అంగరంగ వైభవంగా శ్రీరామనవమి, హనుమ జయంతి శోభాయాత్రలు

 
తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో దశాబ్దాలుగా హిందుత్వ ప్రభావం చాలా ఉంది. నైజాం సమయంలో ఆర్యసమాజ్ మొదలైన సంస్థలు విశేషంగా పనిచేసాయి. దాని ప్రభావం అనేక జిల్లాలలో ఉన్నది. తదనంతర కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘము తెలంగాణలో అన్ని జిల్లాలలో విస్తరించింది. గడిచిన మూడు దశాబ్దాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్న విషయం కూడా అందరికి తెలుసు. గణేష్ నిమజ్జనం ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా జరుగుతున్నది. లక్షల సంఖ్యలో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే పద్ధతిలో గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి శ్రీరామనవమి సందర్భంగా, హనుమ జయంతి సందర్భంగా కూడా శోభాయాత్రలు జరుగుతున్నాయి. 
 
ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా రమణీయమైన శోభాయాత్రలు జరిగాయి. వాటి విశేషాలు చూద్దాం : 
 
శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శోభాయాత్ర 
 
 
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధూల్ పేటలోని గంగాబౌలిలో గల రాణి అవంతిబాయి భవన్ నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. చారిత్రాత్మకమైన మహంకాళేశ్వరి మందిరం నుంచి పదకొండు గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర హనుమాన్ వ్యాయామశాల, అప్పర్ ధూల్ పేట, పురానాపూల్ చౌరస్తా, జుమ్మైరాత్ బజార్, చుడీబజార్, ఛత్రీ, బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగింది. దారి పొడవునా లక్షలాది మంది భక్తుల శ్రీరామనవమి నినాదాలతో వీథులు మారుమ్రోగాయి. ఊరేగింపులో శ్రీరాముని భారీ విగ్రహం, శివాజీ మహరాజ్, ఝాన్సీలక్ష్మీబాయి, సీతారామలక్ష్మణ విగ్రహాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  
 
గో పరిరక్షణ సమితి ప్రతినిధి, మంగల్ హాట్ బిజెపి కార్పొరేటర్ రాజాసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో భాగంగా ఆయన పలుచోట్ల గీతాలను ఆలపించటం, హిందూధర్మ పరిరక్షణపై ప్రసంగించటం అందరినీ ఆకట్టుకుంది. యాత్ర కొనసాగినంతసేపూ ఆయా ప్రాంతాలన్నీ కాషాయమయంగా మారాయి. ముఖ్యంగా ఈ ఊరేగింపు ప్రారంభం కాకముందే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు కాషాయ జెండాలను చేతబూని "జై శ్రీరామ్" నినాదాలు చేస్తూ ధూల్ పేటకు చేరుకున్నారు. యాత్ర ముందుకు సాగినకొద్దీ యువకుల సంఖ్య భారీగా పెరగడంతో పలు ప్రాంతాల్లో పోలీసుల అత్యుత్సాహం కారణంగా స్వల్పంగా తోపులాట వంటివి చోటుచేసుకున్నాయి. ప్రతి ఏటా సుమారు లక్ష నుంచి మూడు లక్షల వరకు జనం పాల్గొనే ఈ యాత్రలో నాటి కార్యక్రమంలో నాలుగు లక్షల పైచిలుకు జనం పాల్గొన్నారు. అందులో ఎనభైశాతం మంది యువకులే ఉండటం విశేషం. 
 
హనుమ జయంతి సందర్భంగా శోభాయాత్ర - హిందూ సమాజం జాగృతం కావాలని వి.హెచ్.పి. కార్యదర్శి చంపత్ రాయ్ పిలుపు : 
 
 
హిందూ సమాజం జాగృతం కావాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ హిందువులకు పిలుపునిచ్చారు. హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజధాని నగరంలో చేపట్టిన అత్యంత రమణీయమైన శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంపీరియల్ గార్డెన్స్ లో విశ్వహిందూపరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చంపత్ రాయ్ రాముడు గొప్పదనాన్ని, హనుమంతుని శక్తియుక్తులను, రామజన్మభూమి వివాదం, బాబ్రీమసీదు కూల్చివేత పూర్వాపరాలను వివరించారు. భారతదేశంలో ఉన్నది హిందూ సమాజమేనని, హిందువులు ప్రతి మహనీయుని జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకునే మహోన్నత లక్షణాన్ని కలిగి ఉంటారని అన్నారు. శ్రీరామనవమి, మహావీర్ జయంతి, హనుమ జయంతి - ఇలా ప్రతి ఉత్సవాన్ని హిందూ సమాజం ఘనంగా నిర్వహించుకుంటుందని చెప్పారు. 
 
----------------------------------------------------------------------
1880లో అద్భుతమైన గోరక్ష ఉద్యమం జరిగిందని, అటువంటి ఉద్యమస్ఫూర్తి మళ్ళీ రావాలని అన్నారు. రామజన్మభూమి విషయంలో గొప్ప చైతన్యం, సంఘీభావం వచ్చిందని, అలాంటి చైతన్యం రావాలని శ్రీ శాస్త్రి సూచించారు.
----------------------------------------------------------------------
 
భారత్ ప్రపంచానికి గురువు  - విశ్వహిందూపరిషత్ కేంద్రీయ కార్యదర్శి రాఘవులు 
 
 
అంతకుముందు విశ్వహిందూపరిషత్ కేంద్రీయ కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ 'యావద్భారతం హనుమాన్ జయంతిని ఆనందంగా జరుపుకుంటోందని అన్నారు. భారతీయుల్లో ఏకత్వాన్ని తొలగించేందుకు 200 ఏళ్ళ పాటు బ్రిటిష్ వారు ప్రయత్నించినా కుదరలేదని, కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల పేరిట విడదీయాలని ప్రయత్నించారని అన్నారు. మాతృభూమి గురించి దేశం అంతా ఒకేలా స్పందిస్తారని, అలాగే ఒకేరోజు పండుగలు జరుపుకుంటారని, దేశ ప్రజలందరికీ దేవుళ్ళు ఒకటేనని, భారత్ ప్రపంచానికి గురువు (జగద్గురువు) అని చెప్పారు. 'జై శ్రీరామ్" అనే మంత్రంలో ఉన్న మూడు బీజాక్షరాలు అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడికి ప్రతీకలుగా ఉంటాయని, మహాశక్తి సంపన్నుడిగా ప్రభవించడానికి ఈ నామస్మరణ చాలని అన్నారు. హనుమంతుడు తన శక్తిని భక్తిగా మార్చుకున్నాడని అన్నారు. మానవుడు మాధవుడిగా మారాలని, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి మహానుభావుల జీవితాలను అర్థం చేసుకోవాలని అన్నారు.
 
హిందువులు ఏకం కావాలి - శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి

హిందువులు మరోసారి ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి అన్నారు. మహాజ్ఞాని, శక్తివంతుడైన హనుమంతుడి శక్తి ప్రతి ఒక్కరూ సమకూర్చుకోవాలని, హిందువులకు వారి శక్తి ఎంతో తెలియదని, 80 శాతం ఉన్నహిందువులు కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరిట విడిపోవడంతో 13.8 శాతం ఉన్నవారు మెజార్టీగా మారి పెద్ద ఓటుబ్యాంకుగా గుర్తింపు పొందారని, దాంతో రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు వారి కాళ్ళకు దండం పెట్టి అడిగినవన్నీ సమకూర్చుతున్నాయని అన్నారు.  
 
1880లో అద్భుతమైన గోరక్ష ఉద్యమం జరిగిందని, అటువంటి ఉద్యమస్ఫూర్తి మళ్ళీ రావాలని అన్నారు. రామజన్మభూమి విషయంలో గొప్ప చైతన్యం, సంఘీభావం వచ్చిందని, అలాంటి చైతన్యం రావాలని శ్రీ శాస్త్రి సూచించారు. 
 
ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రలో లక్షలమంది యువకులు పాల్గొన్నారు.