మోడీ మతోన్మాదా ? ఎవడన్నాడు ?!


నరేంద్రమోడీ మతోన్మాది అనీ, ముస్లింలను విపరీతంగా ద్వేషిస్తాడని, నరహంతకుడని ఇంకా ఏవేవో కారు కూతలతో చాలా కాలంగా ఒక విషప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతోంది.

ఈ ప్రచారంలో పత్రికలూ, ప్రసార మాధ్యమాలు, రాజకీయ పార్టీలు పోటీలుపడి విషం వెళ్లగ్రక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రొత్తఢిల్లీ నుంచి ప్రచురింపబడుతున్న ప్రముఖ ఉర్దూ పత్రిక "నయీ దునియా" సంపాదకుడు, సమాజవాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయిన జనాబ్ షాహిద్ సిద్ధిఖీ అనే ప్రముఖ పాత్రికేయుడు శ్రీ నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశాడు.

 

ఈ ఇంటర్వ్యూ ఒక దుమారాన్ని రేపింది. ఈ విషయంలో షాహిద్ సిద్ధిఖీ ఇలా అంటున్నారు "నరేంద్రమోడీని ఇరుకున పెట్టి ఆయనకు చెడ్డపేరు తీసుకురావాలని, ముస్లింలలో మోడీ పట్ల ద్వేషం ఇంకా పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఇంటర్వ్యూ తలపెట్టాను. ఇప్పటివరకు ఎవ్వరూ అడగని ప్రశ్నలను సంధించి మోడీని ఉక్కిరిబిక్కిరి చేద్దామని వెళ్ళాను" అని చెప్పారు. కానీ ఆశ్చర్యం ! ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత సిద్ధిఖీ మోడీ అభిమానిగా మారిపోయారు. 

తరువాత సిద్ధిఖీ సమాజవాదీ పార్టీ నుంచి గెంటివేయబడ్డాడు. రాజకీయ నాయకులు చాలామంది పాత్రికేయులు కూడా షాహిద్ సిద్ధిఖీని తీవ్రంగా విమర్శించారు. వారికి సిద్ధిఖీ ఇలా సమాధానం ఇచ్చాడు "భారతదేశంలో ఇంతకుమునుపెన్నడూ 'మతకలహాలు' జరగలేదా? వాటికి ఎవరు బాధ్యులు? భాగల్ పూర్ (1989)లో జరిగిన కలహాలకు మోడీ బాధ్యుడా? ముంబై (1992)లో జరిగిన మారణహోమానికి మోడీ కారకుడా? నిన్నగాక మొన్న జరిగిన ముజాఫర్ నగర్ గొడవలకు కూడా మోడీ బాధ్యుడా? వీటిని ఎవ్వరూ ఎందుకు ప్రస్తావించరు?" అని గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తున్నాడు సిద్దిఖీ.

షాహిద్ సిద్ధిఖీ హేతుబద్ధమైన ఆలోచనల కారణంగా ఈయనను బహుజన సమాజ్ పార్టీ కూడా 2009లో పార్టీ నుంచి బహిష్కరించింది. "నేనే గనుక 2002లో జరిగిన మత ఘర్షణలకు కారణమైతే నన్ను ఉరి తీయండి" అని మోడి చేసిన వ్యాఖ్య కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసినదే! సూడో సెక్యులరిజం (బూటకపు సెక్యులరిజం) అనే మాట ఇప్పటివరకు జాతీయవాదులు మాత్రమే ఉపయోగించే శబ్దం. కాని ఇప్పడు క్రొత్తగా షాహిద్ సిద్ధిఖీ కూడా ఈ పద ప్రయోగం చేస్తూ భారతదేశంలో ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నారు. న్యూస్ లాండ్రీ (ఫ్రీలాన్స్ న్యూస్ మీడియా) కు చెందిన అభినందన్ అనే పాత్రికేయునితో మాట్లాడుతూ షాహిద్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

- ధర్మపాలుడు