నేపాల్ లో మావోయిస్టు పార్టీ ఘోర పరాజయం

 
ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యమైన నేపాల్ లో మావోయిస్టు పార్టీ నవంబర్ 19న జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైంది. 1996 నుండి నేపాల్ లో కొత్త రాజ్యాంగ రచనకు అడ్డుపడుతూ అధికారం తమ చేతుల నుండి జారిపోకుండా చూసుకోవటానికి వేస్తున్న ఎత్తుగడలు మొన్నటి ఎన్నికలలో విఫలమైనాయి. మావోయిస్టు నాయకుడు ప్రచండ రెండు చోట్ల నుండి పోటీ చేయగా ఒకచోట ఘోరపరాజయం పొందాడు. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం.

గడిచిన కొన్ని నెలలుగా నేపాల్ లో చోటుచేసుకొంటున్న పరిణామాలలో మావోయిస్టు పార్టీ రెండుగా చీలిపోవటం ఒకటి. గత సంవత్సరం మోహన్ వైద్యకిరణ్ అనే మావోయిస్టు నాయకుడు మావోయిస్ట్ పార్టీని చీల్చి మరో పార్టీ పెట్టాడు. ప్రచండ పార్టీ ఎన్నికలలో పోటీ చేయగా కిరణ్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. గతంలో ప్రత్యక్ష దాడులు చేసేవారు. ఇప్పుడు పరోక్ష దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సాగాలని ఒకప్రక్క చెబుతూనే మరోప్రక్క సాయుధా పోరాటాన్ని పూర్తిగా విరమించుకోవటం లేదు. నేపాల్ లో సాధారణ పరిస్థితులు నిర్మాణం కావటానికి ఈ ఫలితాలు దోహదపడవచ్చు.
 
- రాము