కలల్లో జీవించవద్దు

వివేక సూర్యోదయం - ధారావాహికం - 18


న్యూయార్క్, 1 ఫిబ్రవరి, 1895
ప్రియమైన సోదరి ! (సోదరి మేరిహేల్ నుద్దేశించి)

మీ ఉత్తరం ఇపుడే అందింది, మీ విమర్శల పట్ల నేను కలత చెందడం లేదు. మొన్నీ మధ్య సోదరి థర్స్ బై ఇంట ఓ పెద్ద మనిషితో చాలా తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఎంతో కోపంతో, నిందాపూర్వకంగా ఆయన మాట్లాడాడు. ఇలాంటి విషయాలు నా పనిలోఅడ్డంకులు కాలేవు. నీకు నిరాశ కలుగవచ్చు. మనిషికి ప్రాపంచిక సుఖాలు ఎంత మధుర భావననిస్తాయో నాకు తెలుసు. కాని జీవిత సత్యం సాధించే, శోధించే దారిలో నిజంతో రాజీ పడేందుకు నేను విముఖుడను. నన్ను నేను తక్కువ చేసి భరించలేను. అంతటా సమదర్శనమే నేను కోరుకునేది. భగవంతుడి ఆజ్ఞననుసరించడమే సామాన్యుడి కర్తవ్యం. 

సమాజం నుంచి సర్వసౌఖ్యాలు పొందుతూ సమాజం దారిలోనే పోవడం కొందరు చేస్తుంటారు. కొందరు ఒంటరై నిలబడి సమాజాన్ని తమవైపు తిప్పుకుంటారు. నలుగురి దారిలో పోతే దారి పూలబాటగా అనిపిస్తుంది. ఒంటరికి దారి ముళ్లబాట. కాని మొదటి కోవలో దొరికే సుఖం క్షణభంగురం. రెండవ కోవకు చెందిన సుఖమే శాశ్వతం. సత్యాన్ని అనంతమైన శక్తిగా నేను భావిస్తాను. నేను ఎక్కడికక్కడ సర్దుకుపోయి, రాజీపడి సుఖపడలేను. నేను చాలా కష్టాలు పడ్డాను. అయినా సరే నేనెంతో చింతించాను. అయినా సరే చివరికి నేను ఆ సుఖాలను త్యజించాను. భగవంతుడే గొప్పవాడు. నేను నటిస్తే ఆయన ఒప్పుకోడు. నేనందరినీ మెప్పించలేను. కాని నామాటలకు నేను నా నైజంతో ప్రవర్తిస్తాను. యవ్వనం, అందం, జీవితం, సంపద, పేరు, ప్రతిష్ఠ అన్నీ కనుమరుగవుతుంటాయి. పర్వతాలు సైతం తునాతునకలౌతుంటాయి. స్నేహం, ప్రేమ అన్నీ అదృశ్యమౌతాయి. కేవలం సత్యం మాత్రమే నిలబడుతుంది. పాల వలె తేనె వలె మారేందుకు నేను వయసు మీరాను. నన్ను నన్నులా జీవించనివ్వు. నిర్భయంగా ఓ సన్యాసిగా నా సోదరులకు సహాయపడనివ్వు. నాలోని సత్యాన్ని కాదని నేన ప్రాపంచిక విషయాల వైపు పోలేను. మనువు చెప్పాడు 'ఒంటరిగా జీవించు, ఒంటరిగా నడు' అని. మీరంతా నా పిల్లల్లాంటివారిగా భావిస్తాను. కలల్లో జీవించవద్దు. మోక్షమే నా మతం. పశుప్రాయమైన జీవితంకంటే వెయ్యి మరణాలనైనా నేనాహ్వానిస్తాను. నన్ను అపార్థం చేసుకోవద్దు. ఉమాశంకరులు నిన్ను రక్షించుగాక.

ఆశీస్సులతో వివేకానంద.

- హనుమత్ ప్రసాద్