ప్రపంచం మార్పు కోరుకుంటున్నది

వివేక సూర్యోదయం - ధారావాహికం - 19 


సెప్టెంబర్ 11 చికాగో మత సమ్మేళనంలో వివేకానందుడు మొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజు అయిన సందర్భంగా ప్రత్యేకం 

వివేకానందుని ఆలోచనలు ఈ రోజుకి అనుసరణీయం. పారిశ్రామిక విప్లవం తరువాత పాశ్చాత్య దేశాలవాళ్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. వారు వెళ్లిన దేశాలలో కేవలం వ్యాపారం చేసుకోవటమేకాదు, ఆ దేశాల పాలనను చేజిక్కించుకున్నారు. ఇస్లాం ప్రపంచదేశాలను ఎట్లా సర్వనాశనం చేసిందో పాశ్చాత్యులు కూడా ఆ దేశాలను అట్లా చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత ఇస్లాం లాగానే తామే ప్రపంచంలో గొప్పవాళ్లము, తమ మతమే గొప్పదని చాటుకొనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమే అమెరికాలో ఏర్పాటు చేసిన ప్రపంచ మతమహాసమ్మేళనము. ఆ సమ్మేళనంలో ప్రపంచంలోని అన్ని మతాలకంటే క్రైస్తవమే గొప్పదని ప్రకటించేందుకు ఒక నోట్ కూడా తయారుచేసి పెట్టుకున్నారు. ఆ సమ్మేళనంలో వాళ్ల ఆశయం నెరవేరకపోగా ప్రపంచానికి ఒక సకారాత్మకమైన సందేశం ఇవ్వబడింది. ప్రపంచంలో పురాతనమైన, అజేయమైన శక్తి, జ్ఞానం కలిగిన దేశం నుండి 30 సంవత్సరాల యువకుడు స్వామి వివేకానంద ఆ సభ యొక్క నిర్ధారిత చర్చనీయాంశాన్ని పూర్తిగా మార్చివేశాడు. స్వామి వివేకానంద ప్రఖర హిందుత్వజాతీయవాది. అసాధారణ వ్యక్తిత్వం, గొప్ప దార్శనికుడు. ఆ సభలో ప్రపంచమంతటికి ఒక ఆత్మీయ అనుభూతిని అందించాడు.

స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసమిచ్చి నేటి సెప్టెంబర్ 11కు 120 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 120 సంవత్సరాల కాలఖండంలో ప్రపంచం అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో చాలా అభివృద్ధి సాధించింది. చంద్రమండలానికి వెళ్లివచ్చింది. 

తెలుగు సినిమాలో ఒక పాట ఉంది. "మనుష్యుడు హిమాలయాలలో జెండా పాతాడు, ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేసాడు, చేస్తున్నాడు. అయినా మనిషి మారలేదు" అని. శాస్త్రజ్ఞానం ఎంత పెరిగినా ప్రపంచంలో 'తాము మాత్రమే గొప్పవాళ్లం' అనే వాదనలో మాత్రం ఏ మార్పు రాలేదు. ఆధిపత్య పోరుకూడా సాగుతున్నది. ప్రపంచం ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు చవిచూసింది. మూడవ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో చిక్కుకొని ఉంది.  ఉగ్రవాదము పెరిగిపోయింది. ఈ పరిస్థితులలో మార్పు రావాలని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది. ఇక్కడే మనం స్వామి వివేకానందుడు బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.

ఈ రోజున భారతదేశంలోను, ప్రపంచంలోను ఆధ్యాత్మిక జ్ఞానం వెల్లివిరుస్తున్నది. మతానికి, ఆధ్యాత్మికతకు ఉన్న తేడాను కూడా ఈ రోజున ప్రపంచం గుర్తిస్తున్నది. వివేకానందుడు కోరినట్లు అన్ని మతాల సారం ఒక్కటేననే విషయం అంగీకరిస్తున్నది. ఇస్లాం, క్రైస్తవాలు చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆ రెంటికి దూరం జరుగుతున్న వారి సంఖ్య కూడా చాలా పెరిగింది. ఈ రోజున సంస్కృతం, వేదాలు, ఉపనిషత్తుల అధ్యయనం చాలా పెరిగింది. ఎక్కడైతే ప్రపంచం మందగమనమవుతుందో అక్కడ నుండి ముందుకు పోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఈ రోజున ప్రపంచం దానిని అందిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నది. అనుష్ఠాన వేదాంతాన్ని బోధించిన శ్రీ వివేకానందుడు యువకులకు ఆదర్శప్రాయమైనాడు. వివేకానందుడు ఏ మతాన్ని, ఏ సిద్ధాంతాన్ని కించపరచలేదు. సత్యాన్వేషణే మనమతం అని బోధించాడు. విలువల పతనం జరుగుతున్న ఈ వేళ వివేకానందుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విలువలు మనిషిని ఉన్నత శిఖరం వైపు తీసుకొని వెళ్తాయో వాటిని మనం పాటించాలి. ప్రపంచంలో ఏ మతం వాళ్లు తమ మతాన్ని మార్చుకోవలసిన అవసరం లేదని వివేకానందుడు చెప్పాడు. మానవతా విలువలను నిలబెట్టేందుకు కృషి చేయాలని హితవు చెప్పాడు. తద్వారానే ప్రపంచశాంతి వెల్లివిరుస్తుందని చెప్పాడు. 

- మల్లిక్