కంచి శంకరాచార్యపై ఇంతటి కుట్రకు పాల్పడినవారెవరు?


తొమ్మిది సంవత్సరాలపాటు సాగిన కంచి కథకు ఎట్టకేలకు నవంబర్ 26వ తేదీన పుదుచ్చేరి ప్రత్యేక కోర్టు ముగింపు పలికింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వామీజీ జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ నిర్దోషులని కోర్టు తీర్పు చెప్పింది. మొత్తం 24 మంది నిందితులలో ఒక నిందితుడు 2013 మార్చిలో చెన్నైలో హత్యకు గురవగా మిగిలిన 23 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు జస్టిస్ మురుగన్ ప్రకటిస్తూ తీర్పునిచ్చారు.

ఈ తీర్పు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. శంకర్ రామన్ ను హత్య చేసింది ఎవరు? 9 సంవత్సరాలు విచారణ చేసిన తరువాత కూడా అసలైన హంతకులను ఎందుకు పట్టుకోలేదు? ఇక రెండవ ప్రశ్న. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అందరూ గౌరవించే కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములను అక్రమంగా నిర్బంధించి, కేసులో ఇరికించి వారి గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చటానికి పన్నిన వ్యూహంలో భాగస్వాములు ఎవరు? హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కేసులు నడిపించిన తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు ఏమి చెప్పింది? ఏమి చెబితే, ఎంత చెబితే పోయిన స్వామీజీల గౌరవం తిరిగి వస్తుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, కోర్టు, విచారణ యంత్రాంగం, మీడియా ఏమి సమాధానం చెబుతుంది?

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామికి, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మధ్య మీడియా కూడా గుర్తించని వైరం ఏదో ఉండి ఉంటుందని ఆ సమయంలో (2004లో) వార్తలు వచ్చాయి. ఆ కక్షసాధింపు చర్యలో భాగంగా ఈ ఘాతుకం జరిగి ఉంటుందా?

2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలమూరు జిల్లాలో తెల్లవారితే దీపావళి పండుగ అనగా అర్థరాత్రి పూట పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఆ సమయంలో ''అర్థరాత్రి చడీచప్పుడు కాకుండా నిర్బంధించటానికి నేనేమైనా వీరప్పన్ నా?'' అని స్వామీజీ పోలీసులను ప్రశ్నించారు. తెల్లవారితే దీపావళి పండుగ అనగా అభియోగాలపై అభియోగాలు మోపి బెయిల్ పై త్వరగా బైటపడకుండా కూడ చూసారు. చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అనేక తప్పులు చేసింది.  ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును జ్ఞాపకం చేసుకొంటే ఒక్కసారిగా మనస్సు కలుక్కుమంటుంది. 80 కోట్లకు పైగా జనాభా ఉన్న హిందూ సమాజం, హిందూ సంస్థల నాయకులు దీనిపై వెంటనే ఏమీ చేయలేకపోయారు...!? రాజకీయ అధికారం ముందు ఏమీ తోచనివారయ్యారా? అటువంటి పరిస్థితులు ఎందుకు నిర్మాణమయ్యాయి? ఆలోచించవలసిన అవసరం మనందరకు ఉంది.

నిర్ధారణగా ఇది అని చెప్పలేము గాని, ఒక్కసారి గతంలోకి వెళితే కొన్ని విషయాలు, కొన్ని చేదు నిజాలు మనకు జ్ఞాపకం వస్తాయి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోప్ జాన్ పాల్-2 భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోప్ జాన్ పాల్ చేసిన వ్యాఖ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. "ఆసియా ఖండం, అందులో భారతదేశం కోతకు సిద్ధంగా ఉంది" - అంటే భారతదేశాన్ని క్రైస్తవదేశంగా చేయటానికి అనువుగా ఉంది అని ప్రకటించారు. దేశంలో క్రైస్తవ ప్రాబల్యం పెరిగితే దానిని నిరోధించేది, ఎదుర్కొనేది హిందూ సమాజంలోని సాధుసంతులు, సంఘము, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు. వాటి గౌరవ ప్రతిష్ఠలను సమాజంలో దిగజార్చాలని నిర్ణయించారా? అందుకే ఈ పథకం రచించబడిందా?

కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకం అమలులో భాగంగా ఈ అరెస్టులు, స్వామీజీల మీద, సంఘం మీద దాడులు, ఆరోపణ పర్వాలు సాగుతున్నాయా? ఇవి ఏవి హిందూ సమాజానికి పట్టవు. ఇక్కడ మీడియా రంగం కూడా వ్యవహరించిన తీరు ఎంతో గర్హించదగినది. ప్రపంచంలో అనేక దేశాలలో అమెరికా అండదండలతో క్రైస్తవం ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఎక్కడోదాక అవసరం లేదు - కేరళ, తమిళనాడులలో క్రైస్తవుల అకృత్యాలే అనేకం. వాటిని విచారణ జరిపించి దోషులను శిక్షించారా? కేరళలో నన్స్ పై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి పుస్తకాలే వచ్చాయి. అధికారుల అండదండల కారణంగా వేటిపైన సరియైన చర్య తీసుకోలేదు. పెరిగిపోతున్న క్రైస్తవుల అరాచకాల గురించి అనేక మంది పెద్ద మనుషులను వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమ బాధను, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. కాని క్రైస్తవానికి వ్యతిరేకంగా గళం మాత్రం విప్పరు. ఇది కాంగ్రెసుకు కలిసి వస్తున్నది. ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం చేజారుతున్న తన ఆశలను పెంచుకొనేందుకు ఏమైనా చేసేందుకు సిద్ధం కావచ్చు. మైనార్టీల సంరక్షణ పేరుతో హిందూ సంస్థలను స్వామీజీలను వేధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది హిందూ సమాజానికి ఒక హెచ్చరిక.

వైరము లేని హింసను చేయటానికి సిద్ధపడని హిందూసమాజం తన పైన శతృత్వం వహించి పని చేస్తున్న శక్తులను గుర్తించే పరిస్థితులు లేవు. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ కేవలం ఆధ్యాత్యిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి జనకల్యాణ పరిషత్ స్థాపించారు. దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు వారి మార్గదర్శనంలో నడుస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలని క్రైస్తవులు అనుకొని ఉండి ఉండవచ్చు. వాళ్లకు ప్రభుత్వాలు సహకరిస్తూ ఉండి ఉండవచ్చు. ఇది ఈ రోజు హిందూ సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు. ఈ సవాలును స్వీకరించి ఆ ఎత్తుగడలను వమ్ము చేయగలుగుతామా?

యుపిఎ ప్రభుత్వం 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నుండి హిందూ సమాజంలోని పెద్దలు, స్వామీజీల సంస్థలను నైతికంగా (తాత్కాలికంగానైనా) దిగజార్చాలనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఇది గమనించదగ్గ పరిణామం.

దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దూషణల పర్వం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక కావలసింది ప్రజలను గందరగోళంలో పడేయటం. దానిద్వారా తిరిగి అధికారం కాపాడుకోగలుగుతామా అన్నది ఇప్పటి కాంగ్రెస్ వ్యూహం. దీనిని జాగ్రత్తగా గమనించి మరిన్ని దాడులు జరగకుండా హిందూసమాజం అప్రమత్తం కావాలి. మీడియా ఎత్తుగడలను కూడా గమనించాలి. అప్పడు మనం మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం.

9 సంవత్సరాల కంచి కథకు ఇప్పుడు ముగింపు లభించింది. భవిష్యత్తులో మరిన్ని కథలు నిర్మాణం కాకుండా చూసుకోవటం ఇప్పుడు హిందూ సమాజం ముందున్న కర్తవ్యం.
- రాము