ఔన్నత్యంలో భారత్ అగ్రరాజ్యం


స్వామి వివేకానంద 150వ జయంతి సభలో శ్రీ గురుమూర్తి 
 
సభలో ప్రసంగిస్తున్న శ్రీ గురుమూర్తి
 
ప్రపంచంలోనే అనుబంధాలతో కూడిన సామాజిక కుటుంబ వ్యవస్థ భారత్ లోనే ఉందని, ఔన్నత్యంలో భారత్ అగ్రరాజ్యమని, భారత్ కు సమానమైన దేశం ఏదీ ప్రపంచంలో లేదని ప్రఖ్యాత సామాజిక, ఆర్థిక నిపుణుడు శ్రీ ఎస్.గురుమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 'భారత సుస్థిర అభివృద్ధికి స్వామి వివేకానంద సామాజిక ఆర్థిక ఆలోచనలు' అన్న అంశంపై శనివారం రాత్రి రామకృష్ణ మఠంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ గురుమూర్తి భారతదేశ ఔన్నత్యంపై అద్భుతంగా ప్రసంగించారు. సభకు ప్రఖ్యాత ఆర్థికవేత్త శ్రీ కె.నర్సింహమూర్తి అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో రామకృష్ణమఠం సంచాలకుడు పూజ్య శ్రీ స్వామి బోధమయానంద మహరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ విసి ప్రొఫెసర్ టి.తిరుపతిరావు, హెచ్.ఎం. టి.వి. సంపాదకుడు శ్రీ కె.రామచంద్రమూర్తి, జయంతి ఉత్సవ కార్యదర్శి శ్రీ బి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.

భారతదేశ ఔన్నత్యానికి సరితూగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, తాజా నివేదికల ప్రకారం 2030 నాటికి ప్రపంచంలోని మూడు అగ్రరాజ్యాల్లో భారత్ కూడా ఉంటుందని, దానికి కారణం దేశంలోని ఆర్థిక వ్యవస్థను సామాజిక భూమిక పరిపుష్టం చేస్తుంది, సామాజిక వ్యవస్థను ఆధ్యాత్మిక వ్యవస్థ పరిపుష్టం చేస్తుందని శ్రీ గురుమూర్తి పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న పటిష్టమైన జాతీయ సామాజిక సమరసత ఎవరికీ అర్థం కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 200 సంవత్సరాల నుండి భారత్ లో ఆర్థిక పురోగతి, పరిస్థితులను, విదేశీ విశ్లేషకుల అంచనాలను, వాస్తవ స్థితిని వివరించారు.

చాలామంది భారత్ లో ఔన్నత్యాన్ని గుర్తించకపోవటం వల్ల ఈ దేశం ఎన్నటికీ ఎదగదని పేర్కొన్నారని, వారి అంచనాలు ఏనాడో తప్పాయని అన్నారు. వివేకానందుడు రెండు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం పొంది, ప్రపంచాన్ని కట్టిపడేశాడని, భారతీయ ఆధ్యాత్మిక పునాదులు చాలా పటిష్టమైనవని అన్నారు. భారత్ ఎప్పుడూ ఎదుగుతూనే వచ్చిందని, అయితే ఈ దేశాన్ని బాగుచేయడం ఎవరితరం కాదని చాలామంది పాశ్చాత్యులు చెప్పారని పేర్కొన్నారు. గతిశీల ప్రభావం ఉన్న దేశాలు మాత్రమే ఎదుగుతాయని, భారత్ కు అలాంటి తత్వం లేదని చెప్పారని, కాని భారత్ తాత్వికతను అంచనా వేయలేకపోయారన్నారు. భారతీయ రైల్వేశాఖ ఒకరోజులో దాదాపు ఒక రష్యాను (రష్యాలో ఉన్న మొత్తం జనాభాకు సమానమైన జనం) మోసుకుపోతున్నదని, అంత పెద్ద వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ఒక వ్యక్తి ఎలా అదుపు చేయగలుగుతాడని ప్రశ్నించారు. తపాలా శాఖ కేవలం మనియార్డర్లను ఇవ్వడమే కాదని, మనియార్డర్ తీసుకున్నప్పుడు వ్యక్తికి-సిబ్బందికి మధ్య ఉండే ఆదరణ, అభిమానం, ప్రేమ మరే దేశంలో ఉండవని, ఇలాంటి వాటిని ప్రభుత్వ ఉత్తర్వులతో సాధించలేమని శ్రీ గురుమూర్తి అన్నారు.

అమెరికాలో ప్రతి అంశం ప్రైవేటీకరించారు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థను కాపాడటంలో ఆ దేశ ప్రభుత్వం తలమునకలై ఉంది. తల్లిని ప్రభుత్వ జీవోలతో రూపొందించగలమా? అని ప్రశ్నించారు. మన దేశంలో అనేక శాఖలను ప్రైవేటీకరించినా, సామాజిక వ్యవస్థ పటిష్టంగా ఉందని భవిష్యత్ కు అదే పెద్ద పునాది అని శ్రీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన గత రెండు వందల సంవత్సరాలలోని ఆర్థిక వేత్తలు, సామాజిక వేత్తల పరిశోధనలను, పుస్తకాలను, వారి వివరణలను, ఫలితాలను ఉటంకించారు. భవిష్యత్తులో పోటీ భారత్-చైనా మధ్యనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో కుటుంబ వ్యవస్థ చిద్రమైపోయిందని, వారు ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారని, భారత్ లో కుటుంబ వ్యవస్థ మరింత పటిష్టమై ఆదాయ పరిమితికి లోబడి మాత్రమే వ్యయం చేస్తున్నారని, మిగతాది పొదుపు చేస్తుంటారని అన్నారు. ఆసియా దేశాలు ఆదా చేసి ఇస్తుంటే అమెరికా అప్పు తీసుకుని సోకు చేసుకుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కె.నర్సింహమూర్తి మాట్లాడుతూ -'జాతి ఔన్నత్యం మీద దాడి చేసి జాతిని నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతోందని, సుస్థిరమైన అభివృద్ధి, సుస్థిరమైన స్వభావంతోనే వస్తుందన్నారు. 
 
ఈ సందర్భంగా 'సోదరి నివేదిత" అనే గ్రంథాన్ని శ్రీ గురుమూర్తి ఆవిష్కరించారు.
 
'సోదరి నివేదిత' అనే తెలుగు గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ గురుమూర్తి, ఇతర పెద్దలు