శేషాచలంలో మంటలు

ప్రభుత్వ అసమర్ధతకు పరాకాష్ట

 
 
తిరుమల శ్రీనివాసుడి సన్నిధికి సమీపంలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు నానా తంటాలూ పడడం ప్రభుత్వ యంత్రాంగపు అసమర్ధతను మరోసారి బట్టబయలు చేసింది. అడవి దొంగలు విచ్చలవిడిగా ఎర్రచందనం దుంగలను దోచుకెళ్లడాన్ని కట్టడి చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యిందనే ఆరోపణలను ప్రభుత్వం ఇప్పటికే ఎదుర్కొంటున్నది.

శేషాచలం అడవుల్లో చెలరేగిన మంటలను ఆరంభంలోనే అదుపులోకి తీసుకురాలేకపోవడంతో అటవీ ప్రాంతంలో జీవవైవిధ్య సంపద భారీ స్థాయిలో అగ్నికి ఆహుతి కావడమే కాక, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు కూడా ప్రమాదం ఏర్పడే స్థితి దాపురించింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిని కేంద్రానికి వివరించారు. తిరుమల క్షేత్రానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. దీంతో కేంద్రం అటవీ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులను, అలాగే సహాయ చర్యల కోసం సైన్యాన్ని పంపింది. అడవిలో రేగిన మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లను పంపించాలని ఈ సందర్భంగా గవర్నర్ కేంద్రాన్ని అభ్యర్థించారు. ఆ ప్రకారం తిరుమలకు చేరుకున్న హెలికాప్టర్లు ఏరియల్ సర్వే నిర్వహించి, మంటలను ఆర్పే చర్యల్లో పాల్గొన్నాయి. మంటలను అదుపు చేయడం కోసం గోగర్భం, కుమార ధార, పసుపుధార జలాశయాల్లోని నీటిని వినియోగించారు.

 
 
ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా తిరుమల దేవాలయం ఉపరితల భాగంలో హెలికాప్టర్లు సంచరించకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో ప్రకృతి విపత్తుల నివారణ దళం, జాతీయ విపత్తు నియంత్రణ మండలి సిబ్బంది కూడా తిరుమలకు చేరుకుని రసాయనాలు, ఫోమ్ ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

ఈ వ్యవహారంలో అధికారులు ఆలస్యంగా స్పందించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే అప్రమత్తమై ఉంటే భారీ ప్రమాదాన్ని నివారించి ఉండేవారని చెబుతున్నారు.