ఇక మైకులు పెట్టి మతప్రచారం చేయ వీల్లేదు !

 
తమిళనాడు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలోని కొల్లుకొట్టమ్ అనే గ్రామంలో చర్చి పాస్టర్ జయకుమార్ తన నివాసం గృహముపై మైకు పెట్టి క్రైస్తవ మత ప్రచారము (ఎవాంజలిజమ్) చేయపూనుకున్నాడు. ప్రజల నివాస గృహాల మధ్యలో ఇలా మైకు పెట్టి క్రైస్తవ మత ప్రచారము చేయడం తగదని ప్రజలు నిరసన తెలిపారు. పాస్టరును మైకు ఆపమని అడిగారు. మతప్రచారం మా ప్రాథమిక హక్కంటూ ప్రజల విజ్ఞప్తిని తిరస్కరించాడు. ప్రజలు మైకు గోల భరించలేక స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారు. వారెలాంటి చర్య తీసుకోలేదు. పాస్టరుకే అనుకూలంగా వ్యవహరించారు. ప్రజలలో పట్టుదల పెరిగింది. హిందూ స్వాభిమానం కూడా పెల్లుబికింది. అంతా ఒక్కటై జిల్లా కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. నివాస గృహంపై మైకు పెట్టి నివాసగృహాల మధ్య మతప్రచారం చేయ వీలులేదని చట్టం తెలుపుతుందంటూ జిల్లా కలెక్టరు ప్రచారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చాడు. నివాస గృహాన్ని చర్చిలా వాడుకొనే వీల్లేదని కూడా ఆ ఉత్తర్వులో తెలిపాడు. 
 
ఆగ్రహించిన పాస్టర్ జయకుమార్ కలెక్టరు ఉత్తర్వులపై చెన్నై హైకోర్టులో సవాలు చేశాడు.  న్యాయమూర్తి సుగుణ కేసును విచారించింది. పాస్టరు పిటిషన్ ను కొట్టివేసింది. "నివాసగృహం మత ప్రచారమునకు వాడబడరాదు" ('A Residential Place cannot beused forevangelism') అని తీర్పు చెప్పి కలెక్టరు ఉత్తర్వులు అమలు చేయబడాలని ఆదేశించింది. దానితో ఆ పాస్టర్ తన ఇంటిపై ఉన్న మైకు తీసివేయవలసి వచ్చింది.