మూత్రములో రాళ్లను ఇలా నివారించండి

గృహ వైద్యము - 18
 
 
మూత్రములో రాళ్లు 
  • వేపాకును కాల్చి భస్మము చేసి, పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున నీళ్లలో కలుపుకొని రెండు పూటలా త్రాగిన మూత్రములోని రాళ్లు కరిగిపోవును. 
  • అరకిలో పెసరపప్పును ఒక లీటరు నీళ్లలో కలిపి కాచి పైన తేరిన 'కట్టు' త్రాగుచుండిన మూత్రములోని రాళ్లు పడిపోవును. 
  • యవక్షారము, బెల్లము సమభాగములుగా కలిపి రోజుకు ఒకసారి 2 గ్రాములు చొప్పున వారము రోజులు తినిన రాళ్ళు కరిగి పడిపోవును. దీనిని బూడిద గుమ్మడి రసముతో తీసుకొనిన రాళ్ళు వెంటనే పడిపోవును. 
  • కానుగ పప్పు పావుతులము (3 గ్రాములు) పొడిచేసి 50 నుంచి 60 మి.లీ. దేశవాళి ఆవుపాలలో కలిపి త్రాగుచుండిన మూత్రములో రాళ్ళు పడిపోవును. 
  • ఎండాకాలములో త్రవ్వి తెచ్చిన మాలతీ వేరును చితకకొట్టి (కల్కము చేసి) 25 గ్రాములు తీసుకొని 200 మి.లీ. పాలలో వేసి కాచి, ఆ పాలను ప్రతిరోజు ప్రాత:కాలమున త్రాగుచుండవలెను. అట్లు చేసిన మూత్రములోని రాళ్లు కరిగిపోవును. 
  • సీమ గోరింట విత్తులు 1  నుండి 2 గ్రాములు ప్రతిరోజు ప్రాత:కాలమున మంచినీళ్లతో తీసుకొనవలెను. 
  • పత్రబీజపు ఆకు రసము 6 గ్రాములు తీసుకొని 13 గ్రాముల కాచిన వెన్నతో కలిపి ప్రతిరోజు త్రాగుచుండిన ఈ వ్యాధి హరించును. ప్రొద్దు తిరుగుడు చెట్టు వేర్ల పొడిని 25 గ్రాములు తీసుకొని ఒక లీటరు తీయని మజ్జిగలో కలిపి త్రాగుచుండిన మూత్రములో రాళ్ళు హరించును.

మూత్రము కష్టముగా వెడలుట
బార్లి గింజలను గంజిలాగా వండి ఆ గంజిలో కొద్దిగా చక్కెర కలిపి సేవించుచుండిన ఎండాకాలములో మూత్రము కష్టముగా వెలువడుట నివారించబడును.
 
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..