కాశ్మీరీలలో ఏకాభిప్రాయ నిర్మాణం ఇప్పటి అవసరం

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, 
 మార్గశిర మాసం
 
స్వతంత్ర భారతదేశంలో రావణకాష్టం లాగా రగులుతున్న సమస్య కాశ్మీర్ సమస్య. స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారత్ పై పాకిస్తాన్ చేసిన ప్రత్యక్ష యుద్ధాలు కాని, ఇప్పుడు జరుగుతున్న ఉగ్రవాద దాడులు కాని, కాశ్మీర్ వేర్పాటువాద ఉద్యమాలకు కాని కేంద్రబిందువు కాశ్మీర్. కాశ్మీర్ సమస్యకు కేంద్రబిందువు ఆర్టికల్ 370. స్వతంత్ర భారత్ లో సంపూర్ణంగా విలీనమైన కాశ్మీర్ కు ఈ ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు ఇవ్వబడింది? దీనికి దారితీసిన కారణాలు ఏమిటి? జాగ్రత్తగా పరిశీలిస్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ కాశ్మీర్ రాజుపై పెంచుకున్న ద్వేషం ఇన్ని సమస్యలకు కారణం. కాశ్మీర్ రాజు హరిసింగ్ ఎంతో హుందాగా వ్యవహరించినా నెహ్రూ తన ప్రతీకారం తీర్చుకోవడానికి షేక్ అబ్దుల్లాను ముందుకు తెచ్చాడు. నెహ్రూ సంస్థలను, సమస్యల పూర్వాపరాలను పట్టించుకోరు. తనకు నచ్చిన వ్యక్తులు, తనకు తోచిన పరిష్కారం ఆ మార్గంలోనే వెళ్తాడు. అందుకే మౌంట్ బాటన్ నెహ్రూను ఎంపిక చేసుకున్నది. తమ పని సానుకూలం కావాలంటే పటేల్ లాంటి వ్యక్తులు ఉండకూడదు. నెహ్రూ యొక్క స్వభావానికి దేశం ఈ రోజుకి మూల్యం చెల్లిస్తున్నది.

ఆర్టికల్ 370 రాజ్యాంగములో తాత్కాలికము అని వ్రాయబడింది. నెహ్రూ కూడా ఆర్టికల్ 370 తాత్కాలికమైంది, అది క్రమంగా తొలగించబడుతుంది అని వాగ్దానం చేసారు. స్వతంత్రము వచ్చి ఇన్ని సంవత్సరాలు గడచినప్పటికి అది తొలగించబడలేదు. దాని కారణంగా కాశ్మీర్ ప్రజలకు, పాకిస్తాన్ కు వేర్పాటువాదులకు, ప్రపంచానికి మనంతట మనమే తప్పుడు సంకేతాలు పంపుతున్నాము. ఈ మధ్య పాకిస్తాన్ అధ్యక్షులు కశ్మీర్ సమస్య పరిష్కరించుకోవటానికి అమెరికా అధ్యక్షుడిని మధ్యవర్తిత్వం కోరాడు. కాశ్మీర్ సమస్య భారతదేశ సమస్య. అసలు సమస్య పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ విముక్తి కావడం. ఈ విషయాలు పట్టించుకోకుండా మన నాయకులు వ్యవహరించటం అతిపెద్ద సమస్య. ఒకసారి ఆర్టికల్ 370 తొలగించబడితే కాశ్మీర్ మానసికంగా దేశంలో ఒక భాగమవుతుంది. దేశ ప్రజలకు రాకపోకలకు, అక్కడ స్థిరపడటానికి అడ్డంకులుండవు. కాశ్మీరీలు బయటి రాష్ట్రంలో ఎక్కడైనా వివాహ సంబంధాలు పెట్టుకొంటే వాళ్ల హక్కులకు భంగం కలగదు. ఈ అంశంపై కాశ్మీరీలలో చర్చ జరిగి ఏకాభిప్రాయం నిర్మాణమవటం ఇప్పటి అవసరం.