ఉచితం కాదు అనుచితం...

మన రాజకీయ నాయకుల నోట ఎప్పుడు ఒక్క మంచి మాట రాదు. కాని అటువంటి మంచి మాటలు ఈమధ్య మన కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు.  
విజ్ఞానశాస్త్రం మరియు పరిసర వాతావరణ అధ్యయన సంస్థ (CSE) క్రొత్త ఢిల్లీలో 10.02.2014న నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా ఒక కఠిన వాస్తవాన్ని వెల్లడించారు. 
ఆయన మాటల్లోనే : "ఉచితంగా విద్యుత్ ఇవ్వడం అనేది ఒక తెలివి మాలిన పని. ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ గాని మరే ఇతర వస్తువులు గాని ఉచితంగా అందించరాదు. అలా చేయడం ప్రజలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసినట్లుగా ఉంటుంది. ఒకసారి 'ఉచితానికి' అలవాటు పడితే ప్రజలు మళ్లీ మళ్లీ ఉచితం కావాలంటారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలప్పుడు ఈ ఉచితాల సమస్య పునరావృతం అవుతున్నది'.  
ఈ ఉచితాల ప్రకటనల విషయంలో ప్రజలు ఫరూక్ అబ్దుల్లాను సమర్ధించవలసిందే. కొన్ని పార్టీలు టి.వి.లు, యాంత్రిక రుబ్బు రోళ్ళు, కంప్యూటర్లు వంటి వాటిని ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేస్తాయి. ఇటువంటివి లంచం ఇవ్వడంగా పరిగణించి ఖండించాలి.  
ఇటీవల ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ "ఉచితంగా ఇస్తామనే పార్టీలు ఏ విధంగా ఇవ్వగలవో, ధనం ఎక్కడి నుంచి వస్తుందనే విషయం స్పష్టం చేయాలి' అని చెప్పింది. రాబోయే ఎన్నికలలో మనం దేశహితం కోసం ఓటు వేద్దాం. దేశభక్త ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం.
- ధర్మపాలుడు