మైనార్టీల సంతుష్టీకరణపై కాంగ్రెస్ లో చర్చ

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం,
  ఆషాఢ మాసం

మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెసును ఒక కుదుపు కుదిపాయి. ఆ ఫలితాలపై కాంగ్రెసు ఇంకా సమాధానపడలేకపోతున్నది. పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ పరిస్థితిలో చిక్కుకొంది. దానిపై చర్చలు మొదలైనాయి. కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు మాజీ రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని ఈమధ్య కేరళలో మాట్లాడుతూ "సెక్యులరిజం అంటే ముస్లింల సంతుష్టీకరణే అనేట్లుగా మితిమీరిన ముస్లిం సంతుష్టీకరణ విధానం కారణంగా హిందువుల నుండి దూరమవుతున్నామా? పార్టీపై హిందువుల విశ్వసనీయత ప్రశ్నగా మారుతున్నదా? దాని కారణంగానే మనం ఓడిపోయాము" అని అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి మైనార్టీల సంతుష్టీకరణ అనేది కాంగ్రెసు విధానంగా మారింది. దాని పరాకాష్ట గడిచిన 10 సంవత్సరాలు. సచార్ కమిటీ రిపోర్టులు, మతహింస నిరోధక బిల్లు, విద్యా, ఉపాధి రంగాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇలా ఒకటేమిటి అనేకం. హిందూ ఉగ్రవాదం ఉన్నదని, దానిని అణచివేస్తామనే విధంగా పనిచేసుకుంటూ వచ్చింది. దానిపై ఒక ప్రక్క చర్చ జరుగుతోంది.

'అలవాటు పాతరోగం లాంటిది' అని తెలుగులో ఒక సామెత ఉంది. అలా ఉంది కాంగ్రెస్ ధోరణి. మహారాష్ట్రలో ఎన్నికలు తరుముకొస్తూంటే ఆ రాష్ట్రంలో మళ్లీ అధికారం సాధించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా ఉపాధి రంగాలలో ముస్లింలకు 6% రిజర్వేషన్లు, మరాఠాలకు 16% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇదీ కాంగ్రెస్ ధోరణి. ఒకప్రక్క ముస్లిం సంతుష్టీకరణ విధానం కారణంగానే ఓడిపోయామనే అంతర్మథనం జరుగుతుంటే మరోప్రక్క మళ్ళీ రిజర్వేషన్ పాచిక విసురుతున్నది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కులాలవారి మాత్రమే. మతపరమైన రిజర్వేషన్లు లేవు. ఈ విషయాలు నాయకులకు తెలియదా అంటే తెలుసు. అయినా ప్రజలు నమ్మేవరకు మోసం చేయవచ్చనేది కాంగ్రెస్ నాయకుల నీతి. ఇటువంటి కుతంత్రాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ నడచుకోవాలి.