సామాన్య ప్రజలలో శ్రేష్ఠ భావాలను నింపటమే సంఘం చేస్తున్న పని

ప్రథమవర్ష సంఘశిక్షావర్గ సార్వజనికోత్సవ సభలో పశ్చిమాంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ ఏలె శ్యాంకుమార్

ప్రథమవర్ష సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవంలో వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ ఏలె శ్యాంకుమార్ జీ - పశ్చిమ ఆంధ్ర ప్రాంత ప్రచారక్. వేదికపై ఆసీనులైన డా.జలపతిరావు వర్గ సర్వాధికారి, శ్రీ అవ్వా సీతారామారావు ముఖ్య అతిథి, శ్రీ ప్యాటా వెంకటేశ్వరరావు ప్రాంత సంఘచాలక్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో జాతీయభావ వ్యక్తిత్వ నిర్మాణం కొరకు విశేష ప్రయత్నం జరుగుతుంది. కార్యకర్తలలో కర్తృత్వం, నేతృత్వం వికసింపచేసేందుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. సంఘంలో కార్యకర్తల శిక్షణకు ప్రత్యేక స్థానము ఉంది. సంఘంలో ప్రతి కార్యకర్త ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్షల శిక్షావర్గలలో 65 రోజులు శిక్షణ పొందుతారు. సంఘము ప్రారంభించిన కొద్ది సంవత్సరాల నుండే ఈ శిక్షావర్గలు ప్రారంభమైనాయి. 

సంఘ శిక్షావర్గలో శారీరిక్, బౌద్ధిక్, సేవా, శ్రమానుభవము, ఘోష్, ప్రచార విభాగము, సమయపాలన (ఏ సమయంలో ఏయే పనులు చేయాలి, దానిని ఎట్లా యోజన చేసుకోవాలి) వంటి అంశాలను చెప్పకుండానే నేర్పిస్తారు. శిక్షావర్గ సమయంలో దేశంలో అఖిల భారత కార్యకర్తల నుండి అన్ని స్థాయిలలోని కార్యకర్తలు అదే పనిలో ఉంటారు. ఈ సంవత్సరం (2013) సంఘ శిక్షావర్గలు ప్రథమ, ద్వితీయ వర్షలు పశ్చిమ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి పూర్తయ్యాయి. తృతీయవర్ష శిక్షావర్గ కూడా జూన్ 7వ తేదీన పూర్తి అయింది. ప్రథమవర్ష సంఘశిక్షావర్గ మే 5న ఘటకేసర్ మండలంలోని అన్నోజిగూడా రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ప్రారంభమైంది. వర్గాధికారిగా ప్రముఖ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త అయిన డా.జలపతిరావు  (వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పదవీ విరమణ పొందారు) పాల్గొన్నారు. 

ప్రథమవర్ష సార్వజనికోత్సవము మే 24వ తేదీనాడు సా.6 గంటలకు అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యాకేంద్రం ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అవ్వా సీతారామారావుగారు (అగ్రిగోల్డ్ కంపెనీ యజమాని, 'నది' మాసపత్రిక యజమాని, సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు) పాల్గొన్నారు. ప్రాంత సంఘచాలకులు శ్రీ ప్యాట వెంకటేశ్వరరావు, ప్రధానవక్త శ్రీ శ్యామ్ కుమార్ (పశ్చిమాంధ్ర ప్రాంత ప్రచారక్) పాల్గొన్నారు. సార్వజనికోత్సవంలో శిక్షార్థులు వారు అభ్యసించిన శారీరిక అంశాలను ప్రదర్శించి చూపారు.   

ముఖ్య అతిథి ప్రసంగం 

వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ అవ్వా సీతారామారావు - ముఖ్య అతిథి

శారీరిక ప్రదర్శనల అనంతరం ముఖ్య అతిథి ప్రసంగిస్తూ - "ఈ రోజు దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. నాగరికత ముసుగులో దేశ ప్రజలలో చోటుచేసుకుంటున్న ప్రవృత్తులు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతున్నది. మన మేధావులు విదేశాలకు వెళుతున్నారు. వారి సేవలు అక్కడ ఉపయోగపడుతున్నాయి. ఈ రోజున దేశ ప్రగతికి సంఘం యొక్క అవసరం ఎంతో ఉన్నది. ఈ దేశ విలువలు కాపాడటంలో మీరు ఎంతో ముందున్నారు. ఈ దేశసంస్కృతిని కాపాడటంలో మీరు విశేష కృషి చేస్తున్నారు. సంఘము యొక్క పని ఇంకా వేగంగా పెరగాలని నేను కోరుకుంటున్నాను" అని పిలుపునిచ్చారు.

ప్రధానవక్త శ్రీ శ్యాంకుమార్ జీ సందేశం  

"రాష్ట్రీయ స్వయంసేవక సంఘము గడచిన 87 సంవత్సరాల నుండి పని చేస్తున్నది. ఒక చారిత్రక ఆవశ్యకతను పూరించటానికి సంఘం పనిచేస్తున్నది. భారత్ ఒక పురాతన దేశం. ప్రపంచ నాగరికత వికాసంలో, ప్రపంచానికి ఆధ్యాత్మి, ధార్మిక భావాలను అందించిన దేశం. ప్రపంచమంతా భారత్ ను ఎంతో గౌరవిస్తుంది. అటువంటి భారతదేశం విఘటితమై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. దేశ ప్రజలలో దేశభక్తిభావ రాహిత్యము, అనుశాసన రాహిత్యము, సామాజిక సమరసతను కోల్పోవటం, స్వపర భేదాలు విస్మరించిన కారణంగా నేడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. మహాభారతంలో ధర్మరాజు చెప్పిన "వయం పంచాధికం శతం" అనే సూత్రాన్ని గ్రహించలేకపోతున్నాము. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు డాక్టర్ జీ సంఘాన్ని ప్రారంభించారు. సంఘశాఖల ద్వరా దేశ ప్రజలలో దేశభక్తి భావన, సామాజిక ఐక్యతను నిర్మాణం చేయటానికి కృషి చేస్తున్నాము. 

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎమ్.ఎన్.రాయ్ అనేక సందర్భాలలో 'ఈ దేశంలోని సామాన్య వ్యక్తులలో శ్రేష్ఠమైన భావాలు నింపాల'ని చెప్పేవారు. కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతిగా తన వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ -'సామాజిక శాంతి హిందూ సమాజం ద్వారానే సాధ్యమవుతుంది' అని చెప్పారు. ఇలా అనేకమంది చెప్పిన విషయాలను సాధించేందుకు సంఘం కృషి చేస్తున్నది.   

ఒకప్పుడు లంచం ఇస్తానంటే 'నేను పిల్లలు గలవాడిని, ఈ పాపపు సొమ్ము నాకు వద్దు' అని అనేవారు. అదే ఈ రోజున 'నా పిల్లలు సుఖంగా ఉండాలి, అందుకే లంచం ఇవ్వండి' అని అడుగుతున్నారు. ఇదంతా సంస్కారాల లోపం వల్లనే జరుగుతున్నది. సమాజంలోని లంచగొండితనం, కుంభకోణాలు, స్త్రీలపై అత్యాచారాలు మొదలైన సమస్యలను తగ్గించుకొనేందుకు, లేకుండా చేసుకొనేందుకు నైతిక విలువలు కాపాడే విద్య కావాలి. సమాజంలో అంటరానితనం మొదలైన వికృతులను తొలగించి సామాజిక సమరసతను నిర్మాణం చేయటానికి సంఘం కృషి చేస్తున్నది. 

ఇటీవల చైనా మన భూభాలలోకి చొచ్చుకొని వచ్చింది. ఈ విషయంలో మన పాలకుల స్పందన, ప్రజల స్పందన అంతగా లేకపోవటం విచారకరం. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ఏ రకంగా మతం మారుస్తున్నారు? పెళ్లిళ్లు చేసుకొంటున్నారు? పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు చేసి అనేకమందిని హతమారుస్తున్నారు. క్రైస్తవంలో మతం మార్పిడి చేయటం వంటివి ఎక్కువైనాయి. అలా క్రైస్తవంలోకి మతం మారిన తరువాత ఆ వ్యక్తి పేరు మారుతున్నది, విధేయతలో మార్పు వస్తున్నది. కుటుంబ సంబంధాలలో మార్పు వస్తున్నది. ఈ దేశం పట్ల, ఈ సంస్కృతి పట్ల అతనిలో వ్యతిరేక భావాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి కారణము హిందూ సమాజంలో సామాజిక స్పృహ లేకపోవటం. హిందువులు జాగృతమై తమ సమస్యలు తామే పరిష్కరించుకొనేందుకు సంసిద్ధం కావాలి. అందుకే సంఘం హిందూ సమాజాన్ని జాగృతం చేయటానికి కృషి చేస్తున్నది. 

ఇటువంటి విషయాలు పట్టించుకోకుండా దేశం అభివృద్ధి కాదు. ప్రభుత్వాలు దేశం అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలు వేస్తున్నది కాని ప్రజలలో దేశం యెడల శ్రద్ధ నిర్మాణం చేయటానికి ప్రయత్నించటం లేదు. ఇది ఎట్లా ఉందంటే స్దామి రామతీర్థ చెప్పిన సూది కథలాగా ఉంది. ఒక ముసలి అవ్వ తన గుడిసెలో సూది పోగొట్టుకుంది. దాని కోసం బయట వెలుతురు ఉన్నదని బయట వెదుకుచున్నది. పోగొట్టుకున్న చోట వెతికితే సూది దొరుకుతుంది. కాని అలా చెయ్యలేదు. 

ప్రపంచంలోని ప్రజలందరూ సుఖంగా, ఆరోగ్యవంతంగా భద్రతతో ఉండాలని హిందుత్వము కోరుకుంటుంది. 'సర్వేజనా సుఖినో భవన్తు' అని కోరుకునే హిందువుకు లౌకికవాదం నేర్పవలసిన అవసరం లేదు. ప్రపంచం నుండి అనేక దేశాలవారు అనేక కారణాలతో ఈ దేశానికి వచ్చారు. ఇక్కడ సుఖంగా, సంతోషంగా ఉన్నారు. కారణం హిందువుల ఉదారభావము కలవారు కాబట్టి. మనదేశంలో లౌకికభావాలు పటిష్టంగా ఉన్నాయంటే హిందువులు అధిక సంఖ్యాకులు కాబట్టి. అదే మన చుట్టూ ఉన్న దేశాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మతతత్వము పెరుగుతున్నది. కారణం అక్కడి హిందువులు అల్పసంఖ్యాకులైనారు కాబట్టి. 400 సంవత్సరాలు పైగా ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం విషయంలో జరిగిన, జరుగుతున్న కథనాల విషయంలో సెక్యులరిస్టులు ఆలోచించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో హిందువులను తరిమేస్తున్నారు. ప్రపంచంలో ఇస్లాం వ్యాప్తికి, కమ్యూనిజం వ్యాప్తికి కోట్లమంది ప్రజలను చంపివేశారు. అటువంటి వారిని సెక్యులరిస్టులుగా ఇక్కడి మేధావులు చెప్పటం ఎంతో విచారకరం. ఈ పరిస్థితులలో మార్పు రావాలి. ధర్మం ఆధారంగా ఈ సమాజాన్ని జాగృతం చేయాలి. ఈ రోజున ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. జావాలో 10 లక్షల మంది ముస్లింలు హిందువులుగా మారారు. ఇస్లాంలోని షియాలు, సన్నీలు పరస్పరం దాడులు చేసుకొంటున్నారు. వారిలో సహోదర భావం ఎక్కడ ఉంది? 

క్రైస్తవం కూడా తగ్గిపోతున్నది. వాళ్లు చర్చిలు అమ్మేస్తున్నారు. అమెరికా పార్లమెంటులో దీపావళి పండుగ జరుగుతోంది. కొన్ని దేశాల పార్టమెంటులలో ప్రమాణ స్వీకారం సమయంలో గాయత్రీ మంత్రం చదువుతున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అనేకమంది విదేశీయులు మన దేశానికి వస్తున్నారు. ఇటీవల వాటికన్ నుండి వచ్చిన కొందరు క్రైస్తవులు హిందుత్వములోకి వచ్చారు. చర్చిలలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయలేక అనేక వత్తిడుల కారణంగా పోప్ కారణంగా రాజీనామా చేశారు. ఈ మధ్య ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలో '112వ పోప్ తరువాత క్రైస్తవం ఉండదని గతంలో ఒక పోప్ చెప్పినట్లు'గా వచ్చింది. ఈ రోజున ప్రపంచమంతా హిందుత్వం గురించి ఆలోచిస్తున్నది. హిందుత్వ భావాలను శక్తివంతం చేయాలి" అని పిలుపునిస్తూ శ్రీ శ్యాంకుమార్ జీ తమ ఉపన్యాసం ముగించారు.

సార్వజనికోత్సవంలో శారీరిక విన్యాసాల ప్రదర్శన చేస్తున్న శిక్షార్థులు