మోదీ విలక్షణుడు

ఎన్నికలలో విజయం అనంతరం తల్లి ఆశీర్వాదం అందుకుంటున్న శ్రీ నరేంద్రమోది
 
2014 ఎన్నికలలో భాజపా విజయదుందుభి మ్రోగించింది. భారత 15వ ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్రమోదీ మే 26వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల గెలుపు వార్తలు వచ్చిన 2 గంటల్లో భారతావనిలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల ముందు జరిగిన అనేక ఇంటర్వ్యూలలో నొక్కి వక్కాణించిన విధంగా మోదీ గెలుపు బావుటా ఎగురవేశారు. 
 
పూర్తి విశ్వాసంతో ఇంకా పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తల్లి ఆశీర్వచనం తీసుకున్నారు. తల్లి తిలకం దిద్ది మిఠాయి తినిపించింది. 90 ఏళ్ల వృద్ధ మాత ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చింది. కుమారుణ్ణి ఆప్యాయంగా తలనిమిరి 'సాధించావు నాయనా!' అన్న ఆనందం ప్రకటించింది. విజయాన్ని అందుకున్న మోదీ వడోదర, అహమ్మదాబాద్ లలో జరిగిన విజయోత్సవ సభలలో మాట్లాడారు. 'అభివృద్ధిని ఓ ఉద్యమంగా సాగించాలన్నారు. 'రామ, కృష్ణులు చాణుక్యుని తరువాత అంతటి విజయం మోదీని వరించిందని' బాబా రామ్ దేవ్ వ్యాఖ్యానించారు. అనంతరం ఢిల్లీలో కార్యకర్తల విజయోత్సవ ర్యాలీ దారిపొడవునా తన వాహనంపై నిలబడి ఎండలో కార్యకర్తలను ఉత్సాహపరిచారు మోదీ. విజయ సంకేతం చూపుతూ బిజెపి కార్యాలయం చేరారు. 'దశాబ్దాలుగా మన పెద్దలు జరిపిన కృషి నేటి విజయానికి కారణం' అన్నారు. పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
మొదటిసారిగా పార్లమెంటు గడప త్రొక్కేముందు దాన్నొక దేవాలయంగా భావించి శిరసు వంచి నమస్కారం చేశారు. ఉద్వేగానికి లోనయ్యారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ తనను గుర్తించినందుకు కృతజ్ఞతగా కంటతడి పెట్టారు. 'భారతమాత తనకు ఎలా తల్లి వంటిదో, అలాగే బిజెపి కూడా తనకు తల్లి వంటిది' అన్నారు. 
 
 
ఎన్నికలలో విజయం అనంతరం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన ఎన్.డి.ఎ. సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీ నరేంద్రమోది
 
తరువాత జరిగిన ఎన్.డి.ఏ. సమావేశంలో నేతలంతా ఆయనపై విశ్వాసం ఉంచారు. వారందరికీ తనను ఎప్పుడైనా కలిసే హక్కు ఉందన్నారు. ప్రత్యేకంగా తమిళనాడుకు చెందిన విజయకాంత్ సతీమణిని అందరికీ పరిచయం చేసి ఆమె సేవల్ని కొనియాడారు. రాష్ట్రపతిని కలిసి ఆయన నుంచి ప్రధానమంత్రి నియామక పత్రం పొందారు. మంత్రివర్గ నిర్మాణానికి సంబంధించి గుజరాత్ భవన్ నుంచే కసరత్తు చేశారు. గుజరాత్ అసెంబ్లీ నుండి వీడ్కోలు పొందారు. గుజరాత్ తన కర్మభూమి అని, ప్రతిపక్ష నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా, తాను మోటారు సైకిల్ పై గుజరాత్ అంతా తిరిగిన పాత రోజులను జ్ఞాపకం తెచ్చుకున్నారు. 
 
ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ ఒక్క ఫైలును కూడా పెండింగ్ లో ఉంచలేదన్నారు. శ్రీమతి ఆనందిబెన్ కు గుజరాత్ పీఠం అప్పజెప్పారు. శ్రీ వాఘేలా అసెంబ్లీలో మాట్లాడుతూ 'ఒకప్పుడు గుజరాత్ సంఘ కార్యాలయంలో బట్టలుతికిన మోదీ నేడు దేశంలోని మలినాన్ని కడిగేందుకు ఢిల్లీ వెళ్తున్నారు' అన్నారు. మంత్రివర్గం ఏర్పాటులో శాఖలను అనుసంధానించడం ద్వారా కుల, మత వర్గాలకు, బంధు ప్రీతికి అతీతంగా మకిలి అంటినవారికి పదవులివ్వకుండా మోదీ తనదైన ముద్ర వేశారు. ఇక ఆయన మంత్రివర్గం చేసే భవిష్యత్ నిర్ణయాలు దేశ భవితను నిర్ణయిస్తాయి. ఆశావాదంతో ఎదురు చూద్దాం, ఆనంద భారతం కోసం ముందడుగు వేద్దాం.  
 
- హనుమత్ ప్రసాద్