కులం అనేది లేదు...!

వివేక సూర్యోదయం - ధారావాహికం - 21

నరేంద్రుడు వివేకానందుడైన విధం - భాగం 1


1863 జనవరి 12, సంక్రాంతి పర్వదినం. హిందూ సంక్రాంతి కొరకై విశ్వనాథ దత్త, భువనేశ్వరీదేవి దంపతులకు నరేంద్రుడు జన్మించాడు. తల్లి శివపూజలు చేసేది. 'శివాంశ'గా నరేంద్రుడు కలిగాడని భావించేది తల్లి. బాల నరేంద్రుడు బాగా అల్లరి చేసేవాడు. రెండేళ్ల వయసులో వంటికి బూడిద పూసుకుని గోచీ పెట్టుకుని దారిన పోయే బిచ్చగాళ్లకు చేయి చాస్తే చాలు, చేతికందిన వస్తువునిచ్చేవాడు. అల్లరి చేసినప్పుడల్లా తల్లి బిందెడు నీళ్లు నెత్తిమీద కుమ్మరించేంది. వెంటనే అల్లరి మానేసేవాడు. 

తల్లి మధ్యాహ్న భోజనం 2  గంటలకు భోజనం చేయడం నరేంద్రుడు చాలాసార్లు చూశాడు. రోజూ అతిథికి పెట్టి తాను తినేది. ఆమెలోని ఆ ధార్మిక సేవాసంస్కృతి నరేంద్రునికి కూడా అబ్బింది. నరేన్ తల్లిదండ్రులను ఎంతగానో అభిమానించేవాడు. తల్లి రామాయణ మహాభారతాల నుంచి చక్కని కథలు నరేన్ కు చెప్పేది. బాల నరేంద్రుని మనసులో ఈ ప్రేరణాదాయకమైన కథల వల్ల మంచి గుణాలు, మంచి ఆశయాలు నాటుకున్నాయి. 

బాల నరేంద్రుడికి 'రాజు-న్యాయస్థానం' ఆట అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. తనే రాజుగా వ్యవహరించేవాడు నరేంద్రుడు. ఇతర బాలురు మంత్రులుగా, అధికారులుగా నటించేవారు. రాజుగా హుందాతనంతో నటించేవాడు. ఆట ముగియగానే అందరితో కలిసిపోయేవాడు. 

నరేంద్రునికి బాల్యం నుంచి దైవభక్తి ఎక్కువ. ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేసేవాడు. ఓసారి ధ్యానంలో లీనమయ్యాడు. ఇంతలోనే త్రాచుపాము వచ్చింది. పిల్లలంతా పరుగెత్తారు. త్రాచుపాము ఆయన శరీరమంతా పాకింది. అయినా నిశ్చలంగా ఉండిపోయాడు. 

నరేన్ సరస్వతీ పుత్రుడు, మంచి తెలివితేటలు గలిగి ఏకసంతాగ్రాహి అనిపించుకునేవాడు. రేఖాగణితం నరేన్ కు అర్థమయ్యేది కాదు. 24 గంటలపాటు కూర్చుని నాలుగు రేఖాగణిత పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. పుస్తకంలో పేరాలో మొదటి, చివరి పంక్తులు చదివి సారాంశాన్ని అర్థం చేసుకునేవాడు. 

నరేన్, అతని మిత్రులు చెట్టుమీద ఆట ఆడుతుండేవారు. ఆ చెట్టు యజమాని వారిని భయపెడదామని బావించి ఆ చెట్టుమీద దయ్యం ఉందన్నాడు. పిల్లలంతా పరుగెత్తారు. కాని నరేన్ 'దయ్యం ఉందా? రమ్మను చూద్దాం!' అని దాని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. చివరికి దయ్యం రాలేదు. యజమాని పన్నాగం అర్థమయింది. స్నేహితుల్ని వారించాడు. 

నరేన్ సత్యాన్వేషణకై పరితపించేవాడు. తండ్రి న్యాయవాది. ఆయన్ను కలవడానికి అనేక కులాలవాళ్లు వస్తుండేవారు. ఒక్కో కులానికి ఒక పొగ హుక్కా ఉండేది. నరేన్ అది చూసి ఆశ్చర్యపోయాడు. ఓ రోజు ప్రతి హుక్కా నుంచి ఓ దమ్ము పీల్చాడు. తేడా ఏం కనబడలేదు. కులాల్లేవన్నాడు.

- హనుమత్ ప్రసాద్