రాష్ట్రాలు వేరైనా మనందరిదీ ఒకే తెలుగు సంస్కృతి

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం,
  జ్యేష్ఠ మాసం

1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజుల్లో దేశంలో ఉన్న 544 సంస్థానాలలో 541 సంస్థానాలు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సామ, దాన ఉపాయాలతో ఇండియన్ యూనియన్ లో కలిపేసారు. మిగిలిన మూడు సంస్థానాలను దండోపాయంతో కలపవలసి వచ్చింది. 1948 సెప్టెంబర్ 17న నైజాం సంస్థానం ఇండియన్ యూనియన్ లో కలపబడింది. 1953  అక్టోబర్ 1న మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర ప్రాంతం బయటకు వచ్చి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పొట్టి శ్రీరాములు ఉద్యమం కారణంగా దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది. ఒకే తెలుగు భాష మాట్లాడే ఆంధ్ర, తెలంగాణలు రెండు కలిసి 1956 నవంబర్ 1న ప్రత్యేక ఆంధ్రపదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి.

ఒకే భాష మాట్లాడే వారైన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా తెలంగాణ ప్రత్యేకంగానే ఉండాలని ఆ రోజుల్లో కాంగ్రెసు నాయకులు అనేకమంది పెద్దలు తీవ్ర అభ్యంతరము పెట్టినా విలీనం ఆగలేదు. దాని పర్యవసానము 1969 సంవత్సరం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతూనే ఉన్నది. 1972 సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా సాగింది. 2000 సంవత్సరంలో మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మళ్ళీ మొదలైంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తన సుముఖత తెలియచేసాడు. 2009లో కేంద్ర మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటించి మళ్ళీ వెనక్కు తగ్గారు. దానితో ఉద్యమం ఉధృతమైన కారణంగా 2014 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల సమ్మతితో తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. 2014 జూన్ 2వ తేదీ నుండి ఆంధ్రపదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రపదేశ్ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.

స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో అప్పటి నాయకులు వేసిన తప్పటడుగుల కారణంగా దేశంలో అనేక సమస్యలు తలెత్తాయి. దానికి దేశం ఇప్పటికే ఎంతో మూల్యం చెల్లించుకుంది. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకే తెలుగు భాష మాట్లాడే ప్రజల మధ్య నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసారు. వాటిని మరచిపోయి రెండు రాష్ట్రాలలో తెలుగు భాష మాట్లాడే మనందరం పాలనాపరంగా వేరైనా సంస్కృతి పరంగా ఒక్కటే.  ఆ విధంగానే కలిసి జీవిస్తాం. ఆ దిశలోనే సమాజంలోని పెద్దలు, నాయకులు నడవాలి.