కాంగ్రెస్ ను వదిలించుకొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా?


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ తన సొంతబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేని తీర్పు ప్రజల నుండి వచ్చింది. బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత చూపించిన నేపథ్యంలో ఆమ్-ఆద్మీ పార్టీకి ప్రభుత్వం ఏర్పటు చేయక తప్నని పరిస్థితి ఏర్పడింది. ప్రారంభంలో కొంత వెనుకడుగు వేసినా తప్పని పరిస్థితిలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావలసివచ్చింది. చివరకు అంగీకరించి రామ్ లీలా మైదానంలో వేలాది ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేసారు.

అరవింద్ కేజ్రీవాల్ ఏ కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేసాడో ఆ కాంగ్రెస్ సమర్థనతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. కాకలు తీరిన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎంతకాలం నడవనిస్తుందో, రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.  అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? కొద్ది రోజులు గడిస్తే కాని తెలియదు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. దేశంలో ప్రజలు అవినీతితో అధికార దాహంతో విసిగిపోయిన సందర్భాలు గతంలో కూడ చూసాము. అప్పటికి ఇప్పటికి ఒకటే తేడా. 18 సంవత్సరాల వయస్సు నిండిన యువత అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రభావంతో రోడ్డు ఎక్కింది. ఇది మంచి పరిణామమే. అయినా గతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి.

ఇందిరాగాంధీ ఎన్నికను కొట్టేసినప్పుడు దేశంలో ఎమర్జెన్సీని విధించి తన అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తే ప్రజలు ఇందిరాగాంధీతో సహా కాంగ్రెసు నాయకులను ఓడించి జనతా పార్టీకి అధికారం కట్టబెట్టారు. బోఫోర్స్ కుంభకోణంతో విసిగిపోయిన జనం కాంగ్రెసును మళ్ళీ ఓడించి సంకీర్ణ రాజకీయాలకు తెరలేపారు. ఆ తదుపరి జరిగిన పరిణామాలు మనందరికి తెలుసు. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అవినీతి కాంగ్రెసును వదిలించుకొనేందుకు ప్రజలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. ప్రజలు శాశ్వతమైన మార్పు కోసం సిద్ధమవాలి.  అందుకు రాబోవు పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనవి.

- మల్లిక్