అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్యమందిర నిర్మాణం

విశ్వహిందూపరిషత్ తీర్మానం

 
నేడు పుణ్యక్షేత్రం అయోధ్యలో ఉన్న భగవాన్ శ్రీరామచంద్రుని గుడి 1992లో ఒక బట్టతో నిర్మించినది. నేటికీ అదే కొనసాగుతున్నది. ఇది సాధుసంతులకే కాక అశేష హిందూ సమాజానికి విచార హేతువుగా ఉన్నదని విశ్వహిందూపరిషత్ కేంద్ర కార్యకారిణి మండలి భావిస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే అక్కడ ఒక భవ్యమైన మందిరంలో శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవాలని హిందూ సమాజం కోరుతోంది. ప్రయాగ మహాకుంభమేళాలో జరిగిన సాధుసంతుల సమ్మేళనంలో మార్గదర్శక మండలి అయోధ్య రామమందిరం గురించి అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నోబెంచ్ ఇచ్చిన ఏకగ్రీవ తీర్పును మరొకసారి సమాజానికి గుర్తు చేసింది. 
 
ఆ తీర్పులో ముగ్గురు న్యాయమూర్తులు వెల్లడించిన ఏకాభిప్రాయం ఇలా ఉంది : 
 
1.వివాదాస్పద స్థలమే శ్రీరామచంద్రుని జన్మస్థానం,  
 
2. వివాదాస్పద కట్టడం హిందూ ధార్మిక స్థలంలో కట్టారు.  
 
3. వివాదాస్పద కట్టడం ఇస్లాం మత సూత్రాలకు విరుద్ధంగా కట్టారు. అందుచేత అది మసీదుగా కాదు.  
 
4. ముస్లిములు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తులు కొట్టివేశారు. అందువల్ల 70 ఎకరాల భూమి భగవాన్ శ్రీరామచంద్రునికే చెందుతుంది. 
 
 
5. కేంద్రమార్గదర్శక మండలి నిర్ణయం ప్రకారం సాధుసంతులకు చెందిన ఒక ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి ఈ విషయమై విజ్ఞాపన పత్రం అందచేసింది. అందులో 14 సెప్టెంబర్, 1994న భారత ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రతిజ్ఞా పత్రం గురించి గుర్తు చేసింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రతిజ్ఞాపత్రంలో 'వివాదాస్పద స్థలంలో మందిరం / హిందూ ప్రార్థనా స్థలం ఉండేదని తేలితే భారత ప్రభుత్వం హిందువుల మనోభావాలకు తగినట్లుగా వ్యవహరిస్తుంది' అని పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు వచ్చింది. కాబట్టి 70 ఎకరాల భూమిని హిందూ సమాజానికి అప్పచెబుతూ వెంటనే చట్టం చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉన్నది. 
 
6. అయోధ్యలోని 84 క్రోసుల పరిక్రమ భూమి హిందూ సమాజానికి అత్యంత పవిత్ర క్షేత్రమని విశ్వహిందూ పరిషత్ కేంద్రకార్యకారిణి మండలి స్పష్టంగా ప్రకటిస్తోంది. హిందువులు పుణ్యక్షేత్రానికి మాత్రమే పరిక్రమ (ప్రదక్షిణ) చేస్తారు. అందువల్ల అలాంటి పుణ్యక్షేత్రంలో ఇస్లాంకు సంబంధించిన ఎలాంటి చిహ్నాన్ని, గుర్తును హిందూ సమాజం అంగీకరించదు. అక్కడ ఇస్లాంకు చెందిన ఏ కట్టడాన్నైనా విదేశీ ఆక్రమణదారుడైన బాబర్ కట్టించినదిగానే భావించబడుతుంది. దానివల్ల వివాదం ఎప్పటికీ సమసిపోదు. 
 
7. సుదీర్ఘమైన కోర్టు ప్రక్రియ వల్ల తీర్పు ఆలస్యం అవుతోందని విశ్వహిందూపరిషత్ కేంద్రకార్యకారిణి మండలి భావిస్తోంది. సాధ్యమైనంత త్వరగా శ్రీరామచంద్రుని అయోధ్యలో భవ్యమైన మందిరంలో దర్శించుకోవాలని హిందూ సమాజం కోరుకుంటోంది. అందుచేత గతంలో సోమనాథ మందిర నిర్మాణానికి వీలు కల్పించినట్లుగానే రామమందిర నిర్మాణానికి కూడా అన్ని చట్టపరమైన అడ్డంకులు తొలగిస్తూ కేంద్రప్రభుత్వం రాగల లోక్ సభ వర్షాకల సమావేశాలలో చట్టం చేయాలని, లేకపోతే ఈ విషయంలో హిందూ సమాజం తలపెట్టే అంతిమ ఉద్యమానికి బాధ్యత వహించవలసి ఉంటుందని విశ్వహిందూ పరిషత్ కేంద్ర కార్యకారిణి మండలి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.