రహీల్ షరీఫ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి


కలియుగాబ్ది 5116 , శ్రీ జయ నామ సంవత్సరం,
  వైశాఖ మాసం
 
పాకిస్తాన్ సైన్యాధిపతి రహీల్ షరీఫ్ రావల్పిండిలో జరిగిన "మృతవీరుల సంస్మరణ" కార్యక్రమంలో మాట్లాడుతూ 'కాశ్మీర్ పాకిస్తాన్ మెడలో నెత్తురు ఓడే నరం లాంటిది. కాశ్మీర్ సమస్యకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలకు, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కారం సాధించాలి' అని వ్యాఖ్యానించారు. శాంతిని మేము ఎంతగా కోరుకుంటామో యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు అంతగా సిద్ధమని చెబుతూ కాశ్మీరీ ప్రజల త్యాగాలు నిష్ఫలం కావని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యపై కేంద్రమంత్రి చిదంబరం స్పందిస్తూ "ఈ వ్యాఖ్య క్రొత్తదేమీ కాదు. గతంలో అనేకసార్లు ఇలాగే మాట్లాడారు. మేము పెద్దగా పట్టించుకోము" అని అన్నారు. 
 
బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ "కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం, కాశ్మీర్ సమస్య అంటే పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని విముక్తం చేయడమే. ఈ విషయంపై 1994 సంవత్సరంలో భారత పార్లమెంట్ ఉభయ సభలు ఏకగ్రీవంగా తీర్మానం చేసాయి. పాకిస్తాన్ సైనికాధికారి కాశ్మీర్ పై వ్యాఖ్యానించడం ఉభయ దేశాల మధ్య సంబంధాలను ప్రశ్నించడమే. పాకిస్తాన్ మొట్టమొదట తన దేశాన్ని చక్కగా దిద్దుకోవాలి. ఉగ్రవాదుల నుంచి తమ దేశాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించడం మంచిది" అన్నారు. 
 
రహీల్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు క్రొత్తవి కాకపోవచ్చు. ఇది భారత్ లో 16వ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయం. ఈ సమయంలో మొన్నటికి మొన్న చెన్నై రైల్వేస్టేషన్ లో బాంబు పేలుడు సంఘటన చోటుచేసుకోవటం, దానికంటే ముందు ఐ.ఎస్.ఐ. ఉగ్రవాదిని చెన్నై పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవటం, ఆ ఉగ్రవాది చెప్పిన ప్రకారము అనేక బాంబు దాడుల పథకం బయట పడటం, దాని విషయంలో చర్యలు తీసుకొంటున్న సమయంలో రైల్వే స్టేషన్ లో బాంబు ప్రేలుడు జరగటం జరిగింది. 
 
పాకిస్తాన్ వాళ్లు మాటలు చేతల్లో చూపించి మాట్లాడుతుంటే మనవారు ఉదాసీనంగా వ్యవహరించటమే అసలు సమస్య. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నకాశ్మీర్ విముక్తం కావటం అన్నారు, బాగానే ఉంది. కాని చేతల్లో 1994 నుంచి ఇప్పటివరకు ఏమి చేసారనేది ప్రశ్న. ఏమైనా చర్య తీసుకొంటే భారత్ లోని ముస్లిం మైనార్టీలు బాధపడతారని ఆలోచిస్తున్నారా? లేక ఏమైనా అంతర్జాతీయ వత్తిడి ఉన్నదా? లేక ఉదాసీన వైఖరా? స్పష్టం చేయాలి. 
 
ఏది ఏమైనప్పటికి కాశ్మీర్ సమస్య గురించి భారత్ ఇప్పటికే ఎంతో మూల్యం చెల్లించింది. ఇంకా చెల్లిస్తున్నది. ఇది ఇంకా ఎంతకాలం సాగుతుందో?