ఉత్తరాఖండ్ ప్రళయం వెనుక...?


గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. తన బిడ్డల పైనే కన్నెర్ర చేసింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది. వేలాది మందిని తనలో కలుపుకొని సమాధి చేసింది. పటపటా పళ్లు కొరుకుతూ అడ్డువచ్చిన కొండలనూ పిండి చేసేసింది. కేదారేశ్వరుడిని ప్రళయ ప్రవాహంతో అభిషేకించింది. కళకళలాడే క్షేత్రాన్ని ఒక్కరోజులోనే మరుభూమిగా మార్చేసింది. యుగాలుగా ప్రవహిస్తున్నగంగమ్మ తల్లికి అంత కోపం ఎందుకొచ్చింది? భక్తులనే మింగేసేంత ఆగ్రహం ఎందుకు కట్టలు తెంచుకుంది? అంతా స్వయంకృతాపరాధమేనన్న వాస్తవాన్ని జనానికి తెలిసి వచ్చేలా, పాలకులు కళ్లు తెరిచేలా ఉగ్ర గంగ పోటెత్తింది.

అభివృద్ధి పేరిట వెర్రితలలు :  

నాగరికతకు ప్రతీకగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న వేళ ప్రకృతినీ, పర్యావరణాన్నీ కూడా దెబ్బతినకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తద్విరుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రకృతికి తగిలిన గాయం అదను చూసి లావాలా పెల్లుబుకుతుంది. శతాబ్దాలుగా చోటుచేసుకుంటున్న విలయాలు, ప్రళయాలే ఇందుకు సాక్ష్యం. తాజాగా తలెత్తిన విపత్తూ అదే కోవలోకి వస్తుంది. ఇంతటి విలయానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించుకుంటే అభివృద్ధి పేరిట హిమాలయాలను మనం (అంటే ప్రభుత్వం, పాలకులు, పారిశ్రామికవేత్తలు) ఎంతగా విధ్వంసం చేస్తున్నామో కళ్లకు కడుతుంది. మానవ తప్పిదమే ఈ మహోగ్ర రూపానికి కారణమన్న వాస్తవం బోధపడుతుంది.

హిమాలయాల గర్భంలో గునపం :  

ఉత్తరాఖండ్ యావత్తూ పర్వతాలతో కూడిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 93 శాతం పర్వతాలే. మరోవైపు ఈ పర్వతాలు, లోయల మీదుగా గంగ, యమున, భాగీరథీ, అలకనంద,పదుల సంఖ్యలో వాటి ఉప నదులు శరవేగంతో పరుగులు పెడుతుంటాయి. దీంతో ప్రైవేటు విద్యుత్ సంస్థలు రాబందుల్లా అక్కడ వాలాయి. చిన్నస్థాయి జలవిద్యుత్ ప్రాజెక్టులు పర్యావరణానికి మేలు చేస్తాయన్న ప్రభుత్వ ఆలోచనతో పుట్టగొడుగుల్లా జలవిద్యుత్ ప్రాజెక్టులు వెలిశాయి. ఇక్కడి నదీ ప్రవాహ మార్గాల్లో ప్రతీ ఐదారు కి.మీటర్లకూ ఓ జలవిద్యుత్, గనుల ప్రాజెక్టుల వంటివి మొత్తం 220కి పైగా ఉంటాయని అంచనా. వీటికి తోడు తాజాగా 37 జలవిద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులిచ్చింది. మరో 70 ప్రాజెక్టులు కూడా అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. వీటి నిర్మాణం కోసం సొరంగ మార్గాల పేరిట హిమాలయాలను తొలుస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. రిజర్వాయర్ల కోసం విచ్చలవిడిగా పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీనితో వృక్ష, జంతుజాలం అంతరించిపోతోంది. మరోవైపు జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం నదులను సొరంగాల ద్వారా మళ్లిస్తుండడంతో వాటి సహజసిద్ధ ప్రవాహ స్వరూపం మారిపోయి ఒత్తిడి పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలతో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కి వాతావరణ మార్పులకు కారణమవుతోంది.

మొట్టికాయ వేసినా... :  

ఇటువంటి పరిణామాలను, పర్యవసానాలను ముందే ఊహించిన కాగ్ మూడేళ్ల క్రితమే హెచ్చరించింది. ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న విధ్వంసం వల్ల నదులకు తీవ్ర ముప్పు పొంచి ఉందని తేల్చింది. అయినా ప్రభుత్వం గానీ, పరిశ్రమలు గానీ కనీసం వినిపించుకోలేదు.

ఆధ్యాత్మిక ముసుగులో పర్యాటకం :  

మరోవైపు శతాబ్దాలుగా ఎంతో పవిత్రంగా భక్తి విశ్వాసాలతో అలరారుతున్న చార్ ధామ్ ఆలయాలను ఆధ్యాత్మిక యాత్రల ముసుగుతో పర్యాటక ప్రాంతాలుగా మార్చేశారు. ఎంతో పవిత్రమైన, మరెంతో సున్నితమైన హిమాలయాల పర్వతాలు పరిమిత సంఖ్యలో జన కాలుష్యాన్ని మాత్రమే తట్టుకోగలవు. దైవభూమిగా పిలుచుకునే ఈ శిఖరాలను అపవిత్రం చేయడమే కాదు, యాత్రల పేరిట పరిమితికి మంచి జనాన్ని ఒక్కసారిగా తీసుకెళ్తున్నారు. అటు ఆంక్షలు విధించవలసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇటు ధనార్జనే ధ్యేయంగా వెలిసిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల అత్యాశ వెరసి ఇంతటి ఘోర విపత్తుకు కారణమయ్యాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యాత్రికుల సంఖ్య గడిచిన మూడు దశాబ్దాలలో దాదాపు 50 రెట్లు పెరగడం సామాన్యమైన విషయం కాదు. జన కాలుష్యం, జన వ్యర్థాలు హిమాలయాల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలు, నదుల చుట్టూ పట్టణాలు ఏర్పడటం, కొండలపైనే ప్రమాదకర స్థాయిలో భారీ భవనాలు నిర్మించడం వంటివి మరింత ఆజ్యం పోశాయి.

చెక్కుచెదరని విశ్వాసం :


చివరిగా చెప్పుకోవాల్సినదేంటంటే ఇంతటి ప్రళయంలోనూ కేదారేశ్వరుని ఆలయం గానీ, అందులోని మహాదేవుడు గానీ చెక్కు చెదరక పోవడం తరతరాల విశ్వాసానికి తిరుగులేని ప్రతీక.  
- హంసినీ సహస్ర