"ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా...."

వివేక సూర్యోదయం - ధారావాహికం - 23
 
నరేంద్రుడు వివేకానందుడైన విధం - 3


పలువురు ప్రముఖుల కోరిక మేరకు మైసూరు మహారాజా వారి ఆర్థిక సహకారంతో వివేకానందుడు 1893 జూలైలో చికాగో చేరుకున్నాడు. 1893 సెప్టెంబర్ 11న ఆయన విశ్వమత మహాసభలో ప్రసంగించారు. వివిధ దేశాల నుండి ప్రతినిదులు వచ్చారు. అందరూ మాట్లాడారు.  వారంతా లేస్తూనే 'లేడీస్ అండ్ జంటిల్మన్' అని సంబోధించారు.

వివేకానంద స్వామి మాట్లాడవలసిన సమయం వచ్చేసింది. స్వామీజీ సరస్వతి మాతను, గురువైన రామకృష్ణుల వారిని ప్రార్థించి లేచి నిలబడి "ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా" (Dear brothers and sisters of America) అంటూ ప్రసంగం ప్రారంభించారు. సభలోని ప్రతినిధులంతా లేచి నిలబడి ఆనంద పారవశ్యంతో 2 నిమిషాల పాటు చప్పట్లు చరిచి వారి హర్షద్వానాలను తెలియచేశారు.  సోదర 'సోదరీమణులారా' అనే సంబోధన వినబడటం వారికి పూర్తిగా కొత్త. ఆ సంబోధన వారిని మంత్రముగ్ధులను చేసింది. వివేకానందునికి అతుక్కుపోయేలా చేసింది. అలా స్వామీజీ హృదయం నుండి వచ్చిన మాటలతో మొదటి వాక్యంతోనే భారత విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రపంచ ప్రజలకు పరిచయం చేసినట్లైంది.

న్యూయార్కు హెరాల్డు పత్రిక ఆయన్ను తుఫాను సన్యాసిగా వర్ణించింది. తరువాత అమెరికాలో ఆయన ఉపన్యాసాలు కొనసాగాయి. తరువాత ఆయన ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు వెళ్లారు. ప్రపంచ దేశాలలో వేదాలపట్ల, యోగశాస్త్రం పట్ల, సంస్కృతం పట్ల భారతదేశపు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని రగిల్చాడు. భారత ప్రజలలో స్వాభిమానం పెల్లుబికింది. స్వాతంత్ర్యోద్యమం ఊపందుకుంది. అమెరికాలో సుఖవంతమైన శయ్యమీద ఆయనకు నిద్ర పట్టేది కాదు. భారతదేశం వైపు చూస్తూ తన దేశ ప్రజల పేదరికాన్ని తలచుకుంటూ ఆయన కన్నీరు మున్నీరై శయ్య దిగి, కటిక నేల మీద పడుకొని నిద్రించేవారు.

భారత్ కు తిరిగి వచ్చిన తరువాత స్వామి సముద్రతీరంలో ఇసుకను ఒంటిమీద పోసుకుంటూ భోగదేశాల నుంచి వచ్చినందుకు తనను తాను ప్రక్షాళన చేసుకుంటున్నానన్నారు. కొలంబో నుండి అల్మోరా వరకు అనేక ప్రసంగాలు చేశారు. కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు స్వామీజీ సేవలందించారు. అంటరానితనాన్ని నిరసించారు. సౌశీల్యాన్నిచ్చే విద్య కావాలన్నారు. తనలో తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడన్నారు. విద్యాధికులైన ప్రజలు పీడిత తాడిత ప్రజలనాదుకోవాలన్నారు. స్త్రీ జగన్మాత స్వరూపమన్నారు. 1897లో రామకృష్ణ మఠం స్థాపించారు. వివేకానందుని శతజయంతి సందర్భంగా 1962-70 మధ్య కన్యాకుమారిలో సముద్రమధ్యంలో వివేకానంద శిలాస్మారకం నిర్మాణమైంది. వివేకానంద కేంద్రం ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది.

వివేకానందుని అనుసరించడమే ఆయనకు నిజమైన నివాళి 

- హనుమత్ ప్రసాద్

'వివేక సూర్యోదయం' శీర్షిక ఇంతటితో ముగిసింది.