మనదేశం భద్రంగా ఉండాలంటే పటిష్ట ప్రభుత్వం రావాలి

ఎస్.కె.సిన్హా - కాశ్మీర్ మాజీ గవర్నర్ 


2013 డిశంబర్ 22న భాగ్యనగర్ లోని భద్రుక కళాశాలలో ప్రజ్ఞాభారతి - సోషల్ కాజ్ ఆధ్వర్యంలో భారతదేశ భద్రతకు సంబంధించిన అంశంపై ఒక గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమమునకు లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె.సిన్హా (కాశ్మీర్ మాజీ గవర్నర్) పాల్గొని ప్రసంగించారు.

వారి ప్రసంగం సంక్షిప్తంగా...

మనదేశ భద్రత విషయంలో నిర్ణయం తీసుకొనే ప్రక్రియలో సైన్యం ప్రమేయం ఉండదు. నిర్ణయంలో బ్యూరోక్రాట్ దే ప్రధానపాత్ర ఉంటుంది. ప్రభుత్వం సరియైన నిర్ణయాలు తీసుకోని కారణంగా అనేక విధాల సమస్యలు, నష్టాలు దేశం ఎదుర్కొంటున్నది. ఉదాహరణకు నక్సల్స్ విషయంలో సరియైన నిర్ణయం తీసుకోని కారణంగా రాష్ట్రాల మధ్య సరియైన సమన్వయం చేయలేని కారణంగా నేపాల్ నుండి మహారాష్ట్ర వరకు నక్సల్స్ విస్తరించి పని చేస్తున్నారు. భారత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా చాలా సమస్యలొస్తున్నాయి. శ్రీలంక సైన్యానికి ప్రత్యేక సైనిక శిక్షణ ఇచ్చేందుకు భారత ముందుకు రాని కారణంగా పాకిస్తాన్ దానికి సిద్ధమైంది. చైనా కూడా దాని వెనుక నిలిచింది. భారతదేశంలో మనం సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఉంటే అదే పాకిస్తాన్ లో మతచాందసవాదానికి ఊతం లభిస్తున్నది. దాని కారణంగా మనం ఎంతో మూల్యం ఇప్పటికే చెల్లించాము. ఇదే పరిస్థితి ఉంటే ఇంకా చెల్లిస్తాము.

ఆఫ్ఘనిస్తాన్ తో మనదేశం సరియైన సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించాలి. లేకపోతే పాకిస్తాన్ మధ్య ఆసియాలో ఒక శక్తిగా నిలబడే ప్రమాదమున్నది. పాకిస్తాన్ భారత్ లో ప్రత్యక్ష యుద్ధాలలో గెలవలేదు. కాని పరోక్షంగా భారత్ కు నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా భారత్ మేల్కొని పరిస్థితులను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోవాలి. గతంలో చేసిన పొరపాట్లు భవిష్యత్ లో చేయకూడదు.

1962లో చైనా యుద్ధం పరిస్థితులు మనకు తెలుసు. చైనా మళ్ళీ తన సైన్యాన్ని పటిష్టం చేసుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నది. టిబెట్ పరిణామాలను మనం గమనించాలి. ఇప్పటికే భారత్ భూభాగాన్ని కోల్పోయింది. భవిష్యత్ లో ఈ ప్రమాదం రాకుండా చూసుకోవలసిన అవసరం ఉంది.

దేశాన్ని పాలించిన నెహ్రూ కుటుంబంలో జబహర్ లాల్ నెహ్రూ కంటే ఇందిరాగాంధీ చాలా వ్యూహాత్మకంగా వ్యహరించారు. నెహ్రూ అనాలోచిత చర్యలను ఒకసారి జ్ఞాపకం చేసుకొందాము. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వానికై అమెరికా భారత్ ను ఆహ్వానిస్తే దానికి అంగీకరించక ఆ స్థానాన్ని చైనాకు ఇవ్వాలని చెప్పారు. చివరకు అదే జరిగింది. నేపాల్ భారత్ లో విలీనం కావటానికి నేపాల్ భారత్ లో విలీనం కావటానికి సిద్ధపడితే నెహ్రూ దానికి అంగీకరించలేదు. చివరకు అది ప్రత్యేక రాజ్యంగా ఉంది.  ఒక వేళ అంగీకరించి ఉంటే ఈ రోజున హిమాలయాలలో మన రక్షణ వ్యవస్థ ఎంతో బలంగా ఉండి ఉండేది. అదే ఇందిరాగాంధీ సిక్కింను భారత్ లో కలపటానికి అంగీకరించింది. ప్రత్యేక బంగ్లాదేశ్ కు ఏర్పాటుకు మద్ధతునిచ్చింది.

రాబోవు రోజులలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశ భద్రతను కాపాడాలి. దానికి ప్రభుత్వం యొక్క నిర్ణయాలే ఆధారం. కాబట్టి పటిష్టమైన ప్రభుత్వం రావాలి.