ప్రపంచమంతటా హిందూ వీచికలు

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, అషాఢ మాసం
 

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందుత్వముపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. సంస్కృతము, యోగ, ఆధ్యాత్మిక విషయాలు, హిందూ జీవన విలువలు మొదలైన వాటిపై ఆసక్తి పెరుగుతున్నది. ఈ రోజున ప్రపంచంలో అనేక దేశాలలో దేవాలయాల సంఖ్య కూడా పెరుగుతున్నది. హిందూ తత్వము ప్రజలలో సహోదరభావం, శాంతి, ఆనందం కలిగిస్తుందని ఈ మధ్య ఇండోనేషియాలో జరిగిన ప్రపంచ హిందూ సమ్మేళనంలో కార్యక్రమ అధ్యక్షులు చెప్పారు. సుమారు 500 మంది ప్రముఖులు ఆసియా, ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల నుండి వచ్చి ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. జూన్ 13 నుండి 17 వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇండోనేషియా మత సంబంధ శాఖ మంత్రి సూర్యధర్మ అలి ప్రారంభించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు.  
 
'భౌతిక జీవనం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము. అందువలన ప్రపంచ ప్రజలకు శాంతిని అందించే మార్గాలు అన్వేషించవలసి ఉన్నది. ప్రపంచ ప్రజలకు శాంతిని అందించే తత్వము హిందుత్వములోనే ఉంది' అని పలువురు ఆ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థితంగా హిందుత్వ ఆలోచనలు ప్రచారం చేయాలని నిర్ణయించారు.  
 
ప్రపంచ హిందూ పరిషత్ (World Hindu Parishad) ఒక గొడుగులాంటి సంస్థ.  ఇది బాలి కేంద్రంగా పనిచేస్తున్నది. ఈ రోజు ప్రపంచానికి శాంతిని అందించగలిగే ఆలోచనలు, విశ్వజనీన భావనలు హిందుత్వంలోనే ఉన్నాయి.  
 
ఈ మధ్య ఇండోనేషియా ప్రభుత్వం అమెరికాకు ఒక పెద్ద సరస్వతీ మాత విగ్రహాన్ని ఇచ్చింది. అమెరికాలో దానిని ప్రతిష్ఠించారు కూడా. ఇంకా అనేక దేశాలలో మన పద్ధతులలో జ్యోతి ప్రజ్వలన చేయటం, శాంతి మంత్రాలతో, వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభించటం జరుగుతున్నవి. మనదేశంలో నడుస్తున్న సెక్యులర్ రాజకీయాలు అటువంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. ఈ దేశంలో అనేకమంది సాధుసంతులు నిరంతర పర్యటన చేస్తూ మన ఆలోచనలు ప్రపంచానికి అందిస్తున్నారు. ప్రపంచంలో శాంతికి కృషి చేస్తున్నారు. ఈ పనులు ఇంకా వేగంగా జరగవలసిన అవసరం ఉంది.