తల్లి, తండ్రి తరువాతి గౌరవనీయ స్థానం గురువుదే

భగవాధ్వజం
 
భారతీయ ఆర్ష సంస్కృతి జీవన విధానంలో గురువుకు అత్యంత గౌరవనీయ ప్రాధాన్యము ఇవ్వటం జరిగింది. సమాజంలో తల్లి, తండ్రి తరువాత అత్యంత గౌరవనీయ స్థానం గురువుకు ఇవ్వడం జరిగింది. అందుకే వైదిక సాహిత్యంలో తైత్తిరీయ ఉపనిషత్తులో విద్యార్థుల స్నాతకోత్సవ హిత వాక్యాలలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని విద్యార్థులకు హితము బోధించడం జరుగుతుంది. అనగా విద్యార్థి దశను పూర్తి చేసుకొని ఉద్యోగ ధర్మంలో ప్రవేశించే ముందు ఆశ్రమంలోని గురువు చదువు పూర్తి చేసుకున్న స్నాతకోత్సవ విద్యార్థి చేత తల్లి, దండ్రులను, గురువును గౌరవించాలని సూచిస్తూ ప్రమాణం చేయిస్తాడు. భారతీయ సమాజంలో గురువుకు అంత అద్వితీయ స్థానాన్ని చేకూర్చడం జరిగింది.

గురువు అనే పదంలో 'గు' అనే అక్షరం చీకటి అనే అర్థాన్ని సూచిస్తుంది. అలాగే 'వు' అనే అక్షరం వెలుతురును సూచిస్తుంది. గురువు అనగా గాడాంధకారము వంటి అజ్ఞానము అనే అంధకారమును ఛేదిస్తూ విజ్ఞానము అనే వెలుగు ప్రసరింపచేసే వారే గురువు'. అనగా మనలను అజ్ఞానము నుంచి విజ్ఞానము వైపుకు నడిపించువారే మన గురువులు.

అలాంటి గురువులను గౌరవించుటకు వారికి కృతజ్ఞతలు తెలియచేయుటకు వీలుగా మన ఋషి సాంప్రదాయంలో గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమను గురుపూజా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆధునిక విద్యా విధానంలో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న గురుపూజా దినోత్సవంగా జరుపుతున్నప్పటికీ అనాదిగా ఈ పుణ్యభూమి ఋషి ప్రోక్తమైన పంచాంగం ఆధారంగా వస్తున్న ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజునే వ్యాసపూర్ణిమ గురుపూజోత్సవాన్ని జరుపుకోవటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

ప్రాచీన వైదిక సాహిత్యాన్ని అంతటిని అధ్యయన యోగ్యంగా ఉండటానికి వీలుగా వ్యాస మహర్షి వేదాలను నాలుగు భాగాలుగా వర్గీకరించి ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగాను, అటు తరువాత వేదమము యొక్క చివరి భాగాలను (వేదాంతాలను) బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులుగాను విభజించి ఆర్ష వాఙ్మయాన్ని మనకు అందించారు. అలాగే పంచమ వేదమైన భారతాన్ని, అష్ఠాదశ పురాణాలను మనకు అందించిన జగత్ గురువు వారు. అందుకే ఆ మహర్షి పేరున ఈ గురుపూజోత్సవ దినోత్సవాన్ని వ్యాస పూర్ణిమగాను, గురుపూర్ణిమగాను మనం జరుపుకుంటున్నాము. అందుకే ఋషి సంప్రదాయంలో సదాశివ, వ్యాస, బాదరాయణ, శంకర అని గురు పరంపరను స్మరిస్తూ ప్రార్థనా శ్లోకం కూడా మనం చెప్పుకుంటాము.

ప్రాచీన విద్యా విధానంలో ఋషుల ఆధ్వర్యంలో గురుకులాలలో విద్యాబోధన జరిగేది. బాలుడికి 7 సంవత్సరములు నిండగానే ఉపనయన సంస్కారము జరిపి ఈ గురుపూర్ణిమ నుండి గురుకులాలలో విద్యార్థులను చేర్పించేవారు. అలాగే 12 సంవత్సరముల వేదాధ్యయన ఇతర వైదిక విద్యలు పూర్తి అయిన తరువాత 21 సంవత్సరముల వయసు వచ్చిన తరువాత తిరిగి ఇదే గురుపూర్ణిమ నాడు స్నాతకోత్సవం జరిపి గురుదక్షిణ సమర్పణ చేసి సమాజంలో యోగ్యమైన, సచ్చీలురుగా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా గురుకులాల నుండి బయటకు వచ్చేవారు.

ఈ గురుపౌర్ణమి కేవలం విద్యార్థులకే కాకుండా మోక్షం కోసం తపించే మునులకు, ఋషులకు, గురువులకు, సన్యాసాశ్రమం స్వీకరించిన సన్యాసులకు, సన్యాసాశ్రమం స్వీకరించాలనే కోరికతో వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు ఈ గురుపౌర్ణమి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

గురుపౌర్ణమికు ముందుగా వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశి (దీనినే తొలి ఏకాదశి అంటారు) రోజు నుండి పైన తెలిపిన మునులు, ఋషులు, గురువులు, పీఠాధిపతులు ఏకాదశి నుండి చాతుర్మాస్య దీక్షను ప్రారంభించి పౌర్ణమి (గురుపౌర్ణమి) రోజున వారి సన్యాసాశ్రమం ప్రసాదించి మంత్రోపదేశం చేసిన గురువులకు కృతజ్ఞతా పూర్వకంగా యధాశక్తిగా సన్మానించి గౌరవించడం ఋషి సాంప్రదాయంలో వస్తున్న ఆచారం. చాతుర్మాస్య దీక్ష అనగా గురువులు, పీఠాధిపతులు ఈ రోజు నుండి 2 నెలలు (నాలుగు పక్షాలు) ఇతరత్రా ఎక్కడ సంచారం చేయకుండా ఒకే గ్రామ పొలిమేరలకు పరిమితమై వారి ఉపాసనను, అధ్యయనాన్ని పునశ్చరణ చేయటం. అలాగే సంవత్సరంలోని అన్ని ఋతువులు మాసాలలోకెల్లా ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి ప్రారంభమయ్యే రెండు నెలల కాలం వారికి తపస్సు చేసుకోవటానికి అత్యంత అనువైన కాలం. తీవ్ర వేడి, చలిగాలులు లేకుండా సమ శీతోష్ణత కలిగి ఉంటుంది. కనుకనే ఋషులు ఈ చాతుర్మాస్య దీక్షను పాటిస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే మన పూర్వీకులు ఈ గురుపూర్ణిమను శిష్య పరంపరగా వారి గురువులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ వారిని స్మరిస్తూ గురుపూర్ణిమ జరుపుకుంటారు. 
 
అంతటి విశిష్టమైన స్థానం ఉన్నందువలనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ గురుపూర్ణిమను సంవత్సరానికి ఒక రోజు శాఖలలో నిర్వహించి ఈ దేశానికి సమర్పణ భావంతో ధ్వజం ముందు నిలబడి వారి శక్తి అనుసారంగా సమర్పణ చేసే అవకాశాన్ని కలిగిస్తుంది.  
 
గురుపూజా ఉత్సవంలో భగవాధ్వజానికి పూజ చేస్తున్న ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలక్ పూజనీయ శ్రీ మోహన్ భాగవత్

- పతికి