పాకిస్తాన్ ను దారికి తెచ్చుకోవడం ఎలా?


మనం ఎవరి చేతిలోనైనా ఒకసారి మోసపోతే అది మోసం చేసినవాడి తప్పు. పదే పదే వాడి చేతిలోనే మోసపోతే మాత్రం తప్పు మోసపోయిన వాడిదే.

పాకిస్తాన్ మనదేశంపై పరోక్ష యుద్ధం చేస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషించి నిరంతరం భారత్ పై ఉసిగొల్పుతూనే ఉంది. తన కిరాయి ముష్కర మూకలతో నిరంతరం దాడులు చేయించి అమాయకులైన భారతీయుల ప్రాణాలను తీస్తూనే ఉంది. దీనికి పాక్ ను తీవ్రంగా దండించవలసింది పోయి దండాలు పెడుతున్నారు మన నాయకులు. పాక్ పాలకుల కంటే ముందుగానే మన నేతలే శాంతి వచనాలు పలుకుతూ దానికి స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు. ఇలా అందించిన ప్రతిసారి దాని చేతిలో ఘోరంగా మోసపోతూనే ఉన్నారు.

గత నెల చివరి వారంలో మన ప్రధాని మన్మోహన్ సింగ్ ఐక్యరాజ్యసమితి సమావేశాల నిమిత్తం అమెరికాలో పర్యటించారు. పనిలో పనిగా అక్కడకు విచ్చేసిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సైతం భేటీ కావాలని నిశ్చయించారు. అంతే ! సరిగ్గా ఈ భేటీకి కొన్ని గంటల ముందే పాక్ ప్రేరిత ఉగ్రవాద మూకలు జమ్మూకాశ్మీర్ లోని అమాయక ప్రజలపై, సైనికులపై విరుచుకుపడ్డాయి. మన్మోహన్ భారత్ కు చేరుకోకముందే మళ్లీ సరిహద్దుల్లో దాడులు ప్రారంభమైనాయి. ఈ వ్యాసం వ్రాసే సమయానికి ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

సైనికు దుస్తులలో వచ్చిన ముష్కరులు మొదట కథువా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అక్కడ ఐదుగురు పోలీసులను హతమార్చారు. ఆ తరువాత అక్కడి నుండి ఓ ట్రక్కును ఆపి దాని క్లీనర్ ను చంపేశారు. డ్రైవర్ ను బెదిరించి సాంబా సెక్టర్ లోని ఆర్మీ క్యాంపుపై దాడిచేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు అమరులయ్యారు. వీరిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారు. వెంటనే తేరుకున్న సైన్యం క్యాంప్ లో చొరబడిన ముగ్గురు ముష్కరులను కాల్చివేసింది. 

ఇలాంటి దాడి ఘటనలు కాశ్మీర్ తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో గత రెండు దశాబ్డాలుగా జరుగుతూనే ఉన్నాయి. అయినా మన పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లే    దు. లౌకికవాద ముసుగులో తమ ఓట్ బ్యాంకును కాపాడుకొనే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే జమ్మూకాశ్మీర్ సిఎం దాడి ఘటనలో పాక్ ప్రమేంపై ఇంకా నిర్ధారణకు రాలేమని పాతపాటే పాడారు. దీనికి కొందరు కేంద్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కారు. పాక్ దాడిని ఖండిస్తూనే ఇలాంటి దాడులు మళ్లీ మళ్లీ జరిగితే 'ఖబడ్దార్ పాకిస్తాన్' అని ఒక్క హెచ్చరిక చేయలేకపోయారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో జరిగిన కాశ్మీర్ యుద్ధంనాటి నుండి మొన్నటి కార్గిల్ వార్ వరకు మన సైన్యం చేతిలో పాక్ ఘోరంగా ఓడిపోయింది. అయితే యుద్ధం తరువాత జరిగిన చర్చల్లో మాత్రం పాకిస్తాన్ ది పైచేయిగా మారుతున్నది. దీనికి ప్రధాన కారణం మన పాలకుల చేతకానితనమే. యుద్ధంలో విజేతలుగా నిలిచిన మనం పాక్ వెన్ను విరిచి దాన్ని మన కాళ్లబేరానికి వచ్చేలా చేయడంలో మన పాలకులు ఘోరంగా విఫలమయ్యారు.  

వారికి దృఢసంకల్పంతోపాటు వ్యూహరచన లేదనే చెప్పాలి. ఈ తాజా దాడి తరువాత కూడా మన ప్రధాని మన్మోహన్ సింగ్ పాక్ ప్రధాని కంటే ముందే స్పందించారు. ఈ దాడి నవాజ్ షరీఫ్ తో జరిగే భేటీపై ప్రభావం చూపబోదని ప్రకటించారు. 

ఇక భారత్ పాక్ లకు చెందిన విలేకరులతో మాట్లాడుతూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ ను 'దేషీఔరత్' అంటూ సంబోధించారని ఓ పాక్ రిపోర్టర్ ట్విట్టర్ లో దుమారం లేపాడు. నవాజ్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మన దేశ ఇంగ్లీష్ మీడియా జర్నలిస్టులు కూడా ఉన్నారని పేర్కొన్నాడు. అయితే ఆ తరువాత పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో తాను అలా అనలేదని పాక్ ప్రధాని వివరణ ఇచ్చుకున్నారు.

ఇక చర్చల్లో పాక్ దురాగతాలపై షరీఫ్ ను నిలదీశానని ప్రధాని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పడు దేశానికి నిలదీసే ప్రధానికంటే పాక్ వెన్ను వంచి దారికి తెచ్చుకునే దక్షత, నేర్పు, వ్యూహరచన, దృఢసంకల్పం ఉన్న ప్రధాని కావాలి. అప్పుడే పాక్ మన దారికి వస్తుంది.

- నారద