ఆమ్ ఆద్మీ పార్టీని తప్పు పట్టిన శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ

 
యోగ గురువు అయిన శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకులు. ప్రపంచంలో సుమారు 140 దేశాలలో వీరికి శిష్యులున్నారు. యోగ సాధనతోబాటు భారతదేశంలో జరిగే రాజకీయ పరిణామాల్ని కూడా వారు సునిశితంగా గమనిస్తుంటారు. రాజకీయాలు స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించినప్పుడు అవినీతిని అంతమొందించేందుకు ఓ రాజకీయ పక్షం ముందుకొచ్చిందని ఆయన సంతోషించారు.
 
కాని క్రమంగా ఢిల్లీ పీఠం అధిష్టించిన కేజ్రీవాల్ 49 రోజుల్లోనే రాజీనామా చెయ్యడంతో ఆయన నొచ్చుకొన్నారు. 'నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చాలా త్వరగా ఆదరించి పట్టం కట్టారు. ప్రజలిచ్చిన తీర్పును పార్టీ స్థిరపరచుకోవాల్సి ఉండింది. ఢిల్లీ పరిపాలనను గాడిలో పెట్టి స్థిరత్వం సంపాదించిన తరువాత దేశ రాజకీయాలపై 'ఆప్' దృష్టి పెట్టాల్సింది. కాని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది' అని గట్టిగా విమర్శించారు శ్రీశ్రీ. 'వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఆమ్ ఆద్మీ అడుగిడినప్పుడు సామాన్యుడి ఆశలు నెరవేరతాయని భావించాను. కాని వారికి ఎవరో తప్పుడు సలహాలు ఇచ్చారు. వారు ప్రభుత్వం వదలిపెట్టారు. వారికి వేరే పార్టీలకు ఇక తేడా ఏముంది?' అన్నారు శ్రీశ్రీ. 
 
- హనుమత్ ప్రసాద్