మార్పుకు ఈ ఎన్నికలు నమూనా కావాలి


కలియుగాబ్ది 5116 , శ్రీ జయ నామ సంవత్సరం,
  చైత్ర మాసం
 

16వ భారత పార్లమెంట్ ఎన్నికల కోలాహలం పెరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా 6 నెలల ముందునుంచే ఎన్నికల సభలు ప్రారంభమైనాయి. పరస్పర నిందారోపణలు కూడా సాగిపోతున్నాయి. రాబోవు రోజులలో దేశ రాజకీయాలలో పెను మార్పులకు సంకేతంగా ఈసారి రాజకీయ వలసల జోరు పెరిగింది. ఇది వలసల నామ సంవత్సరంగా మారిపోయేట్లుగా ఉంది. కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు కూడా కొందరు బయటకు వచ్చి సురక్షిత పార్టీల కోసం వెతుకుతున్నారు. అలా కొందరు బిజెపిలో చేరారు. రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.

ఈసారి జరిగే ఎన్నికలను అధ్యయనం చేయటానికి ప్రపంచమంతటి నుంచి ఇప్పటికే 45 దేశాలకు సంబంధించినవాళ్ళు భారత్ కు చేరుకొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ దేశాల పత్రికలలో ఈ ఎన్నికలు పతాక శీర్షికలకు ఎక్కేశాయి. ప్రపంచమంతా భారత్ లో ఎన్నికలు ఎప్పడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నది.

ఈసారి జరుగుతున్న ఎన్నికల విశేషాలలో 1) ఇప్పుడున్న ప్రభుత్వంలోని మంత్రులు కొందరు ఎన్నికల యుద్ధం జరగకముందే అస్త్ర సన్యాసం చేసేసారు. ఈసారి ఎన్నికలలో పాల్గొనటం లేదని మొహమాటం లేకుండా ప్రకటనలు చేసేసారు. ఇంకా కొందరు సురక్షిత స్థానాల వెతుకులాటలో పడ్డారు. కాంగ్రెసు మార్కు నాయకులకు యుద్ధం ప్రారంభం కాకముందే ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. 2) ఈసారి ఎన్నికలలో పార్టీలు కూటములుగా ఏర్పడటం విశేషంగా చోటు చేసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ లోనైతే మూడు కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇట్లా దేశంలో ప్రజలందరూ ఎన్నికల తేదీ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తుంటే నాయకులు సురక్షిత స్థానాల వెతుకులాటలో పడ్డారు. మొత్తంమీద ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయి.

ఈసారి ఎన్నికలలో అధిక శాతం ప్రజలు ఆరెనెలల ముందే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకోవటం విశేషం. అందరూ నిర్ణయించుకోకపోయినా ప్రాధాన్యత ఉన్న శాతం నిర్ణయించుకోవటం ఒక మంచి పరిణామం.

ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్నదనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క హిందుత్వ వ్యతిరేక ధోరణి కూడా ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నది. ఈసారి ఎన్నికలు ఈ దేశ ప్రజలకు ఒక అగ్నిపరీక్షే. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాల తీరుతెన్నులు, సంకీర్ణ ప్రభుత్వాల వ్యవహారము, అభివృద్ధి మొదలైన విషయాలపై ఇప్పటికే దేశం ఎంతో మూల్యం చెల్లించుకొంది. ఇంకా కలిగిస్తుంది. సుస్థిరమైన ప్రభుత్వం లేని కారణంగా నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి తీసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్.డి.ఏ. ప్రభుత్వ హాయాంలో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అర్థమవడానికి కొంత సమయం పట్టింది. అణ్వస్త్రాలు అన్నవస్త్రాల కోసం చూసేవారికి సంతృప్తి నివ్వలేకపోయాయి.  ఇంకా కొన్ని మంచి పనులు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపినా పాలక భాగస్వామ్య పక్షాలు ఆటంకాలు కల్పించాయి.

కనుక ఈ ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఓటు వెయ్యాలి. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ సంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ భాగవత్ వందశాతం పోలింగ్ జరగాలని పిలుపునిచ్చారు. స్వయంగా వారు ఓటు వేశారు.

ప్రజలంతా సంకీర్ణ వ్యవస్థ లేని స్థిరప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడాలి. ఇదే ఓటర్లకు పెద్ద పరీక్ష. రవిశంకర్ గురూజీ కూడా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అన్నిరంగాల ప్రముఖులు ఎన్నికలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఇది ఒక మంచి మార్పుకు సంకేతం. ప్రజలందరు కృతనిశ్చయంతో మంచి ప్రభుత్వం వచ్చేందుకు ఓటెయ్యాలని లోకహితం పత్రిక కూడా ప్రజలకు పిలుపునిస్తున్నది.