్ మొదలుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వతంత్ర వీరసావర్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, గాంధీజీ, వినోబాభావే, సంఘ ద్వితీయ సరసంఘచాలకులు పరమపూజనీయ శ్రీ గురూజీ, రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ, దీనదయాళ్ జీ మొదలైనవారు వారి జీవిత అనుభవాలలో చెప్పిన విషయాలను, వారి ఆలోచనలను మనం అధ్యయనం చేయాలి. అందులో ముఖ్యంగా విద్యారంగం, సమాజంలో సంస్కారాలను అందించే వ్యవస్థ, ఆర్థికనీతి, సామాజిక నీతి, దేశరక్షణ విధివిధానాలు ఎట్లా ఉండాలనే విషయాలపై వివిధ సందర్భాలలో వాళ్లు చెప్పిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వాటిని ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మలచుకొని ఆలోచించాలి. మంచి వ్యవస్థలను నిర్మాణం చేయాలి. ఈ దేశంలో అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపటమే ఈ దేశం యొక్క సమగ్ర వికాస లక్ష్యం. అట్లాగే దేశప్రజలు దేశ సంపదలను వృద్ధి చేయటం కోసం పనిచేయాలి. దేశ రక్షణ విషయంలో కూడా జాగరూకతతో ఉంటూ ఆత్మనిర్భరతతో వ్యవహరించాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి. అది భారతీయ దృష్టికోణంతో సాగాలి. నిచ్చెన యొక్క చివరిమెట్టు భారతీయ దృష్టి కోణం కావాలి.

జనజీవనానికి సంబంధించిన అన్ని కోణాలను అవగాహన చేసుకొని సరియైన విశ్లేషణతో ముందుకు పోగలిగే వారే ప్రపంచంలో ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించగలరు. ప్రపంచానికి ఒక చక్కటి నాయకత్వం కూడా అందించగలుగుతారు. ఈ ప్రయత్నాలతోనే భారతదేశం 'తరతరాల నుండి విశ్వగురుత్వ స్థానంలో ఉండేది, తిరిగి ఆ స్థానం చేరుకోవటం కోసం మనం పనిచేయాలి. ఈ ప్రపంచంలో విశ్వకల్యాణం సాధించగలిగే ఆలోచనలు విధివిధానాలు భారత్ వద్ద మాత్రమే ఉన్నాయి. వాటిని ఈ రోజున ప్రపంచానికి అందించాలి. భారత రాజ్యాంగంలో మనం చెప్పుకొన్న మహత్వాకాంక్షలను సాధించేందుకు విధివిధానాలను నిర్ణయించుకొని మనం పనిచేయాలి. ఈ ఆశయ ఆకాంక్షలను సాధించేందుకు ఈ దేశ ప్రభుత్వం కూడా ముందుకు రావాలి.

ప్రజల భాగస్వామ్యం లేనదే అభివృద్ధి అసాధ్యం
 
ప్రపంచ దేశాల చరిత్రను పరిశీలిస్తే కేవలం రాజ్యాధికారం మాత్రమే అన్నిపనులు చేయలేదని, ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే ఏ దేశమూ అభివృద్ధి సాధించలేదని తెలుస్తున్నది. ప్రజల సహకారంతోనే సమాజంలో మార్పులు సాధ్యం. ఈ దేశంలో అనేకమంది వ్యక్తులు, సంస్థలు దేశంలో మార్పు కోసం పనిచేస్తున్నారు. ప్రజలకు విషయాలను బోధిస్తున్నారు. సమాజంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దేశంలో అంతర్గత పరిస్థితులు చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం దేశప్రగతి పైన కూడా కనబడుతున్నది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళలలో జిహాది తీవ్రవాద శక్తుల ప్రాబల్యం పెరుగుతున్నది. ఆ శక్తులను అణచివేసేందుకు కఠినమైన చర్యలు కనబడటం లేదు. దక్షిణ భారతదేశంలో సముద్రతీరం వెంబడి ఉండే మినరల్స్ తో కూడిన అరుదైన ఇసుక స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు దానిని కూడా అదుపు చేయలేకపోతున్నాయి. అస్సాం, బెంగాలు ప్రాంతాలలో జనాభా అసమతుల్యత పెరిగిపోతున్నది. దానికి కారణం మన జాతీయ సరిహద్దుల నుండి అక్రమ వలసదారులు విపరీతంగా పెరిగిపోవటం, అందులో ఒక వర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారు. అక్రమంగా వస్తున్న ఆ వర్గం వారిలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘవ్యతిరేకశక్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితులలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు చూసీ చూడనట్లుగా వ్యవహరించటం ఇంకా ఎక్కువ సమస్యాత్మకంగా ఉంది. దానితో అక్కడి హిందువులు సమస్యలలో చిక్కకొంటున్నారు. ఆ రాష్ట్రాలలో అంతర్గత భద్రత, జాతీయ భద్రత ప్రమాదంలో పడుతున్నది. ఈ పరిస్థితులను చక్కదిదే్దందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా ఆలోచించి పనిచేయవలసిన అవసరం ఉంది. జిహాదీ శక్తులను, నక్సల్స్ ను అదుపు చేయటమే కాదు, వారికి అండదండలందిస్తున్న శక్తులను కూడ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. జిహాది శక్తులు, నక్సల్స్ దేశ అంతర్గత భద్రతకు సవాలుగా ఉన్నారు. దేశ సరిహద్దుల వెంబడి రెండురకాల కార్యకలాపాలు సాగుతున్నాయి. 1) అక్రమ చొరబాట్లు, 2) దొంగతనాలు. వారికి సరిహద్దుల వెంబడి ఉండే ప్రజల సహకారం లేనిదే ఈ పనులు సాగవు. సరిహద్దు వెంబడి ఉండే ప్రజలు వాళ్లకు సహకరించటమే కాదు, వాళ్ళకు రేషన్ కార్డులు, ఇతరత్రా సహాయాలు కూడా చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలి. అట్టడుగు వర్గాల ప్రజలలో అభివృద్ధి లేని కారణంగా వారు రకరకాల శోషణకు గురవుతున్నారు. దాని కారణంగా వాళ్ళు నక్సల్స్ ప్రభావంలోకి వెళ్తున్నారు. అందుకే అక్కడ ప్రజల జీవన స్థితిగతులు మార్చే ప్రయత్నాలు వేగంగా జరగవలసి ఉంది. సరిహద్దుల వెంబడి ఉండే ప్రజలను చైతన్యవంతులుగా ఉంచేందుకు కూడా కార్యక్రమాలు తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది.

కుటుంబాలలో పిల్లలకు సంస్కారాన్నందించాలి
 
కుటుంబాలలో పిల్లలకు ఇచ్చే సంస్కారం, శిక్షణ వారి భావి జీవితాన్ని నిర్దేశిస్తుంది. మన కుటుంబాలలో పిల్లలకు మంచి సంస్కారాలు ఇచ్చే విషయంలో మన దేశంలో ఒకప్పుడు విశేష ధ్యాస ఉండేది. కాని పరిస్థితులు ఇప్పడు కొద్దిగా మారాయి. పిల్లలకు సరియైన శిక్షణ, సరియైన సంస్కారం ఇవ్వవలసిన అవసరం ఎంతో ఉన్నదని పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. మన కుటుంబాలలో బాలకులకు, కిషోర వయస్సు వారికి మంచి శిక్షణనిచ్చి చక్కటి సంస్కారాలు అందించాలి. తల్లిదండ్రులు పిల్లల ముందు మంచి ఉదాహరణలు ఉంచి సకారాత్మకమైన ఆలోచనలు వారికి అందించగలగాలి. యువకులు మత్తుమందులకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబాలలో ఆత్మీయ వాతావరణం ఉండాలి. గతంలో మనదేశంలో పిల్లలకు మంచి సంస్కారాలు అందించేవారు.
 

"మాతృవత్ పరదారేషు
పరద్రవ్యేషు లోష్ఠవత్
ఆత్మవత్ సర్వభూతేషు"
 

అంటే తన భార్య మినహా మిగిలిన మహిళలందరిని తల్లులుగా భావించాలి, ఇతరుల ధనం మట్టిబెడ్డలతో సమానం, అందరిలో ఒకే ఆత్మను దర్శించటం అనేది నేర్పేవారు. ఈ సంస్కారాలు అలవడని కారణంగా రకరకాల విష సంస్కృతులు పెరుగుతున్నాయి. నేరాల సంఖ్య పెరుగుతున్నది. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. యువతలో అనాచారాలు, విశృంఖలత పెరుగుతున్నది. వీటిని అదుపు చేసేందుకు కఠినమైన చట్టాలు అవసరం. ఇప్పుడున్న చట్టాలను, పున:సమీక్ష చేసి అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలి. ఇదంతా ఒక ప్రయత్నం. మరోప్రక్క సమాజంలో ఆదర్శవంతమైన వ్యక్తుల ఉదాహరణలను సమాజం ముందుంచాలి. అటువంటి సంస్కారవంతమైన వ్యక్తుల ఆవశ్యకత కూడా నేడు చాలా ఉంది.  

కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటం ఎంతో అవసరమైన విషయం. మనదేశంలో కుటుంబము సమాజం యొక్క సూక్ష్మ స్వరూపం. మనదేశంలోని కుటుంబ వ్యవస్థ మౌలికమైనది. వ్యక్తులకు సంస్కారాలు కుటుంబం నుండి ఎక్కువగా అందేవి. ఈ రోజున కూడా మన సమాజం ఇలా నిలబడి ఉందంటే దానిలో కుటుంబ వ్యవస్థ భాగస్వామ్యమే ఎక్కువ. కుటుంబాలలో సరియైన శిక్షణ ఇవ్వబడాలి. మానవతా విలువలు నేర్పాలి. మంచి చెడు విచక్షణ జ్ఞానం పెంపొందించాలి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని అధిగమించగల ధైర్యసాహసాలు, ఓర్పు నేర్పాలి. మన మన కుటుంబాలలో పరంపరాగతంగా వస్తున్న విలువలను రాబోవు తరాలకు సక్రమంగా అందించటం ఒక సామాజిక బాధ్యత. కుటుంబ పెద్దలు అది గుర్తించి అవసరమైనవి పిల్లలతో చర్చించాలి, వివరించాలి. కుటుంబాలు సక్రమంగా ఉంటే చాలా విషయాలలో జాగ్రత్తలు ఉంటాయి. కుటుంబాలు సరిగా ఉండేట్లు చూడటం ఈనాటి తక్షణ అవసరం.

శారీరిక ప్రదర్శనలు చేస్తున్న స్వయంసేవకులు

సామాజిక సమరసతను పెంపొందించాలి  

సమాజంలో బీదరికం, సామాజిక వివక్షతలు తొలగించేందుకు మనంతట మనమే ముందుకు రావాలి. ప్రభుత్వాలు పట్టించుకొనే వరకు వేచిఉండవలసిన అవసరం లేదు. మనదేశంలో ప్రజలలో పరోపకారం చేసే స్వభావం ఉంటుంది. మనదేశంలో అనేకమంది వ్యక్తుల, అనేక స్వచ్ఛంద  సంస్థలు విద్యారంగంలో, వైద్యరంగంలో, పర్యావరణ పరిరక్షణ జాగృతి కలిగించేందుకు పనిచేస్తున్నాయి. దేశంలో అనేకచోట్ల నీటి పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించటం, గోసంరక్షణ, గ్రామీణాభివృద్ధికి అనేకమందికి శిక్షణ ఇస్తున్నారు. ఇటువంటి పనులలో స్వయంసేవకులు కూడా పని చేస్తున్నారు. ఇంత పెద్ద సమాజంలో జరుగుతున్న పనులు అందరికి అందటం లేదు. అందుకే మనం చేయవలసింది చాలా ఉంది. మనం మన వ్యక్తిగతంగా మన అభిరుచి, స్వభావం, సమయం, క్షమతను అనుసరించి ఇప్పటికే జరుగుతున్న పనులలో, ప్రవేశించి పనిచేయవచ్చు లేక మనకు మనమే స్వతంత్రంగా ఏదైన చిన్నపనిని ప్రారంభించవచ్చు. ఇట్లా ఏదో రూపంలో మనం అందరం సమాజ సేవ ప్రారంభిస్తే దేశంలో శీఘ్రగతిన మంచిమార్పు వచ్చే అవకాశం ఉంది.

మనం అందరం భారతమాత సంతానం
 

సమాజంలో ఉన్న భేదభావాలను తొలగించేందుకు విశేషకృషి చేయటం ఈ రోజున అత్యవసరమైన పని. మన మనస్సుల లోతులలో ఉన్న భేదభావాలను ప్రభుత్వం చేసే శాసనాలు తొలగించలేవు. ఎటువంటి వ్యవస్థలు ఆ పనిని చేయలేవు. సమాజం యొక్క చొరవతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ పనిని నేరుగా మన నుండే, మన మనస్సుల నుండే ప్రారంభం చేయాలి. ఈ పని చేయాలంటే మన అలవాట్లలో, వ్యవహారంలో మార్పు రావాలి. మన కుటుంబాలలో తరాల నుండి వచ్చే ఇటువంటి ఆలోచనల నుండి పూర్తిగా బయటపడాలి. సమాజంలో కులపరమైన, భాషపరమైన, ప్రాంతపరమైన దురభిమానాలు, అభినివేశాలకు సంబంధించిన మన మనస్సుల లోతులలో ఉన్న చిన్నచిన్న అవశేషాలను కూడా పూర్తిగా తొలగించుకోవాలి. అటువంటి విషయాలపట్ల ఆసక్తిగాని, చర్చించటం గాని, మాట్లాడటం కాని, అటువంటి కార్యక్రమాలలో పాల్గొనటం కాని, మన నుండి జరుగరాదు. ఈ సమాజంలో ఉన్న ప్రతి హిందువు మన బంధువుగా భావించాలి. మనం అందరం ఆ భారతమాత సంతానం. అందరం సహోదరులం అనే భావం మన మనస్సుల లోతుల నుండి రావాలి. ఈ సమాజంలో ఉన్న అందరికి దేవాలయాలు, స్మశానాలు, మంచినీటి వ్యవస్థ సమానంగా ఉండాలి. అన్నిరకాల కార్యక్రమాలలో అందరం కలిసి పాల్గొనాలి. మన జాతీయ మహాపురుషుల జయంతులు, మన పండుగలు అందరం కలిసి నిర్వహించుకోవాలి. తరతరాలుగా మన సమాజంలో పాతుకుపోయిన కురీతుల నుండి బయటపడే సీమోల్లంఘన ఈ విజయదశమి పర్వదినాన మనం చెయ్యాలి.

ఘోష్ ప్రదర్శన చేస్తున్న స్వయంసేవకులు
 
మనదేశంలో మన మహాపురుషులకు కొదవ లేదు. దర్శనాలకు, శాస్త్రాలకు కొదవలేదు. జీవితం యొక్క శాశ్వత మూల్యాల ఆధారంగా మన వ్యక్తిగత, సామాజిక జీవనంలో రావలసిన మార్పుల గురించి అనేకమంది మహాపురుషులు ఆచరించి మనకు అందించారు. వాటిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనం ప్రవచించి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సమయంలోనే మనదేశ సౌభాగ్యం కారణంగా దేశకల్యాణం కోసం మన పూర్వజులు బోధించిన విషయాలను ప్రామాణికతతో ఆచరణలోకి తీసుకొనిరాగలిగే నాయకత్వం ఈ రోజున మనకు కనబడుతున్నది. జాగరూకత, సమగ్రత, వ్యక్తిగత, జాతీయ శీలాలు, అనుశాసనం మొదలైన గుణాలు కలిగిన సమాజం ఎప్పుడైనా సాహసంతో అద్భుత విజయాలు సాధిస్తుంది. సమాజంలో సంతులనం సాధిస్తుంది. అటువంటి మంచి జాతీయజీవనం ఉన్నచోట ఎటువంటి సవాళ్ళనైనా సులభంగా ఎదుర్కొనగలుగుతాము.

విజయదశమి పండుగ విజయాలకు చిహ్నమైన పండుగ. ఈ రోజున మనదేశం సాధించిన విజయం మనలో ఒక విశ్వాసాన్ని, ఆశను చిగురింపచేస్తున్నది. పాడ్యమి నుండి నవమి వరకు జాగృతమైన దేవతలు సామూహిక శక్తిని ఆరాధించి ఆ శక్తితో అసురులపై విజయం సాధించిన రోజు విజయదశమి. 1925వ సంవత్సరం నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘము దేవీశక్తి సంపన్నతతో సంఘటిత సమాజాన్ని నిర్మించటానికి పనిచేసుకొంటూ వస్తున్నది. అనేక సంవత్సరాల మన పని కారణంగా ఈ రోజున సమాజంలో మంచి మార్పు వచ్చింది. మన వ్యవహారాలలో ఆచరణలలో కూడా మార్పు వస్తున్నది. వ్యవస్థలలో పరివర్తనకు తగిన వాతావరణం నిర్మాణమవుతున్నది. ఈ రోజున దేశంలో, ప్రపంచంలో ఉన్న సంక్లిష్ట సమస్యలు ఎదుర్కొంటూ మన లక్ష్యం చేరుకోవటానికి వేగంగా పనిచేస్తున్నాము. ఇంకా చేయవలసినది చాలా ఉంది. మన జాతీయ తత్వమైన హిందుత్వ గౌరవమును మనస్సులలో జాగృతపరచుకొని దానికి అనుగుణంగా మంచి గుణాలు వికసింపచేసుకొని దేశం కోసం జీవిస్తూ సర్వస్వం సమర్పణ చేయగల వ్యక్తులను నిర్మాణం చేసే పనిని సంఘం అనేక సంవత్సరాలుగా చేసుకొంటూ వస్తున్నది. దీనిద్వారా మనం అందరం హిందువులం అనే శాశ్వత సత్యాన్ని గుర్తు చేస్తున్నది. ఇదే మన జాతి యొక్క గుర్తింపు. మన సంఘ శాఖను ప్రతిగ్రామంలోని, ప్రతి వీథిలోని, సందుగొదులలోని, ప్రతి బస్తీలోని ప్రతి ఇంటికి తీసుకొనివెళ్ళాలి. అదే ఈ జాతిని శక్తివంతం చేస్తుంది. సనాతనమైన మన హిందూరాష్ట్ర జాగృతి కోసం ఈ రోజున ప్రపంచం ఎదురుచూస్తున్నది.

ఒక కవి చెప్పినట్లుగా
ప్రపంచంలో ప్రతిదేశం పశుప్రవృత్తితో తొట్రుపాటు పడుతోంది.
సత్యాన్వేషణ భారతదేశానికి అప్పగించబడింది.
ఈ భూమిలో ప్రతి నిమ్నవర్గాల వారికి పూజ జరుగుతోంది, ప్రతి పతితుడిని ఉద్ధరిస్తున్నది.
ధన్యదేశము మనది, దన్యమైనది హిందుస్థాన్.
ఇటువంటి గొప్పజాతి పునర్నిర్మాణంలో మనం అందరం భాగస్వాములం కావాలని ఆహ్వానిస్తున్నాను. 


భారత్ మాతా కీ జయ్.. !!